రోహిత్, కోహ్లీ మాత్రమే వరల్డ్ కప్ తెస్తారనుకుంటే పొరపాటే : కపిల్

రోహిత్, కోహ్లీ మాత్రమే వరల్డ్ కప్ తెస్తారనుకుంటే పొరపాటే : కపిల్

ఈ ఏడాది సొంత గడ్డ మీద జరగబోతున్న ప్రపంచకప్‌ను బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా కప్ గెలవాలనే పట్టుదలతో బోర్డు ఉంది. అయితే భారత జట్టుపై 1983 వరల్డ్ కప్ హీరో కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే వరల్డ్ కప్‌లో భారత్ గెలవాలంటే.. కోహ్లి, రోహిత్ లాంటి ఆటగాళ్లపై ఆధారపడొద్దని అన్నారు.

విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ లేదా ఇద్దరు ముగ్గురు ఆటగాళ్లపై ఆధార పడితే భారత జట్టు వరల్డ్ కప్ గెలవలేదని కపిల్ దేవ్ స్పష్టం చేశారు. జట్టులో ఐదారుగురు మ్యాచ్ విన్నర్లు ఉండేలా టీమ్‌ను బిల్డ్ చేయాలని సూచించారు. ‘‘ఒకవేళ మీరు కప్ గెలవాలని అనుకుంటే.. కోచ్, సెలక్టర్లు, జట్టు మేనేజ్‌మెంట్ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. వ్యక్తిగత ప్రయోజనాలను పక్కనబెట్టి జట్టు గురించి ఆలోచించాలి’’ చెప్పారు. 

ఆటగాళ్లను నమ్మాలన్న కపిల్.. మనకు వరల్డ్ కప్ గెలిచే సత్తా ఉన్న ఆటగాళ్లు ఉన్నారన్నారు. యువ ఆటగాళ్లు ముందుకొచ్చి వరల్డ్ కప్ వేదికపై సత్తా చాటాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. మన దగ్గర మ్యాచ్ విన్నర్లు కూడా ఉన్నారన్నారు.

‘‘మన జట్టుకు ఎప్పుడూ ఒకరిద్దరు ఆటగాళ్లు మాత్రమే మూలస్తంభాల్లా ఉంటున్నారు. జట్టు వారి చుట్టూనే తిరుగుతోంది. దాన్ని మనం బ్రేక్ చేసి.. అలాంటి ఐదారుగురు ఆటగాళ్లను తయారు చేసుకోవాలి. అందుకే కోహ్లి, రోహిత్‌లపై మనం ఆధారపడొద్దని చెబుతున్నా. తమ బాధ్యతలను నెరవేర్చే ఆటగాళ్లు మనకు కావాలి. యువ ఆటగాళ్లు ముందుకొచ్చి ఇది మన టైం అనుకోవాలి’’ అని కపిల్ తెలిపారు.