పరిచయం : రిజెక్షన్​ను అర్థంచేసుకోవాలి

పరిచయం : రిజెక్షన్​ను అర్థంచేసుకోవాలి

ఈ యంగ్​, ఎనర్జిటిక్ యాక్టర్ చైల్డ్​ ఆర్టిస్ట్​గా కెరీర్ మొదలుపెట్టి ఇప్పుడు లీడ్ రోల్స్ చేసే స్థాయికి ఎదిగాడు. ‘దంగల్​’ సినిమాలో అమీర్​ఖాన్​ పక్కన కనిపించిన ఆ కుర్రాడి పేరు రిత్విక్ సాహోర్.  స్కూల్లో చదివే టైంలోనే యాక్టింగ్ అవకాశాలు వచ్చాయి.మొన్నటివరకు యూత్​ఫుల్​ స్టోరీలో కనిపించిన రిత్విక్, రీసెంట్​గా ‘జమ్నాపార్’ అనే​ వెబ్​ సిరీస్​లో సీరియస్​ రోల్​లో కనిపించాడు. అతని ఇండస్ట్రీ జర్నీ గురించి.. 

మాది ముంబైలోని ఒక మిడిల్ క్లాస్​ ఫ్యామిలీ. ఇండస్ట్రీలో నా ప్రయాణం చైల్డ్​ ఆర్టిస్ట్​గా మొదలైంది. మొదటి అవకాశం 2012లో వచ్చింది. నా ఫస్ట్ మూవీ ‘ఫెరారీ కి సవారీ’. అప్పుడు నా వయసు పన్నెండేళ్లు. ఆ సినిమాలో శర్మన్​ జోషి కొడుకు పాత్రలో చేశా. ఆ తర్వాత 2016లో ‘దంగల్’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ ఛాన్స్​ వచ్చింది. అదే ఏడాది టీవీలో ‘ది గుడ్ కర్మ హాస్పిటల్’ అనే సీరియల్​లో అతుల్ అనే క్యారెక్టర్​లో నటించా. వెబ్​ సిరీస్​ డెబ్యూ కూడా అదే ఏట జరిగింది. ‘లాఖోం మై ఏక్’ అనే సిరీస్​ ఫస్ట్​ సీజన్​లో ఆకాశ్ అనే పాత్రలో నటించా. 

అలా నా జర్నీ మొదలు 

నేనేం చేయాలనుకున్నా అందుకు సపోర్ట్​గా ఉంటారు అమ్మానాన్న. నేను యాక్టింగ్ చేస్తానని వాళ్లెప్పుడూ అనుకోలేదు. ఇప్పుడు నేను మూవీ చేస్తున్నానంటే వాళ్లకు సర్​ప్రైజింగ్​గా అనిపించింది. ఎందుకంటే యాక్టర్​ అవ్వాలని నేను కూడా ఎప్పుడూ అనుకోలేదు. ఒకసారి మా పేరెంట్స్​తో కలిసి మాల్​కి వెళ్లా. అక్కడ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ నన్ను చూసి ‘మూవీకి వర్క్​షాప్స్ జరుగుతున్నాయి.  ట్రై చేస్తావా?’ అని అడిగారు. అప్పుడు మా నాన్న ‘నీకు చేయాలనిపిస్తే ఒకసారి ట్రై చెయ్​’ అన్నారు. అలా దాదాపు మూడు నెలలు వర్క్​షాప్​కి వెళ్లా. అక్కడ వాళ్లు ట్రైనింగ్​ ఇచ్చారు.

డైలాగ్స్ ప్రాక్టీస్ చేయించారు. ఆ తర్వాత ఆ సినిమాలో ఒక రోల్​కు నన్ను సెలక్ట్ చేశారు. దాంతో మా పేరెంట్స్ చాలా సంతోషించారు. అలా నా జర్నీ మొదలైంది. ‘ఫెరారీ కీ సవారి’ తర్వాత మూడేండ్లు బ్రేక్ వచ్చింది. అందుకు కారణం యాక్టింగ్​ మొదలుపెట్టాక,  సినిమా ప్యాషన్ అయిపోయింది నాకు. అప్పుడు మా నాన్నతో ‘నాకు నచ్చింది చేస్తా’ అని చెప్పా. అందుకు ఆయన అడ్డు చెప్పలేదు. కాకపోతే చదువు పూర్తయ్యాక వెళ్లమన్నారు. అలా పదోతరగతి పూర్తయ్యాక ‘దంగల్​’లో చేశా. అమీర్​ఖాన్​తో కలిసి నటించడం మర్చిపోలేని ఎక్స్​పీరియెన్స్.

అందులో ఒక ఫ్యామిలీగా నటించిన వాళ్లమంతా షూటింగ్​లో కూడా అలానే ఉండేవాళ్లం. అమీర్​ఖాన్​ మాతో కలిసిపోయి మాట్లాడేవారు. మొదటి సినిమా చేసినప్పుడు నేను చిన్నపిల్లాడిని కాబట్టి అందరూ నన్ను గారాబం చేసేవారు. అప్పుడు నేను చాలా కొత్త విషయాలు నేర్చుకున్నా. ఆ ఎక్స్​పీరియెన్స్​ ఒక అద్భుతంలా అనిపిస్తుంది. చిన్నప్పుడు నేను అంత మాట్లాడేవాడ్ని కాదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇంట్రావర్ట్​ని. మొదటి సినిమా చేశాక కెమెరా ముందు కంఫర్టబుల్​గా ఉండడం అలవాటైంది. 2019లో ‘లెట్స్ క్రాక్ ఇట్​ – స్టూడెంట్ యాంథమ్’​, 2020లో ‘యే సారీ బాత్’​ అనే రెండు మ్యూజిక్ వీడియోల్లో నటించా. 

మొదటి వెబ్ సిరీస్

నా ఫేవరెట్ కమెడియన్లలో ఒకరు విశ్వ. ఆయన స్టాండప్​ కమెడియన్, యూట్యూబర్, రైటర్​. ఆయన్ని చూసినప్పుడల్లా ఎంజాయ్ చేస్తా. ఆయన ‘లాఖోం​ మే ఏక్’ వెబ్​ సిరీస్​కి స్క్రిప్ట్ రాసుకున్నారు. అందులో నాకు ఒక పాత్ర చేసే అవకాశం ఇచ్చారు. అందులో సెలక్ట్ అయ్యాక ప్రిపరేషన్​ టైం ఐదు రోజులే ఉంది. అయినప్పటికీ మేం ఇద్దరం కలిసి నటించడం సంతోషాన్నిచ్చింది. నిజానికి నేను అది ఫన్ వెబ్ సిరీస్​ అనుకున్నా. స్క్రిప్ట్ చదివాక కానీ అర్థంకాలేదు అది చాలా సీరియస్ కాన్సెప్ట్ అని. దాంతో కచ్చితంగా అందులో నటించాలని ఫిక్స్ అయ్యా. అందులో చేసిన స్టూడెంట్ క్యారెక్టర్ చాలా డిఫరెంట్​గా, ఛాలెంజింగ్​ అనిపించింది. షూటింగ్ మాత్రం చాలా ఫన్నీగా జరిగింది.

జమ్నా పార్​

జమ్నాపార్​ వెబ్​ సిరీస్​ స్క్రిప్ట్ చదవగానే నాకు చాలా నచ్చింది. ఇలాంటి క్యారెక్టర్స్ కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్నా. అందుకే అవకాశం రాగానే ఓకే అన్నా.​ స్క్రిప్ట్ చాలా పర్ఫెక్ట్​గా  అనిపించింది. ఈ సిరీస్​లో నా క్యారెక్టర్​కి, రియల్ లైఫ్​లో నేను ఉండే విధానానికి కొంత మ్యాచ్ అవుతుంది. ఈ క్యారెక్టర్​లో నటించడం వల్ల ఒక విషయం కోసం ఎంతవరకు వెళ్లగలం? ఎక్కడి వరకు హద్దులు పెట్టుకోగలం? వంటి విషయాలు తెలుసుకున్నా. ఇలాంటి టీంతో కలిసి పనిచేయడం మంచి ఎక్స్​పీరియెన్స్​. 

షూటింగ్​కి ముందు నా ప్రిపరేషన్ 

ఆ రోజు ఏ సీన్ షూటింగ్​ చేస్తున్నారో తెలుస్తుంది. కాబట్టి షూటింగ్ జరిగే దగ్గర​కి వెళ్లేవరకు చేసే జర్నీలో  ఆ సీన్​కి తగ్గట్టు ఉండే సాంగ్స్ వింటా. ఉదాహరణకు బాధాకరమైన సీన్ చేయాల్సి ఉంటే, అలాంటి పాటలే వింటూ వెళ్తా. అప్పటికే స్క్రిప్ట్ చదివి, కథను అర్థం చేసుకుని ఉంటా. క్యారెక్టర్ ఏంటి? ఎలా పర్ఫార్మ్‌ చేయాలి? అనేది తెలుస్తుంది. దాన్ని బట్టి యాక్టింగ్ చేస్తా. నాకు తెలిసి ఒక యాక్టర్​కి డిఫరెంట్ క్యారెక్టర్స్​ని అబ్జర్వ్​ చేసే గుణం ఉండాలి. ఎందుకంటే అలా చేస్తే అలాంటి పాత్రలు వచ్చినప్పుడు రియలిస్టిక్​గా నటించొచ్చు. యాక్టింగ్​లో నాకు ఎటువంటి ట్రైనింగ్​ లేదు. నేను యాక్టింగ్ నేర్చుకోలేదు. కానీ, అనుభవాల నుంచి చాలా నేర్చుకున్నా. నేనేం ఫీలయ్యానో అదే  ప్రెజెంట్ చేస్తా నా యాక్టింగ్​లో. 

పాజిటివ్​గా ఉండాలి

 సోషల్ మీడియాలో పది కామెంట్స్​లో తొమ్మిది మంచివే ఉంటాయి. కానీ, మన అటెన్షన్ ఎలా ఉంటుందంటే.. బాగోలేని ఆ పదో కామెంట్ మీదే ఉంటుంది. దాంతో సెల్ఫ్​ డౌట్ ఏర్పడుతుంది. నెమ్మదిగా నాకు అర్థమైన విషయం ఏంటంటే.. ప్రతి ఒక్కరినీ మనం సంతోష పెట్టలేం. అయినా పర్వాలేదు. నూటికి నూరు శాతం నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. నువ్వు శాటిస్​ఫై అయ్యేవరకు వర్క్ చెయ్యి.

నీ ఎఫర్ట్స్ అన్నీ పెట్టు. అయినప్పటికీ ఎవరో ఒకరు విమర్శిస్తారు. దాన్ని పాజిటివ్​గా తీసుకుని ఇంకా మెరుగుపరుచుకోవాలి. ఇతరులతో పోల్చుకోవద్దు. ఎఫర్ట్స్ పెడితే దానికి తగిన ఫలితం వస్తుంది. కాకపోతే ఆ ఫలితం కొన్నిసార్లు వెంటనే రాకపోవచ్చు. అలాగని నిరాశపడకూడదు. ఇక కెరీర్ విషయానికొస్తే.. ఇప్పటికే స్కూల్, కాలేజీ స్టూడెంట్ రోల్స్ చాలా చేశా. రాబోయే క్యారెక్టర్స్ కొంచెం డిఫరెంట్​గా ఉండేలా ప్లాన్​ చేసుకోవాలి అనుకుంటున్నా. అలాగని ‘ఇలాంటి పాత్రలే చేయాల’ని ఏం లేదు. కథ బాగుంటే చేస్తా. 

ఆటంకాలు సహజం

ప్రతి ఒక్కరి జర్నీ ఒక దారిలో వెళ్తున్నప్పుడు ఆటంకాలు రావడం సహజం. అయితే ఎదురైన ఆ ఆటంకాలు పెద్దవా? చిన్నవా? అనేది పక్కనపెట్టాలి. నా  మొదటి ప్రాజెక్ట్​ ‘ఫెరారీ కీ సవారి’ సినిమా  తర్వాత మూడేండ్లు గ్యాప్ తీసుకోవడంతో నాకు అవకాశాలు సరిగా రాలేదు. ఆడిషన్స్ ఇచ్చా. కొందరిని కలిసి మాట్లాడా. అయితే మనదేశంలో టాలెంట్​ ఉన్న వ్యక్తులు చాలామంది ఉన్నారు. దాంతో ఒక దశలో ఇండస్ట్రీలో నాకు వర్క్​ ఉంటుందా? అనుకున్నా. అప్పుడు నా వయసు 16 ఏండ్లు. ఆ ఏజ్​లో ఇలాంటి ఆలోచన రావడంతో ఒత్తిడికి గురయ్యా.

లైఫ్​ని ఎంజాయ్ చేయాలి. కానీ, కాంపిటీటివ్ వరల్డ్​లోకి అంత త్వరగా వెళ్లకూడదు అనిపించింది. అయితే, బాగా బాధ అనిపించే విషయం ఒకటి ఉంది. అదేంటంటే.. ఈ ఫీల్డ్​లో రిజెక్షన్​ అనేది తేనె పూసినట్టు మెల్లగా చెప్పరు. ముఖం మీదే ‘నువ్వు సెలక్ట్ కాలేదు’ అని చెప్తారు. దాన్ని తీసుకోవడం కొన్నిసార్లు కష్టంగా అనిపిస్తుంది. కానీ నేను మాత్రం లైఫ్​లో అదంతా ఒక భాగం అని రియలైజ్​ అయ్యేవాడిని. 

ప్రజ్ఞ