ఈ రోడ్డెక్కితే నరకమే!.. 6 కిలోమీటర్లు.. 321 గుంతలు

ఈ రోడ్డెక్కితే నరకమే!.. 6 కిలోమీటర్లు.. 321 గుంతలు
  • అధ్వానంగా గుమ్మడిదల కానుకుంట రోడ్డు
  • హామీ ఇచ్చి పట్టించుకోని ఎమ్మెల్యే
  • ఆగ్రహం వ్యక్తంచేస్తున్న  గ్రామస్తులు

సంగారెడ్డి (గుమ్మడిదల), వెలుగు: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల కేంద్రం నుంచి కానుకుంట వెళ్లే రోడ్డు నరకప్రాయంగా మారింది. ఆరు కిలోమీటర్ల సింగిల్​ రోడ్డులో 321 గుంతలు ఏర్పడ్డాయి. చుట్టుపక్కల 10 గ్రామాల ప్రజలు ఈ గుంతల రోడ్డు పై నుంచే వెళ్లాలి. అంతేకాకుండా మేడ్చల్ హైవేకు వెళ్లాలంటే ఈ దారి ఒక్కటే మార్గం. ఒకపక్క భారీ వాహనాలు, మరోపక్క పొలాలు ఉండడంతో రోడ్డు ఇరుకుగా మారి ఆరు కిలోమీటర్ల  ప్రయాణానికి 45 నిమిషాల టైం పడుతుంది. అసెంబ్లీ ఎన్నికల ముందు వివిధ గ్రామాల ప్రజలు ఈ రోడ్డు ఎవరైతే బాగు చేస్తారో వారికే ఓటేస్తామని చెప్పడంతో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గూడెం మహిపాల్ రెడ్డి ముందుకు వచ్చారు.  కొద్దిపాటి పనులు చేయించినప్పటికీ ఎలక్షన్స్ ముగియగానే ఆగిపోయాయి. 

రూ.8.5 కోట్ల సంగతేంది..?

అసెంబ్లీ ఎన్నికల టైంలో గుమ్మడిదల నుంచి కానుకుంటకు వెళ్లే రోడ్డు విస్తరణ పనుల కోసం రూ 8.5 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.1.50 కోట్లు మంజూరు చేయగా, మిగతా ఏడు కోట్లు తాను ఖర్చుచేసి రోడ్డు బాగు చేయిస్తానని అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి హామీ ఇచ్చారు. వెంటనే ఓ కాంట్రాక్టర్ ను సెట్ చేసి అర కిలోమీటర్ వరకు రోడ్డు వెడల్పు పనులు చేయించారు కానీ ఎన్నికలు ముగిసిన వెంటనే పనులు ఆపేశారు. ఎమ్మెల్యేగా మహిపాల్ రెడ్డి గెలిచి మూడు నెలలు కావస్తున్నా ఆ రోడ్డు మాత్రం ఎప్పట్లాగే ఉంది. ప్రభుత్వం ఇచ్చిన ఒకటిన్నర ఫండ్స్ ఖర్చు చేయలేదు.. పైగా ఎమ్మెల్యే సొంత నిధులు ఇస్తలేరని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

మేడ్చల్ హైవేకు కనెక్ట్​

గుమ్మడిదల నుంచి కానుకుంట వెళ్లే ఈ ఆరు కిలోమీటర్ల రోడ్డు మేడ్చల్ హైవేకు కనెక్ట్​ అయి ఉంటుంది. చుట్టు పక్కల 10 గ్రామాల ప్రజలు ఈ దారి నుంచే వెళ్లాలి. పైగా కానుకుంట, అనంతారం  గ్రామాల పరిధిలో దాదాపు పది ఫ్యాక్టరీలు ఉండగా, భారీ వాహనాలు, కార్మికుల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. సింగిల్ రోడ్డు అందులోనూ గుంతలు ఏర్పడడంతో వాహనదారులు అదుపు తప్పి ఆస్పత్రుల పాలైన ఘటనలు ఉన్నాయి. గతంలో రోడ్డు రిపేర్​ చేయించాలని ప్రతిపక్ష నేతల సాయంతో గ్రామస్తులు ఆందోళనలూ చేశారు. ఎన్నికల టైంలో పొలిటికల్ లీడర్లపై ప్రభావం చూపిన ఈ రోడ్డు తీరా ఎన్నికలు పూర్తయ్యాక అదే పరిస్థితిలో మిగిలిపోయింది. జిల్లా యంత్రాంగం స్పందించి రోడ్డు విస్తరణకు వెంటనే ఫండ్స్ కేటాయించి పనులు పూర్తి చేయాలని పది గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

వెంటనే రోడ్డు బాగు చేయాలె 

గుమ్మడిదల కానుకుంట రోడ్డు వెంటనే బాగు చేయాలి. ఇటీవల ఈ రోడ్డుపై వెళ్తూ ప్రమాదానికి గురై నా కుడిచేయి ఫ్రాక్చర్ అయింది. గతంలో నాలాగా చాలామంది గాయపడ్డారు. పాలకులు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి. కలెక్టర్ స్పందించి రోడ్డుకు అవసరమైన నిధులు మంజూరు చేయాలి. 

అవినాశ్ రెడ్డి, బాధితుడు