
సైబరాబాద్ లోని కేశంపెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ పై వెళుతున్న తండ్రీకొడుకులను ఎదురుగా వచ్చిన బొలెరో వాహనం ఢీకొంది. ఈ ఘటనలో తండ్రి చనిపోగా , కొడుకు తీవ్రగాయాలయ్యాయి. మంగళవారం ఉదయం భైర్ఖాన్‌పల్లి గ్రామ శివార్లలో ఓ మూలమలుపు(బ్లైండ్ కర్వ్) వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఆ మలుపు వద్ద రోడ్ పక్కనే ఉన్న ఓ బండరాయి ఈ ప్రమాదానికి ఓ కారణం. దాని వల్ల ఎదురెదురుగా వచ్చే వాహనాలు దూరం నుంచి ఒకదానికొకటి కనిపించక గతంలో కూడా ప్రమాదాలు జరిగాయి.
ప్రమాద ఘటన విషయానికి వస్తే.. యెర్రా పాండు(45) అనే వ్యక్తి తన కొడుకు శివ(15) తో కలిసి బైక్ పై (హీరో హోండా AP 29 Q 4998) సుభాన్‌పూర్ నుంచి కేశంపేట అల్వాల్ వైపు వెళుతుండగా.. . బైరన్‌ఖన్‌పల్లి గ్రామ శివార్లలో బొలెరో గూడ్స్ (TS06 UC 2938) బండి ఢీకొంది. అతి వేగంతో ఎదురెదురుగా వచ్చిన రెండు వాహనాలు మూల మలుపు వద్ద ఢీకొన్నాయి. ఈ ఘటనలో పాండు, శివకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే బొలెరో డ్రైవర్ వాహనంతో సహ అక్కడి నుంచి పరారయ్యాడు. బండి నంబర్ ప్లేట్ ప్రమాద స్థలంలోనే పడిపోయింది. స్థానికులు ప్రమాదాన్ని గుర్తించి తండ్రీకొడుకుల్ని శంషాబాద్‌లోని ట్రైడెంట్ ఆసుపత్రికి తరలిస్తుండగా పాండు మార్గమధ్యంలోనే మృతి చెందాడు. శివ తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నాడు
ఈ ఘటనపై సమాచారం అందుకున్న సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.. రెండు వాహనాల డ్రైవర్లు నిర్లక్ష్యాన్ని వహించారని చెప్పారు. బొలెరో వెహికల్ డ్రైవర్ అతి వేగం కారణం కాగా.. బైక్ నడిపిన శివకు డ్రైవింగ్ లైసెన్స్ లేదని, హెల్మెట్ ధరించలేదని అన్నారు. బొలెరో డ్రైవర్ ని త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఎవరైనా వాహనాలను నడిపితే.. వారికి బీమా క్లెయిమ్ చేయబడదని చెప్పారు. అంతేకాకుండా ఈ ప్రమాదానికి కారణమైన బండరాయిని స్థానికుల సహయంతో పగలగొట్టించారు.
కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ కారణంగా 22-03-2020 నుండి 07-05-2020 వరకు లాక్ డౌన్ ప్రకటించారని, ఈ సమయంలో ప్రజలు అనవసరంగా రోడ్లపై రాకూడదన్నారు. బైక్‌పై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని, హెల్మెట్ తప్పని సరిగా వాడాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రజలను అభ్యర్థించారు.