- ఆటోను వెనుక నుంచి ఢీకొట్టిన కారు, అదుపుతప్పి ఆగి ఉన్న లారీకి తగిలిన ఆటో
- ఇద్దరు మహిళలతో పాటు, 17 నెలల చిన్నారి మృతి
- 14 మందికి గాయాలు, నలుగురి పరిస్థితి సీరియస్
సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట జిల్లా కేంద్రం సమీపంలోని హైవేపై జరిగిన ప్రమాదంలో ఇద్దరు మహిళలతో పాటు 17 నెలల చిన్నారి చనిపోయింది. 17 మంది ప్రయాణికులతో ఓ ఆటో గురువారం అర్వపల్లి నుంచి సూర్యాపేట వస్తోంది. పట్టణ శివారులోని మానసనగర్ వద్దకు రాగానే ఆటోను వెనుక నుంచి కారు ఢీకొట్టింది. దీంతో ఆటో అదుపుతప్పి స్పీడ్‌గా వెళ్లి రోడ్డు పక్కనే ఆగి ఉన్న లారీకి తగిలింది.
ఈ ప్రమాదంలో బాలెంల సోషల్ వెల్ఫేర్ స్కూల్‌లో పనిచేస్తున్న పుట్టా సరిత (41), అర్వపల్లి మండలం కాసర్లపాడు గ్రామానికి చెందిన కొమ్ము సువర్ణ 17 నెలల కూతురు వేదస్విని స్పాట్‌లోనే చనిపోయారు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు గాయపడిన వారిని హాస్పిటల్‌కు తరలించారు. సూర్యాపేట ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటూ సూర్యాపేట మండలం లక్ష్మీతండాకు చెందిన లూనావత్ రుక్కమ్మ (55) చనిపోయింది.
మిగతా 14 మందికి గాయాలు అయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి సీరియస్‌గా ఉండడంతో హైదరాబాద్‌లోని గాంధీ, నిమ్స్ హాస్పిటల్స్‌కు తరలించారు. మిగతా 10 మందికి సూర్యాపేట ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ అందజేస్తున్నారు. కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే కలెక్టర్ వెంకట్‌రావు జిల్లా హాస్పిటల్‌కు వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. క్షతగ్రాతులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు 30 మంది డాక్టర్లను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. సీరియస్‌గా ఉన్న వారికి గాంధీ, నిమ్స్ డాక్టర్లతో మాట్లాడి మెరుగైన ట్రీట్‌మెంట్ అందజేస్తామన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, చనిపోయిన ఫ్యామిలీలను ఆదుకోవాలని ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి కోరారు.
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దిగ్భ్రాంతి
సూర్యాపేట సమీపంలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి చనిపోవడంతో మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. ఎవరూ అధైర్యపడొద్దని ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.