స్వలింగ సంపర్కానికి ఒప్పుకోలేదని కుటుంబాన్ని కాల్చి..

V6 Velugu Posted on Sep 06, 2021

హర్యానా: తన‌ స్వలింగ సంప‌ర్కాన్ని వ్యతిరేకించార‌ని నలుగురు కుటుంబ‌స‌భ్యుల‌ను హ‌త్య చేశాడో వ్యక్తి. ఆగ‌స్టు 27న హ‌ర్యానాలో చోటుచేసుకున్న ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించిన సంచ‌ల‌న నిజాలు తాజాగా బ‌య‌ట‌కువ‌చ్చాయి. పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు ఈ వివ‌రాల‌ను వెల్లడించాడు. హ‌ర్యానాలోని రోహత‌క్‌కు చెందిన అభిషేక్‌ (20), తన క్లాస్‌మేట్‌ కార్తీక్ ల‌త్వాల్‌తో కొన్ని నెలలుగా స్వలింగ సంప‌ర్కం కొన‌సాగిస్తున్నాడు. ఈ విష‌యం తెలుసుకున్న అత‌డి కుటుంబ‌స‌భ్యులు దీన్ని వ్యతిరేకించారు. దీంతో అభిషేక్ వారిపై ప‌గ పెంచుకున్నాడు. ఎలాగైనా కుటుంబం మొత్తాన్ని అంతం చేయాల‌ని నిశ్చయించుకున్నాడు. ఆ త‌ర్వాత లింగ మార్పిడి చేయించుకుని కార్తీక్‌తో కలిసి బతకాలని అనుకున్నాడు. కుటుంబాన్ని అంతం చేయ‌టానికి పక్కా ప్లాన్ వేసుకున్నాడు. హ‌త్యల‌కు కొద్ది రోజుల ముందు ఇంట్లోంచి వెళ్లిపోయి బ‌య‌ట హోట‌ల్‌లో దిగాడు. ఆగ‌స్టు 27న హోట‌ల్ రూం ఖాళీ చేశాడు. అక్కడినుంచి ఖ‌ర‌వాద్‌లోని ఓ డాబాలో మ‌ధ్యాహ్న భోజ‌నం చేసి ఇంటికి వెళ్లాడు. అక్కడ పెద్దగా సౌండ్ వ‌చ్చేలా పాట‌లు పెట్టాడు. తల్లిదండ్రులు, సోద‌రి, బామ్మను తుపాకీతో కాల్చి చంపాడు. పాట‌ల సౌండ్‌కు తుపాకీ శ‌బ్దం బ‌య‌ట‌కు విన‌ప‌డ‌లేదు.

కుటుంబం మొత్తాన్ని హత్య చేసిన అభిషేక్‌.. ఎవరికీ అనుమానం రాకుండా ఉండాలని కొత్త నాటకానికి తెరలేపాడు. అందరినీ చంపేశాక కార్తీక్‌ను కలిసి ఇంటికి వచ్చాడు. అతడు వచ్చేసరికి ఇంట్లో అంతా రక్తపు మడుగులో పడి ఉన్నట్టు, ఈ ఘోరం ఎలా జరిగిందోనంటూ గుండెలు బాదుకుంటూ బయటకు పరుగులుపెట్టాడు. ఆ తర్వాత దీనిపై పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వాళ్లను పక్కదారి పట్టించేందుకు తన తండ్రికి కొంత‌మంది నేరగాళ్లతో పాత కక్షలు ఉన్నాయని, వాళ్లే ఇదంతా చేసి ఉంటార‌ని చెప్పాడు. అలాగే కొంత మంది బంధువుల‌పై కూడా అనుమానం వ్యక్తం చేశాడు. అయితే, ఎంక్వైరీలో అటువంటి క్లూ ఏమీ దొరక్కపోవడంతో పోలీసులు మళ్లీ అభిషేక్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా.. చివ‌ర‌కు చేసిన నేరం ఒప్పుకున్నాడు. ఈ కేసులో అత‌డి ప్రియుడు కార్తీక్ ప్రమేయం ఏమీ లేద‌ని పోలీసులు తేల్చారు.

Tagged parents, murder, Grandmother, Sister, Rohtak, homosexual

Latest Videos

Subscribe Now

More News