ఇంట్లో ఉన్నా వడదెబ్బ ముప్పు!.. ఎండలతో పెరుగుతున్న రూమ్ టెంపరేచర్లు 

ఇంట్లో ఉన్నా వడదెబ్బ ముప్పు!.. ఎండలతో పెరుగుతున్న రూమ్ టెంపరేచర్లు 
  • సాధారణంగా 26–28 డిగ్రీలు ఉండాల్సింది.. 38–40 డిగ్రీలు నమోదు
  • ఇంట్లో ఉన్నప్పటికీ జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ల సూచన

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎండలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరువయ్యాయి. ఎండల భయంతో బయట అడుగుపెట్టాలంటేనే జనం జంకుతున్నారు. దీంతో చాలామంది ఇండ్లకే పరిమితమవుతున్నారు. అయితే ఇంట్లో ఉన్నప్పటికీ, తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

‘‘ఎండలతో పాటు వడగాలులు కూడా పెరిగాయి. దీంతో రూమ్ టెంపరేచర్స్​ పెరుగుతున్నాయి. ఇండ్లలో ఉన్నవారు సైతం వడదెబ్బ బారినపడుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, మహిళలు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నోళ్లపై వడగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటోంది. అందుకే ఇంట్లో ఉన్నోళ్లు సైతం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి” అని డాక్టర్లు సూచిస్తున్నారు. 

ఎండల కారణంగా రూమ్ టెంపరేచర్స్​కూడా పెరుగుతున్నాయి. సాధారణంగా రూమ్ టెంపరేచర్స్​26 నుంచి 28 డిగ్రీల మధ్య ఉండాలి. కానీ ప్రస్తుతం రూమ్ టెంపరేచర్స్​38 నుంచి 40 డిగ్రీల దాకా నమోదవుతున్నాయి. దీంతో రూమ్ వేడెక్కి, ఆ ప్రభావం శరీరంపై పడుతుంది. శరీరాన్ని చల్లబరచడానికి బాడీలోని వాటర్ బయటకు వస్తుంది. దీంతో డీహైడ్రేషన్​కు గురై వడదెబ్బ బారినపడుతున్నారు.

బయట తిరిగితే వచ్చే ఎండదెబ్బ ఎంత ప్రమాదకరమైనదో, ఇండోర్ హీట్​స్ట్రోక్​కూడా అంతే ప్రమాదకరమని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ‘‘ఇరుకు రూముల్లో కిటికీలు, డోర్లు మూసి ఉంచొద్దు. అలా మూసి ఉంచితే ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. కిటికీలు, డోర్లు ఎల్లప్పుడూ ఓపెన్ చేసి ఉంచాలి. వేడిగాలి లోపలికి రాకుండా తడి పరదాలు కట్టుకోవాలి. రూమ్ టెంపరేచర్లు పెరిగితే ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లు వేసి చల్లబరచుకోవాలి. రూమ్ టెంపరేచర్ 25 నుంచి 30 డిగ్రీల మధ్య ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, మహిళలు ఇండోర్​హీట్​స్ట్రోక్​ బారినపడుతున్నారు. ప్రతి అరగంటకు ఒకసారి నీళ్లు తాగాలి. డీహైడ్రేషన్ కు గురైనప్పడు కూల్ డ్రింక్స్​తీసుకోవద్దు” అని సూచిస్తున్నారు.  


 తీసుకోవాల్సిన జాగ్రత్తలివీ... 

 

  •     రూమ్ టెంపరేచర్ 26 నుంచి 28 డిగ్రీల మధ్య ఉండేలా చూసుకోవాలి. 
  •     ప్రతి అరగంటకు ఒకసారి వాటర్ తాగుతూ ఉండాలి. రోజుకు కనీసం 4 నుంచి 6  లీటర్ల వాటర్ తాగాలి. 
  •     ఇంట్లో ఉన్నప్పుడు కూడా కాటన్​దుస్తులనే వాడాలి. 
  •     కిటికీలు, డోర్లు ఓపెన్ చేసి ఉంచాలి. వేడిగాలి నేరుగా లోపలికి రాకుండా కర్టెన్స్​కట్టాలి. 
  •     చల్లగాలి కోసం అవసరమైతే కిటికీలకు తడి పరదాలు, థర్మకోల్​షీట్స్ కట్టాలి.  
  •     వృద్ధులు ఎక్కువగా మజ్జిగ, నిమ్మరసం తీసుకోవాలి. 
  •     పిల్లలు, గర్భిణులు పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలి. 
  •     వడదెబ్బ తగిలినవారు కూల్​డ్రింక్స్​అస్సలు తాగొద్దు. 
  •     సాధ్యమైనంత వరకు మసాల ఫుడ్స్​కు దూరంగా ఉండాలి. 
  •     వడదెబ్బకు గురైతే తడిబట్టతో బాడీని తుడుచుకోవాలి. 

ఇండ్లను చల్లగా ఉంచుకోవాలి.. 

సమ్మర్​లో బాడీ టెంపరేచర్​ 99 డిగ్రీల ఫారన్​ హీట్​​  దాటితే చెమట రూపంలో నీరు బయటకు వెళ్లిపోతుంది. దీంతో ఆ వ్యక్తి డీహైడ్రేషన్​కు గురయ్యే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు వడదెబ్బ తగిలిన వ్యక్తి కోమాలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంది. సాధ్యమైనంత వరకు ఇండ్లను కూల్​గా ఉంచుకోవాలి. రోజూ కనీసం 4 నుంచి 6 లీటర్ల నీళ్లు తాగాలి. డీహైడ్రేషన్ బారినపడిన వాళ్లు సాఫ్ట్ డ్రింక్స్​ తీసుకోకుండా నిమ్మరసం, మజ్జిగ, పండ్ల రసాలు, ఓఆర్ఎస్​లాంటి ఎనర్జీ డ్రింక్స్ తీసుకోవాలి. 
‑ డాక్టర్​విజయభాస్కర్, ఎథిక్స్ కమిటీ చైర్మన్, క్లినికల్ రీసెర్చ్ అండ్ ట్రయల్స్ సెంటర్, హైదరాబాద్