విహార యాత్రలో విషాదం.. నలుగురు మృతి

విహార యాత్రలో విషాదం.. నలుగురు మృతి
  • విమ్స్ హాస్పటల్ ప్రొఫెసర్ దంపతుల మృతి
  • చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన ఆమె అన్న,వదిన 
  • ముగ్గురి పిల్లల పరిస్థితి కూడా విషమం

విశాఖపట్నం నుండి దంతెవాడ వెళుతున్న ఒక కుటుంబం ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది.  కుటుంబ సభ్యులతో వెళుతున్న ఓ కారు చెట్టును ఢీకొన్న ఘటనలో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.  వివరాల్లోకి వెళితే విజయనగరం జిల్లా నెల్లిమర్లలోని విమ్స్ హాస్పటల్ లో ప్రొఫెసర్ గా పని చేస్తున్నడాక్టర్  సునీత..  ఆమె భర్త లక్ష్మణరావు, పిల్లలు శ్రేయ, అతుల్‌, అన్న వి.రమేష్‌, వదిన తులసి, మేనల్లుడు అమర్‌లతో కలసి 2 రోజుల క్రితం రైలులో ఛత్తీస్‌గఢ్‌ కు విహారయాత్రకు వెళ్లారు. అక్కడి పర్యాటక ప్రాంతాల సందర్శన కోసం  ఓ ప్రైవేటు కారును అద్దెకు తీసుకున్నారు. సోమవారం దంతెవాడలోని దంతేశ్వరి అమ్మవారిని దర్శించుకుని, జగదల్‌పుర్‌కు తిరిగి వస్తుండగా మధ్యాహ్న సమయంలో కారు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో డాక్టర్ సునీత, ఆమె భర్త లక్ష్మణరావు అక్కడికక్కడే మృతి చెందగా… జగదల్‌పుర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె అన్న వదినలు రమేష్‌, తులసి ప్రాణాలు వదిలారు.  చిన్నారులు ముగ్గురి పరిస్థితి కూడా విషమంగానే ఉందని డాక్టర్లు చెబుతున్నారు.