కీలకపోరులో లక్నోపై ఆర్సీబీ అద్భుత విజయం

కీలకపోరులో లక్నోపై ఆర్సీబీ అద్భుత విజయం
  • క్వాలిఫయర్‌‑2కు అర్హత
  • 14 రన్స్​ తేడాతో లక్నోపై గెలుపు
  • రజత్‌ పటిదార్‌ సెంచరీ షో
  • రాహుల్‌ పోరాటం వృథా 

కోల్‌‌‌‌కతా: బ్యాటింగ్‌‌లో చెలరేగిపోయిన బెంగళూరు.. క్వాలిఫయర్‌‌–2కు అర్హత సాధించింది. యువ బ్యాటర్ రజత్ పటిదార్ (54 బాల్స్‌‌లో 12 ఫోర్లు, 7 సిక్స్‌‌లతో 112 నాటౌట్) సెంచరీతో దంచికొట్టడంతో బుధవారం జరిగిన ఎలిమినేటర్‌‌ మ్యాచ్‌‌లో 14 రన్స్‌‌ తేడాతో లక్నో సూపర్‌‌జెయింట్స్‌‌పై గెలిచింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 207/4 భారీ స్కోరు చేసింది. లక్నో బౌలర్లలో మోసిన్ ఖాన్ (1/25), క్రునాల్ పాండ్యా (1/39), అవేశ్ ఖాన్ (1/44), రవి బిష్నోయ్ (1/45) రాణించారు. ఛేజింగ్‌‌లో ఓవర్లన్నీ ఆడిన లక్నో 193/6  స్కోరు చేసి ఓడింది. రాహుల్ (58 బాల్స్‌‌లో 3 ఫోర్లు, 5 సిక్స్‌‌లతో 79) పోరాడాడు. చాలెంజర్స్ బౌలర్లలో హేజిల్ వుడ్ (3/43) రాణించాడు. రజత్‌‌కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది. 

పటిదార్ పంజా
మొదట బ్యాటింగ్‌‌లో బెంగళూరుకు పటిదార్ భారీ స్కోర్ అందించాడు. స్టార్ బ్యాటర్లు విఫలమైన వేళ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. తొలి ఓవర్లోనే డుప్లెసిస్ (0) డకౌట్ కాగా.. విరాట్ కోహ్లీ (25), పటిదార్‌‌తో కలిసి ఇన్నింగ్స్‌‌ను ముందుకు నడిపాడు. మొదట కాస్త నెమ్మదిగా ఆడినా.. క్రునాల్ వేసి ఆరో ఓవర్లో 4,4,6,4తో పటిదార్ స్కోర్ బోర్డుకు ఊపు తీసుకొచ్చాడు. కాసేపటికే కోహ్లీతో పాటు మ్యాక్స్‌‌వెల్ (9), లోమ్రోర్ (14) ఔటయ్యారు. ఈ దశలో పటిదార్‌‌తో కలిసిన కార్తీక్ (37) ఇన్నింగ్స్‌‌కు జోరు తెచ్చాడు. బిష్నోయ్ వేసిన 16వ ఓవర్లో క్యాచ్ డ్రాప్‌‌తో బతికిపోయిన పటిదార్ 6,4,6,4,6తో విధ్వంసమే సృష్టించాడు. ఇక 18వ ఓవర్లో మరోసారి క్యాచ్ డ్రాప్‌‌తో లైఫ్ అందుకున్న పటిదార్ లీగ్‌‌లో మెయిడిన్ సెంచరీ (49 బాల్స్‌‌లో) సాధించాడు. ఇలా వీరిద్దరి జోరుతో బెంగళూరు 200 ప్లస్ స్కోరు సాధించింది. వీరి దాటికి చివరి ఐదు ఓవర్లలో ఆర్‌‌సీబీ 84 రన్స్ సాధించడం విశేషం.

రాహుల్‌‌ పోరాడినా..
భారీ టార్గెట్ ఛేజింగ్‌‌తో బరిలోకి దిగిన లక్నోకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ డికాక్ (6)మొదటి ఓవర్లోనే ఔటయ్యాడు. ఆపై రాహుల్, వోహ్రా (19) కాసేపు క్రీజులో కుదురుకునే ప్రయత్నం చేశారు. కానీ కాసేపటికే వోహ్రా ఔట్ కాగా.. ఈ దశలో క్రీజులోకి వచ్చిన హుడా, రాహుల్‌‌తో కలిసి బాధ్యత తీసుకున్నాడు. వీరిద్దరూ జాగ్రత్తగా ఆడుతూ కావాల్సిన రన్ రేట్ పెరగకుండా చూసుకున్నారు. ఈ క్రమంలోనే 14వ ఓవర్లో సిక్స్‌‌తో రాహుల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. తర్వాతి ఓవర్లో రెండు భారీ సిక్స్‌‌లు బాదిన హుడా తర్వాతి బంతికే ఔటయ్యాడు. ఆపై స్టోయినిస్ (9), రాహుల్ జోరు పెంచారు. లక్నో విక్టరీకి 30 బాల్స్‌‌లో 65 రన్స్ కావాల్సి రాగా తర్వాతి రెండు ఓవర్లలో 24 రన్స్ వచ్చాయి. 18వ ఓవర్లో స్టోయినిస్‌‌ను ఔట్ చేసిన హర్షల్ 8 రన్స్ ఇచ్చాడు. ఇక 12 బాల్స్‌‌లో 33 రన్స్ అవసరం రాగా 19వ ఓవర్లో హేజిల్ వుడ్.. రాహుల్, క్రునాల్ (0)ను ఔట్ చేసి 9 రన్సే ఇచ్చాడు. చివరి ఓవర్లో 8 రన్స్ వచ్చినా ఫలితం లేకపోయింది.
 

మరిన్ని వార్తల కోసం

కేటీఆర్ ​ఆర్డరేసినా నెమ్మదిగానే అభివృద్ధి పనులు

వానాకాలం​ పంటల సాగుకు ప్రణాళిక రెడీ