ఆర్సీబీ ‘రాయల్’ విక్టరీ.. పంజాబ్‌పై ఘన విజయంతో ప్లేఆఫ్స్‌లోకి బెంగళూరు ఎంట్రీ!

ఆర్సీబీ ‘రాయల్’ విక్టరీ.. పంజాబ్‌పై ఘన విజయంతో ప్లేఆఫ్స్‌లోకి బెంగళూరు ఎంట్రీ!

PBKS vs RCB: ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) దుమ్మురేపింది. ధర్మశాల వేదికగా జరిగిన అత్యంత కీలక పోరులో పంజాబ్ కింగ్స్ (PBKS)పై 23 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి, అధికారికంగా ప్లేఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఆర్సీబీ నిర్దేశించిన 223 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో పంజాబ్ కింగ్స్ ఎంత పోరాడినా ఫలితం లేకపోయింది. ఈ ఓటమితో పంజాబ్ ప్లేఆఫ్స్ అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారాయి.

పంజాబ్ టాప్ ఆర్డర్ కొలాప్స్: 
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్‌కు మంచి ఆరంభం లభించలేదు. ఫస్ట్ ఓవర్లోనే స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ పంజాబ్‌కు బిగ్ షాక్ ఇచ్చాడు. ఓపెనర్ ప్రియాంష్ ఆర్యను డకౌట్ చేసి పంపగా.. జట్టు స్కోరు 18 పరుగుల వద్ద మరో ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (2)ను కూడా భువీయే క్లీన్ బౌల్డ్ చేశాడు.

నిరాశపర్చిన అయ్యర్: 
ఇక కెప్టెన్‌గా 100వ మ్యాచ్ ఆడుతున్న శ్రేయస్ అయ్యర్ దారుణంగా నిరాశపరిచాడు. కేవలం 1 రన్ మాత్రమే చేసి రసిఖ్ సలాం దార్ బౌలింగ్‌లో కీపర్ జితేష్ శర్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 19 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పంజాబ్ ఘోరమైన కష్టాల్లో పడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన కూపర్ కొన్నోలీ, సూర్యాంశ్ షెడ్జ్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 43 పరుగులు జోడించారు. కానీ 37 పరుగులు చేసిన కూపర్.. రొమారియో షెపర్డ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి జాకబ్ బెథెల్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఆ వెంటనే సెట్ అయిన సూర్యాంశ్ (35) సైతం సుయాష్ శర్మ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి క్రీజు వదిలాడు.

శశాంక్ ఒంటరి పోరాటం: 
62 పరుగులకే 5 వికెట్లు పడిపోయిన తరుణంలో మార్కస్ స్టోయినీస్, శశాంక్ సింగ్ ఆర్సీబీ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. సిక్సర్లు, ఫోర్లతో హోరెత్తిస్తూ ఈ జోడీ 67 పరుగుల వేగవంతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. కానీ, జోష్ హేజిల్‌వుడ్ వేసిన అద్భుతమైన డెలివరీకి ప్రమాదకరంగా మారిన స్టోయినీస్ (37) ఎల్బీడబ్ల్యూగా వెనుతిరిగాడు. మరో ఎండ్ లో శశాంక్ సింగ్ హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. ఆఖర్లో వచ్చిన అజ్మతుల్లా ఒమర్జాయ్ పరుగులు రాబట్టడానికి తీవ్రంగా ఇబ్బంది పడటం, అప్పటికే జట్టు రన్ రేట్ కొండలా పెరిగిపోవడంతో పంజాబ్ కింగ్స్ నిర్ణీత ఓవర్లలో లక్ష్యానికి కేవలం 199 రన్స్ మాత్రమే చేయడంతో 23 పరుగుల తేడాతో ఆర్సీబీ గెలిచింది.  

ఆర్సీబీ బౌలింగ్ హీరోస్:
ఆర్సీబీ బౌలర్లలో యువ సంచలనం రసిఖ్ సలాం దార్ 3 వికెట్లతో పంజాబ్ నడుం విరచగా.. భువనేశ్వర్ కుమార్ 2 వికెట్లు పడగొట్టాడు. జోష్ హేజిల్‌వుడ్, రొమారియో షెపర్డ్, సుయాష్ శర్మలకు తలో వికెట్ దక్కింది. ఈ విజయంతో ఐపీఎల్ 2026లో అధికారికంగా ప్లేఆఫ్స్ లోకి వెళ్లిన మొదటి జట్టుగా ఆర్సీబీ నిలిచింది.