
- ముగ్గురు యువకులు మృతి, ఒకరికి తీవ్రగాయాలు
దేవరకొండ(చింతపల్లి ), వెలుగు: ఆటోను కారు ఢీ కొట్టడడంతో ముగ్గురు యువకులు మృతిచెందగా, ఒకరు తీవ్రంగా గాయపడిన ఘటన నల్గొండ జిల్లాలో హైదరాబాద్- నాగార్జునసాగర్ జాతీయ రహదారిపై జరిగింది. చింతపల్లి ఎస్ఐ రామ్మూర్తి తెలిపిన ప్రకారం..
జిల్లాలోని దేవరకొండ మండలం వడ్త్యా తండా(మట్టిక తండా)కు చెందిన రత్లావత్ వినోద్(26), తన ఆటోలో పెదనాన్న కొడుకు రత్లావత్ భాస్కర్(25), జరుపుల తండాకు చెందిన బంధువులు సపావత్ రవి (28), జరుపుల కృష్ణ కలిసి ఇంట్లోకి దసరా పండుగ సరుకులు తెచ్చేందుకు చింతపల్లి మండల కేంద్రానికి సోమవారం వెళ్లారు. కొనుగోలు చేసి తిరిగి ఆటోలో వెళ్తుండగా.. నాగార్జునసాగర్ – హైదరాబాద్ జాతీయ రహదారిపై నసర్లపల్లి గ్రామ సమీపంలో మల్లేపల్లి నుంచి సిటీకి స్పీడ్ గా వెళ్తున్న కారు ఢీకొట్టింది.
దీంతో ఆటోలోని భాస్కర్, వినోద్, రవి స్పాట్ లో చనిపోయారు. కృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందడంతో సీఐ రాజు సిబ్బందితో వెళ్లి గాయపడిన కృష్ణను చికిత్స కోసం, డెడ్ బాడీలను పోస్టుమార్టం కోసం దేవరకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడు వినోద్ తండ్రి బబ్లు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
కుటుంబాల్లో తీవ్ర విషాదం
దసరా పండుగను సంతోషంగా చేసుకుందామని ఇంట్లోకి సరుకుల తెచ్చేందుకు వెళ్లిన ముగ్గురు యువకులు మృతిచెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ముగ్గురి మృతితో తండాల్లో తీవ్ర విషాదం నెలకొంది.