ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లో ప్రమాదం : గాలివానకు కూలిపోయిన పైకప్పు

ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లో ప్రమాదం : గాలివానకు కూలిపోయిన పైకప్పు

దేశరాజధాని ఢిల్లీలో భారీ వర్షం కురిసింది. భారీ వర్షం, ఈదురుగాలులు కారణంగా ఇందిరా గాంధీ ఇంటర్నేషన్ ఎయిర్ పోర్ట్ లోని టర్మినల్ 1 దగ్గర పై కప్పు కూలిపోయింది. ఈ ప్రమాదం శుక్రవారం తెల్లవారుజామున 5గంటలకు జరిగింది. షెడ్ కూలిపోవడంతో దానికింద ఉన్న ఐదుగురికి గాయాలు అయ్యాయి. ఒకరు మృతి చెందారు. సమాచారం అందుకున్న ఢిల్లీ ఫైర్ సర్వీస్ కూలిపోయిన టెంట్ కింద చిక్కుకున్నవారిని రక్షించారు. గాయపడ్డవారిని హాస్పిటల్ కు తరలించారు.

గత 24 గంటల నుంచి భారీ వర్షం కారణంగా ఢిల్లీలో పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. రోడ్లపై వర్షపు నీరు చేరింది. శుక్రవారం ఉదయం 5.30 గంటల వరకు సఫ్దర్‌జంగ్‌లో 153.7 మిల్లీమీటర్లు, పాలం విమానాశ్రయంలో 93 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. టెర్మినల్-1లోని పైకప్పు కూలడం వల్ల విమాన రాకపోకలపైనా ప్రభావం పడింది. అక్కడి నుంచి బయలుదేరాల్సిన విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ముందు జాగ్రత్తగా చెకిన్ కౌంటర్లు మూసివేశామని చెప్పారు. కాగా, పైకప్పు కూలిన ఘటనపై కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు స్పందించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.