అడిలైడ్: ఆస్ట్రేలియా టూర్‌లో ఇండియా విజయాల బాట పట్టేలా లేదు. బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ (97 బాల్స్‌లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 73), శ్రేయస్ అయ్యర్ (77 బాల్స్‌లో 7 ఫోర్లతో 61), అక్షర్ పటేల్ (41 బాల్స్‌లో 5 ఫోర్లతో 44) రాణించినా.. రెండో వన్డేలో టీమిండియా 2 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో కంగుతిన్నది. దాంతో అడిలైడ్‌లో 17 ఏళ్ల తర్వాత చారిత్రాత్మక ఓటమిని మూటగట్టుకుంది.
ఫలితంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరోటి మిగిలి ఉండగానే కంగారూలు 2–0తో సొంతం చేసుకున్నారు. టాస్ ఓడిన ఇండియా 50 ఓవర్లలో 264/9 స్కోరు చేసింది. తర్వాత ఆస్ట్రేలియా 46.2 ఓవర్లలో 265/8 స్కోరు చేసి నెగ్గింది. మాథ్యూ షార్ట్ (78 బాల్స్‌లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 74), కూపర్ కనోలీ (53 బాల్స్‌లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 61 నాటౌట్) కీలక భాగస్వామ్యంతో జట్టును గెలిపించారు. జంపాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
కోహ్లీ మళ్లీ డకౌట్..
ఓపెనర్లలో రోహిత్ 17 డాట్ బాల్స్ ఆడి ఒత్తిడిలో పడ్డాడు. ఇక రెండో ఎండ్‌లో బార్ట్‌లెట్ (3/39) స్వింగ్‌తో దుమ్మురేపాడు. ఏడో ఓవర్ తొలి బాల్‌కు శుభ్‌మన్ గిల్ (9)ను, ఐదో బాల్‌కు విరాట్ కోహ్లీ (0)ని ఔట్ చేశాడు. 17/2తో కష్టాల్లో పడిన ఇండియాను శ్రేయస్, రోహిత్ ఆదుకున్నారు. 23 ఓవర్ల పాటు పేస్–స్పిన్ కాంబినేషన్‌ను దీటుగా ఎదుర్కొన్నారు. ఈ ఇద్దరు మూడో వికెట్‌కు 118 రన్స్ జోడించారు.
అయితే 30వ ఓవర్‌లో బౌలింగ్‌కు దిగిన స్టార్క్ ఓ షార్ట్ బాల్‌తో రోహిత్ ఇన్నింగ్స్‌ను ముగించాడు. ఈ దశలో వచ్చిన అక్షర్ పటేల్ ఆసీస్ బౌలింగ్‌ను దీటుగా ఎదుర్కొన్నాడు. కేఎల్ రాహుల్ (11), సుందర్ (12), నితీశ్ కుమార్ రెడ్డి (8) నిరాశపర్చడంతో ఇండియా 66 రన్స్ తేడాతో ఐదు వికెట్లు కోల్పోయింది. చివర్లో హర్షిత్ రాణా (24 నాటౌట్), అర్ష్‌దీప్ సింగ్ (13) తొమ్మిదో వికెట్‌కు 37 రన్స్ జోడించారు.
స్పిన్నర్లను జయించి..
ఛేజింగ్‌లో ఇండియా స్పిన్నర్లను ఎదుర్కోవడంలో ఆసీస్ ఇబ్బందిపడింది. కానీ చివర్లో షార్ట్, కనోలీ కేవలం 6.3 ఓవర్లలోనే 59 రన్స్ జోడించి విజయాన్ని అందించారు. స్టార్టింగ్‌లో పేసర్లు అర్ష్‌దీప్ సింగ్ (2/41), హర్షిత్ రాణా (2/59) దెబ్బకు మిచెల్ మార్ష్ (11), ట్రావిస్ హెడ్ (28) ఔటయ్యారు. ఫలితంగా 54/2 స్కోరుతో ఎదురీత మొదలుపెట్టిన ఆసీస్ ఇన్నింగ్స్‌కు షార్ట్ వెన్నెముకగా నిలిచాడు.
మ్యాట్ రెన్‌షా (30)తో కలిసి మూడో వికెట్‌కు 55 రన్స్, అలెక్స్ క్యారీ (9)తో నాలుగో వికెట్‌కు 37, కనోలీతో ఐదో వికెట్‌కు 55 రన్స్ జోడించి వెనుదిరిగాడు. చివర్లో కనోలీ, మిచెల్ ఓవెన్ (36)ఆరో వికెట్‌కు 59 రన్స్ జత చేసి విజయాన్ని ఖాయం చేశారు. బార్ట్‌లెట్ (3), స్టార్క్ (4) ఫెయిలయ్యారు.
సంక్షిప్త స్కోర్లు
ఇండియా: 50 ఓవర్లలో 264/9 (రోహిత్ 73, శ్రేయస్ అయ్యర్ 61, అక్షర్ పటేల్ 44, ఆడమ్ జంపా 4/60, బార్ట్‌లెట్ 3/39). ఆస్ట్రేలియా: 46.2 ఓవర్లలో 265/8 (మాథ్యూ షార్ట్ 74, కనోలీ 61*, సుందర్ 2/37, అర్ష్‌దీప్ సింగ్ 2/41).
