ప్రతాని రామకృష్ణ గౌడ్ దర్శక నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘ఆర్కే దీక్ష’. కిరణ్ హీరోగా అక్సా ఖాన్, అలేఖ్య రెడ్డి హీరోయిన్స్‌గా నటించారు. సోమవారం ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. హీరో సుమన్, నిర్మాత సి కళ్యాణ్, తెలుగు ఫిలిం చాంబర్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్, నిర్మాతల మండలి సెక్రటరీ తుమ్మల ప్రసన్నకుమార్ అతిథులుగా హాజరై సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు.
ఈ సందర్భంగా ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ ‘షూటింగ్ ఇప్పటికే పూర్తిచేశాం. ఐదు పాటలు, మూడు ఫైట్స్‌తో అవుట్‌పుట్ బాగా వచ్చింది. దేశం కోసం ప్రాణాలు అర్పించిన మురళి నాయక్‌కు ఓ పాట ద్వారా ఈ చిత్రాన్ని అంకితం చేశాం’ అని చెప్పారు. ఒక వ్యక్తి దీక్షతో, పట్టుదలతో ఎలా ఎదుగుతారో ఈ చిత్రంలో చూడబోతున్నారని హీరో కిరణ్ అన్నాడు. నటులు అక్సా ఖాన్, మౌనిక రెడ్డి పాల్గొన్నారు.
