కారును ఢీకొట్టిన బైక్‌‌.. తల్లీకొడుకు మృతి.. వేర్వేరు చోట్ల మూడు ప్రమాదాలు..

కారును ఢీకొట్టిన బైక్‌‌.. తల్లీకొడుకు మృతి.. వేర్వేరు చోట్ల మూడు ప్రమాదాలు..

 

  • మహబూబ్‌‌నగర్‌‌ జిల్లా కోయిలకొండ మండలంలో ఘటన
  • మెదక్‌‌ జిల్లాలో బైక్‌‌ను ఢీకొట్టిన లారీ, తల్లి మృతి, కొడుకు పరిస్థితి విషమం
  • భద్రాద్రి జిల్లాలో స్కూల్‌‌ బస్సు ఢీకొని చిన్నారి మృతి

కోయిలకొండ, వెలుగు : బైక్‌‌ను కారు ఢీకొట్టడంతో తల్లీకొడుకు చనిపోయారు. ఈ ప్రమాదం మహబూబ్‌‌నగర్‌‌ జిల్లా కోయిలకొండ మండలంలో మంగళవారం జరిగింది. ఎస్సై తిరుపాజి తెలిపిన వివరాల ప్రకారం... మండల పరిధిలోని వీరన్నపల్లికి చెందిన బాల్‌‌రాం (36) మండల కేంద్రంలో మిషన్‌‌ భగీరథ ఆపరేటర్‌‌గా పనిచేస్తున్నాడు. 

తన తల్లి ముత్యాలమ్మ (55)కు ఆరోగ్యం బాగా లేకపోవడంతో మంగళవారం బైక్‌‌పై మహబూబ్‌‌నగర్‌‌ తీసుకెళ్లాడు. అక్కడ హాస్పిటల్‌‌లో చూపించుకున్న తర్వాత తిరిగి గ్రామానికి వస్తున్నారు. ఈ క్రమంలో దమ్మాయిపల్లి స్టేజీ సమీపంలోకి రాగానే బైక్‌‌ను కారు ఢీకొట్టింది. దీంతో బాల్‌‌రాం, ముత్యలమ్మ అక్కడికక్కడే చనిపోయారు. బాల్‌‌రాం భార్య తూంకుంట నాగమణి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

తల్లి మృతి, కొడుకు పరిస్థితి విషమం

మెదక్, వెలుగు : బైక్‌‌ను లారీ ఢీకొట్టడంతో తల్లి చనిపోగా.. కొడుకు పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన మెదక్‌‌ జిల్లా నార్సింగి మండలం వల్లభాపూర్‌‌ వద్ద మంగళవారం సాయంత్రం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వల్లభాపూర్‌‌ గ్రామానికి చెందిన ముత్త రాములు, అతడి తల్లి బాలమణి (58)తో కలిసి మంగళవారం బైక్‌‌పై రామాయంపేటకు వెళ్తున్నారు. 

ఈ క్రమంలో హైవేపైన రోడ్డు క్రాస్‌‌ చేస్తుండగా.. హైదరాబాద్‌‌ వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో బాలమణి అక్కడికక్కడే చనిపోగా.. రాములు తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు రాములును రామాయంపేట ప్రభుత్వ హాస్పిటల్‌‌కు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. 

స్కూల్‌‌ బస్సు ఢీకొని రెండేండ్ల చిన్నారి..

చండ్రుగొండ, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలోని కరిశలబోడుతండాలో మంగళవారం స్కూల్‌‌ బస్సు ఢీకొనడంతో ఓ బాలుడు చనిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన భుక్యా గోపి, అఖిల దంపతులకు దక్షిత్‌‌ (2), లాక్ష్యశ్రీ కవల పిల్లలు. దక్షిత్‌‌ మంగళవారం ఉదయం బిస్కట్‌‌ ప్యాకెట్‌‌ కొనుక్కొని ఇంటికి వెళ్తున్నాడు. 

ఇదే టైంలో జూలూరుపాడులోని సాయి విద్యాలయం స్కూల్‌‌కు చెందిన బస్సు స్టూడెంట్లను ఎక్కించుకునేందుకు గ్రామానికి వచ్చింది. ఈ క్రమంలో రోడ్డు దాటుతున్న దక్షిత్‌‌ను బస్సు ఢీకొట్టడంతో దాని కింద పడి చనిపోయాడు. బాలుడి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై శివరామకృష్ణ తెలిపారు.