
- మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని కూకుట్లపల్లిలో ఘటన
కౌడిపల్లి, వెలుగు : అంగన్‌వాడీ కేంద్రంలో పైకప్పు పెచ్చులూడి పడగా.. చిన్నారులకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఈ ఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని కూకుట్లపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో గురువారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రానికి గురువారం ఉదయం సుమారు 12 మంది చిన్నారులు వచ్చారు. వారితో పాటు ఆయా బిస్మిల్లా కేంద్రంలో ఉండగానే ఒక్కసారిగా పైకప్పు సిమెంట్ పెచ్చులు ఊడి పడ్డాయి.
అయితే పిల్లలు లేని చోట పెచ్చులు పడడంతో చిన్నారులెవరికీ గాయాలు కాలేదు. పెచ్చులూడి పడిన శబ్దంతో భయాందోళనకు గురైన చిన్నారులు బయటకు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న పిల్లల తల్లిదండ్రులు, గ్రామస్తులు అంగన్‌వాడీ కేంద్రం వద్దకు చేరుకున్నారు. బిల్డింగ్ శిథిలావస్థకు చేరడం, రెండు రోజులుగా వర్షాలు పడుతుండడం వల్లే పెచ్చులు ఊడిపడ్డాయని చెప్పారు.
స్టూడెంట్లు మధ్యాహ్నం పడుకునే టైంలోగానీ, బాలింతలు, గర్భిణులు భోజనాలు చేసే టైంలో గానీ పెచ్చులూడి పడితే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆఫీసర్లు స్పందించి అంగన్‌వాడీ కేంద్రాన్ని మరో బిల్డింగ్‌లోకి మార్చాలని గ్రామస్తులు కోరుతున్నారు. కాగా, ఈ అంగన్‌వాడీ కేంద్రానికి ఐదేండ్లుగా టీచర్ లేకపోవడంతో ఆయానే పిల్లలను చూసుకుంటోంది.