
న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌తో పాటు జస్‌ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్‌కు.. సౌతాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్, జులైలో జరిగే ఇంగ్లండ్ టూర్‌ను దృష్టిలో పెట్టుకుని వీళ్లకు బ్రేక్ ఇవ్వాలని సెలెక్టర్లు భావిస్తున్నారు. దీంతో సఫారీ సిరీస్‌తో పాటు ఐర్లాండ్‌తో రెండు మ్యాచ్‌లకు కెప్టెన్‌గా ఎవర్ని ఎంపిక చేస్తారనే ఆసక్తి మొదలైంది. ప్రస్తుతమైతే శిఖర్ ధవన్, హార్దిక్ పాండ్యా రేస్‌లో ఉన్నట్లు సమాచారం. అయితే ఈ రెండు సిరీస్‌లకు పాండ్యాను ఎంపిక చేయాలంటే కచ్చితంగా అతను ఫిట్‌నెస్ టెస్ట్ పాస్ కావాలని బీసీసీఐ అధికారి ఒకరు స్పష్టం చేశారు. ఐపీఎల్‌లో పాండ్యా బౌలింగ్ కూడా చేస్తున్నాడు కాబట్టి.. టెస్ట్ పాస్ కావడం పెద్ద ఇబ్బంది కాకపోవచ్చు. ఈ నెల 22న ఈ రెండు సిరీస్‌లకు టీమ్‌ను ఎంపిక చేసే చాన్సెస్ ఉన్నాయి. ఐపీఎల్‌లో అదరగొడుతున్న మోసిన్ ఖాన్, ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్ చాన్స్ కోసం ఎదురుచూస్తున్నారు. గాయాలతో జడేజా, దీపక్ చహర్, సూర్యకుమార్.. ఈ రెండు సిరీస్‌లకు అందుబాటులో ఉండటం లేదు. దీంతో రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, దీపక్ హుడా, సంజూ శాంసన్.. బ్యాటింగ్ కోర్ గ్రూప్‌లో ప్లేస్ కోసం రేస్‌లో ఉన్నారు. బౌలింగ్‌లో భువనేశ్వర్, ప్రసీధ్ కృష్ణ, హర్షల్ పటేల్, అవేశ్ ఖాన్, అశ్విన్, చహల్, కుల్దీప్ అందుబాటులో ఉండనున్నారు.