మరోసారి బౌలింగ్ అనకుండా కొట్టాడు.. అఫ్ఘాన్ బౌలర్‌ని పిండేసిన ఊతప్ప

మరోసారి బౌలింగ్ అనకుండా కొట్టాడు.. అఫ్ఘాన్ బౌలర్‌ని పిండేసిన ఊతప్ప

భారత వెటరన్ క్రికెటర్ రాబిన్ ఉతప్ప అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాక ఫామ్ లోకి వచ్చారు. ప్రస్తుతం జిమ్‌ ఆఫ్రో టీ10 లీగ్‌లో ఆడుతున్న ఈ వెటరన్ క్రికెటర్.. కేప్ టౌన్ సాంప్ ఆర్మీతో జరిగిన మ్యాచ్ లో వీరవిహారం చేశారు. కేవలం 36 బంతుల్లోనే 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో 88 పరుగులు చేసి ఒంటి చేత్తో హరికేన్స్ జట్టుకు విజయాన్ని అందించారు. 

రెచ్చిపోయిన ఊతప్ప

శుక్రవారం హరారే హరికేన్స్, కేప్ టౌన్ సాంప్ ఆర్మీ జట్ల మధ్య ఎలిమినేటర్‌ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేప్ టౌన్ నిర్ణీత 10 ఓవర్లలో 145 పరుగులు చేయగా.. అనంతరం హరికేన్స్ బ్యాటర్లు టార్గెట్‌ను ఆడుతూ పాడుతూ చేధించారు. ముఖ్యంగా ఆ జట్టు కెప్టెన్‌ రాబిన్‌ ఉతప్ప ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. 36 బంతుల్లోనే 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో 88 పరుగులు చేసి.. ప్రత్యర్థి జట్టు బౌలర్లకు పీడకలను మిగిల్చారు. ఉతప్ప ధాటికి హరికేన్స్‌.. ​146 లక్ష్యాన్ని కేవలం ఒక్క వికెట్‌ మాత్రమే నష్టపోయి ఛేదించింది.

ముజీబ్ ఉర్ రెహ్మాన్ బలి

ఊతప్ప విధ్వంసకర ఇన్నింగ్స్ ధాటికి అఫ్ఘాన్ బౌలర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ బలయ్యారు. ముజీబ్ వేసిన రెండో ఓవర్‌లో ఏకంగా 28 పరుగులు వచ్చాయి. మొదటి బంతిని బౌండరీకి తరలించిన ఊతప్ప.. వరుసగా రెండు, మూడు, నాలుగు బంతులను సిక్సర్లుగా మలిచారు. ఆపై ఐదో బంతికి నాలుగు పరుగులు రాగా, ఆఖరి బంతికి రెండు పరుగులు వచ్చాయి. అందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.

అయితే ఎలిమినేటర్‌లో అద్బుత విజయం సాధించినప్పటికీ.. క్వాలిఫయర్‌-2లో ఓటమి పాలుకావడంతో హరికేన్స్ జట్టు టోర్నీ నుంచి ఇంటిదారి పట్టింది.

2006లో భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ స్టైలిష్ బ్యాటర్.. 2015లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడారు. ఆపై సుదీర్ఘ కాలం పాటు ఐపీఎల్‌లో కొనసాగినా.. గతేడాది అన్ని ఫార్మాట్ల నుండి తప్పుకున్నారు. భారత జట్టు తరపున 46 వన్డేలు, 13 టీ20లు ఆడిన ఊతప్ప.. ఐపీఎల్‌లో 205 మ్యాచ్‌లు ఆడారు. ఓపెనర్‌గా కెరీర్‌ని ప్రారంభించిన రాబిన్ ఉతప్ప.. ఆ తర్వాత ఫస్ట్ డౌన్.. మిడిలార్డర్‌కి మారారు. అయితే గాయాలు, పేలవ ఫామ్ అతని కెరీర్‌ని దెబ్బతీశాయి. ఈ వెటరన్ క్రికెటర్ అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక్క సెంచరీ కూడా చేయకపోవటం గమనార్హం.