అమ్మాయిలతో కలిసి ‘రొమాంటిక్’ స్కామ్

అమ్మాయిలతో కలిసి ‘రొమాంటిక్’ స్కామ్

‘ధనుష్ జ్యువెలరీ షాపు నడుపుతున్నాడు. భార్యకు తెలియకుండా మరో యువతితో గడిపేందుకు డేటింగ్ సైట్స్ కోసం వెతికాడు. చివరకు లవ్ వర్డ్స్ అనే సైట్‌లో ఓ సైబర్ క్రైమ్ గ్యాంగ్ ట్రాప్‌లో పడ్డాడు. సైబర్ నేరగాళ్లు వీడియో కాల్స్, వాట్సాప్ చాటింగ్స్‌ని చూపించి అతడిని బ్లాక్ మెయిల్ చేశారు’. ఇలా డేటింగ్ సైట్స్ అడ్డాగా సాగుతున్న ఈ వలపు వలలో యువత ఎక్కువగా ట్రాప్ అవుతోంది. మోసపోతున్న వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. వీటికి అడ్డుకట్ట వేసేందుకు యువత అప్రమత్తంగా ఉండాలని  సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు.

డేటింగ్ పేరుతో వల

బ్యూటీల ఫొటోలతో బురిడీ

ట్రాప్ చేసి బ్లాక్ మెయిల్

అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు

హైదరాబాద్, వెలుగు: యువత బలహీనతలను టార్గెట్ చేసిన సైబర్ క్రిమినల్ గ్యాంగ్స్ ఆన్‌లైన్‌లో అందిన కాడికి దోచుకుంటున్నాయి. డేటింగ్ సైట్స్ విద్యార్ధులు, యువతీ యువకుల జీవితాలను బలితీసుకుంటున్నాయి. ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ అడ్డాగా జరుగుతున్న డేటింగ్ దందాలో సైబర్ నేరగాళ్ళు రెచ్చిపోతున్నారు. ట్రాప్‌లో చిక్కిన యువతను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు కొట్టేస్తున్నారు. ఇలా ప్రతీ ఏటా పెరిగిపోతున్నడేటింగ్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.కోల్‌కతా లవ్ వర్డ్స్ వెస్ట్ బెంగాల్ అడ్డాగా సాగుతున్న డేటింగ్ గ్యాంగ్స్ పక్కా ప్లాన్‌తో విద్యార్థులు, యువకులను టార్గెట్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాయి. డేటింగ్ సైట్స్‌లో యువతుల కోసం సెర్చ్ చేసే యువకులను ట్రాప్ చేస్తున్నాయి. ఇందులో కోల్‌కతా ముఠాలు తమ డేటింగ్ సైట్స్ నిబంధనలకు లోబడి పనిచేస్తున్నాయని నమ్మిస్తున్నాయి. తమ సర్విస్‌లోని యువతులతో డేటింగ్ చేయాలంటే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచిస్తారు. అందుకోసం రూ. 5నుంచి 20వేల వరకు వసూలు చేస్తారు.

తర్వాత తమ సైట్ పేరుతో ఐడీ కార్డ్ క్రియేట్ చేసేందుకు ఆధార్ కార్డ్‌తో పాటు అడ్రస్ ప్రూఫ్స్, పాన్ కార్డ్ డీటెయిల్స్, బ్యాంక్ బ్యాలెన్స్ వివరాలను అందించాలని చెప్తారు. దీంతో పాటు హెల్త్ సర్టిఫికెట్ కూడా పంపించాలని మెయిల్ ఐడీ ఇస్తారు. వీడియో కాల్‌కి రేట్ ఫిక్స్ చేసి.. అందమైన అమ్మాయిల ఫొటోలను వాట్సాప్ ద్వారా పోస్ట్ చేస్తారు. అందులో నచ్చిన వారిని సెలక్ట్ చేసుకోవాలని సూచిస్తారు. ఆ తర్వాత బాధితులు సెలక్ట్ చేసిన యువతి పేరుతో ట్రూకాలర్ నేమ్ ఫీడ్ చేస్తారు. డేటింగ్‌లో భాగంగా కొంతకాలం పాటు అమ్మాయికి వీడియో కాల్ చేసే అవకాశం లేదని నమ్మిస్తారు. సెలక్ట్ చేసుకున్న యువతితో కేవలం వాట్సాప్ చాటింగ్ మాత్రమే చేయాలని చెప్తారు. నమ్మకం కుదిరిన తర్వాతే వీడియో కాల్‌కి అవకాశం ఉంటుందని కండీషన్ పెడతారు. ఇలా తమ ట్రాప్‌లో చిక్కిన వ్యక్తికి లేడి వాయిస్‌తో మాట్లాడిస్తారు. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులకు అనారోగ్యం అంటూ విడతల వారీగా డబ్బు వసూలు చేస్తారు.

ఫైనాన్షియల్ స్టేటస్‌ను అంచనా వేసి.. తమ ట్రాప్‌లో చిక్కిన వారి ఫైనాన్షియల్ స్టేటస్ను సైబర్ గ్యాంగ్ అంచనా వేస్తుంది. అవసరమైన విధంగా కాల్ గర్ల్స్‌ను ఎరగా వేస్తారు. బాధితులతో హోటల్స్, రిసార్స్ట్ బుక్ చేయించి యువతితోపాటు నలుగురు సభ్యుల ముఠా స్పాట్‌కి చేరుకుంటుంది. ఆ తర్వాత ఫొటోస్, చాటింగ్ పిక్స్‌తో బ్లాక్ మెయిల్ చేసి అందినంత దోచుకుని పారిపోతుంది. దీంతో పాటు తమ దగ్గర ఉన్న బాధితుల ఆధారాలతో బ్లాక్ మెయిల్ చేస్తారు. తమ సైట్స్ పై పోలీసులు దాడి చేసి అరెస్ట్ చేశారని నమ్మిస్తారు. సీజ్ చేసిన కంప్యూటర్లు, ఐడీ కార్డుల ఆధారంగా తమ సైట్లలో డేటింగ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నవాళ్ళపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారని చెబుతారు. గ్యాంగ్ సభ్యులతో కోల్‌కతా పోలీసులుగా కాల్ చేయించి అరెస్ట్ చేస్తామని బెదిరిస్తారు. కేసుల నుంచి తప్పిస్తామని నమ్మించి మళ్ళీ డబ్బులు వసూలు చేస్తారు.

చెప్పుకోని వారే ఎక్కువ

ఇలా డేటింగ్ సైట్ల గ్యాంగ్స్ వలలో చిక్కి ప్రతీనెల సుమారుగా ముగ్గురు నుంచి ఐదుగురు యువకులు మోసపోతున్నారని సైబర్ క్రైమ్ పోలీసులు అంచనా వేస్తున్నారు. వాట్సాప్ చాటింగ్ నుంచి వీడియో కాలింగ్, వాయిస్ కాలింగ్ కోసం ఒక్కోదానికి ఒక్కో రేట్ ఫిక్స్ చేస్తున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇల్లీగల్ డేటింగ్ సైట్స్ గ్యాంగ్స్‌ చేతిలో మోసపోయిన చాలా మంది యువకులు పరువుపోతుందని కుటుంబసభ్యులకు, పోలీసులకు చెప్పడానికి భయపడుతున్నారు. సైబర్ ఎక్స్‌పర్స్ట్ తెలిపిన వివరాల ప్రకారం ఆన్‌లైన్ డేటింగ్ వల్ల చెడు ఎక్కువగా జరుగుతోంది. ప్రతి ఏటా డేటింగ్ సైట్స్‌లో దేశవ్యాప్తంగా సుమారు 28 శాతం యువత మోసపోతోందని పోలీసులు చెబుతున్నారు.

For More News..

ఆమెను కూడా నిర్భయ దోషులలాగే జైళ్లో పెట్టాలి

క్షణాల్లో వాటర్‌ట్యాంక్ ఎలా కూలిందో చూడండి..

రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెడితే.. జగన్ రద్దు చేస్తానంటున్నాడు