వరంగల్​లో దారి దోపిడీ బంగారం కోసం కొట్టి సంపిన్రు

వరంగల్​లో దారి దోపిడీ బంగారం కోసం కొట్టి సంపిన్రు
  • తీవ్ర గాయాలతో దవాఖానలో చేరిన యువకుడు మృతి
  • చాంబర్​ ఆఫ్​ కామర్స్​ బిల్డింగ్​వద్ద వారం కింద ఘటన  
  • ఇంకా నిందితులను పట్టుకోని పోలీసులు

హనుమకొండ/వరంగల్ సిటీ, వెలుగు : వరంగల్​లో రోడ్డుపై వెళ్తున్న ఓ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు కొట్టి ఒంటిపై ఉన్న బంగారం గుంజుకుని పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన అతడు దవాఖానలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఈ నెల 4న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత కుటుంబసభ్యుల కథనం ప్రకారం..వరంగల్ కాశీబుగ్గ శాంతినగర్​కు చెందిన రేకెళ్లి రాకేశ్​(20) వంటలు చేస్తుంటాడు. పెండ్లి కాకపోవడంతో అన్న దేవేందర్, కుటుంబసభ్యులతో కలిసి ఉంటున్నాడు. కష్టపడగా వచ్చిన సంపాదనతో తులం బంగారం కొని ఓ చైన్, రింగ్ ​చేయించుకున్నాడు. తొర్రూరులో వంట చేసే పని ఉండడంతో ఈ నెల 4న అర్ధరాత్రి ఇంటి నుంచి బయలుదేరాడు. వరంగల్​బస్టాండ్ సమీపంలోని చాంబర్​ ఆఫ్​ కామర్స్ ​బిల్డింగ్​వద్దకు చేరుకున్నాక గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు అడ్డగించారు. ఒంటిపై ఉన్న చైన్​, ఉంగరం ఇవ్వాల్సిందిగా బెదిరించడంతో రాకేశ్ తప్పించుకు పారిపోవాలని చూశాడు. దీంతో దుండగుల్లో ఓ వ్యక్తి రాకేశ్​ను పట్టుకుని చితకబాదాడు. మళ్లీ తప్పించుకుని పారిపోయే ప్రయత్నం చేయగా మరో వ్యక్తి కూడా కలిసి విపరీతంగా కొట్టారు. తల, చెవి, మెడ భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. అపస్మారక స్థితిలోకి వెళ్లాక చైన్, ఉంగరాలు తీసుకుని పరారయ్యారు.

మృత్యువుతో పోరాడి ఓడి...

చాంబర్​ ఆఫ్​ కామర్స్ ​బిల్డింగ్​ఎదుట తీవ్ర గాయాలతో పడి ఉన్న రాకేశ్ ను గమనించిన స్థానికులు 108కి ఫోన్ ​చేశారు. వరంగల్ ఎంజీఎంలోని ఆర్ఐసీయూలో చేర్పించారు. అప్పటి నుంచి మృత్యువుతో పోరాడిన రాకేశ్​ మంగళవారం రాత్రి కన్నుమూశాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

వారం గడిచినా.. నిందితులను గుర్తించని పోలీసులు

దారి దోపిడీకి పాల్పడింది వరంగల్ లేబర్​ కాలనీ, శివనగర్ చెందిన వ్యక్తులుగా రాకేశ్​ కుటుంబసభ్యులు అనుమానిస్తున్నారు. ఘటనపై ఐదో తేదీనే ఇంతేజార్ గంజ్​ పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు నిందితులను గుర్తించలేదు. సీసీ ఫుటేజీల్లో నిందితులు స్పష్టంగా కనిపిస్తున్నా పట్టుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయమై ఇంతేజార్​గంజ్​ సీఐ ముష్క శ్రీనివాస్​ ను వివరణ కోరగా నిందితులను గుర్తించలేకపోయామని,
దర్యాప్తు కొనసాగుతోందన్నారు. తొందర్లోనే పట్టుకుంటామన్నారు.