
ముంబై: టెస్టులు, టీ20లకు దూరమైన టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ నవంబర్‌లో జరిగే ఆస్ట్రేలియా టూర్‌తో తిరిగి గ్రౌండ్‌లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఐపీఎల్ తర్వాత ఆటకు దూరంగా ఉన్న హిట్‌మ్యాన్ కాంపిటీటివ్ క్రికెట్‌లో రీఎంట్రీకి ముందు తన ఫిట్నెస్ను నిరూపించుకోనున్నాడు. ఇందుకోసం తను సెప్టెంబర్ 13న బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (సీఓఈ)కి వెళ్లనున్నాడు. అక్కడ రోహిత్ ఫిట్‌నెస్ పరీక్షలకు హాజరవుతాడని తెలుస్తోంది.
నవంబర్‌లో ఆస్ట్రేలియా టూర్‌కు రెడీ అయ్యేందుకు రెండు నుంచి మూడు రోజుల పాటు రోహిత్ అక్కడే ఉండి ప్రాక్టీస్ చేయనున్నాడు. ఈ ఫిట్‌నెస్ పరీక్షల్లో రోహిత్ శర్మ కొత్తగా ప్రవేశపెట్టిన బ్రాంకో టెస్ట్‌తో పాటు యో–-యో టెస్ట్ కూడా క్లియర్ చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది.
కాగా, రోహిత్, మరో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా–ఎ జట్టుతో జరిగే మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో ఇండియా–ఎ తరఫున బరిలోకి దిగే చాన్స్ ఉందని తెలుస్తోంది. కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో సెప్టెంబర్ 30, అక్టోబర్ 3, 5 తేదీల్లో ఈ సిరీస్ జరగనుంది. అక్టోబర్ 19న ఆస్ట్రేలియాలో ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్‌కు ఈ మ్యాచ్‌లు వారికి మంచి సన్నాహకంగా ఉపయోగపడతాయి.
38 ఏండ్ల రోహిత్ మార్చి 9న న్యూజిలాండ్‌తో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో చివరగా వన్డే మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. ఆ పోరులో తను తను 76 రన్స్ చేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. ఈ ఏడాది మే 7న రోహిత్ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం హిట్‌మ్యాన్ ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు చెందిన బీకేసీ ఫెసిలిటీలో తన ఫ్రెండ్, ఇండియా మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్‌తో కలిసి ప్రాక్టీస్ చేస్తున్నాడు.