Robin Smith: ఇంగ్లాండ్ దిగ్గజ క్రికెటర్ మరణం.. 1992 వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరుకున్న జట్టులో సభ్యుడు

Robin Smith: ఇంగ్లాండ్ దిగ్గజ క్రికెటర్ మరణం.. 1992 వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరుకున్న జట్టులో సభ్యుడు

ఇంగ్లాండ్ క్రికెట్ లో విషాదం నెలకొంది. 62 వయసులో ఇంగ్లీష్ క్రికెట్ జట్టు దిగ్గజ బ్యాటర్ రాబిన్ స్మిత్ చనిపోయారు. సోమవారం (డిసెంబర్ 1) సౌత్ పెర్త్‌లోని తన అపార్ట్‌మెంట్‌లో స్మిత్ అనుకోకుండా మరణించారని అతని కుటుంబం ప్రకటించింది. "హారిసన్,  మార్గాక్స్ ల ప్రియమైన తండ్రి.. క్రిస్టోఫర్ ప్రియమైన సోదరుడు రాబిన్ ఆర్నాల్డ్ స్మిత్ మరణం అత్యంత విచారాన్ని కలిగిస్తోంది. డిసెంబర్ 1వ తేదీ సోమవారం నాడు సౌత్ పెర్త్ అపార్ట్‌మెంట్‌లో రాబిన్ అనుకోకుండా మరణించాడు. అతని మరణానికి కారణం ప్రస్తుతం తెలియదు". అని స్మిత్ కుటుంబం ఒక ప్రకటనలో తెలిపింది.

ఇంగ్లాండ్ క్రికెట్ లో స్మిత్ స్టార్ బ్యాటర్ గా ఒక వెలుగు వెలిగాడు. ఆడింది 8 ఏళ్ళు అయినప్పటికీ తన మార్క్ చూపించాడు. 1988 నుంచి  1996 మధ్య ఇంగ్లాండ్ తరపున ప్రాతినిధ్యం వహించాడు. ఓవరాల్ గా 62 టెస్టుల్లో 43.67 యావరేజ్ తో 4,236 పరుగులు చేశాడు. 1992 ప్రపంచ కప్ ఫైనల్‌కు ఇంగ్లాండ్ చేరుకున్న జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. మాల్కం మార్షల్, కర్ట్లీ అంబ్రోస్, కోర్ట్నీ వాల్ష్‌లతో కూడిన వెస్టిండీస్ బౌలింగ్ లైనప్ ను సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు. 1993లో ఎడ్జ్‌బాస్టన్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో 163 ​​బంతుల్లో 167 పరుగులు చేసి తన కెరీర్ లో బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. 

►ALSO READ | SMAT 2025: టీమిండియా టెస్ట్ ప్లేయర్స్ మెరుపు సెంచరీలు.. ముగ్గురూ ఊర మాస్ ఇన్నింగ్స్

రాబిన్ 1963లో దక్షిణాఫ్రికాలో తల్లిదండ్రులు జాన్, జాయ్‌లకు జన్మించాడు. క్రిస్టోఫర్ (కిప్పీ) స్మిత్‌కు తమ్ముడు.
సౌతాఫ్రికాలోని డర్బన్‌లో జన్మించిన స్మిత్ 1983లో ఇంగ్లాండ్‌కు వెళ్లి హాంప్‌షైర్‌లో చేరాడు. ఇంగ్లాండ్ కౌంటీల్లో అద్భుతంగా రాణించి  అత్యుత్తమ ఆటగాళ్ళలో ఒకరిగా నిలిచాడు. 17 సీజన్లలో 18,984 ఫస్ట్-క్లాస్ పరుగులు చేశాడు. అప్పటి హాంప్‌షైర్ చైర్మన్ రాడ్ బ్రాన్స్‌గ్రోవ్  స్మిత్ ను "హాంప్‌షైర్ క్రికెట్ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన ఆటగాడు"గా అభివర్ణించాడు. కౌంటీతో అతని బంధం కెరీర్ అంతటా బలంగా ఉంది.