కరోనా ఎఫెక్ట్: 45 మిలియన్ డాలర్ల ఆదాయం కోల్పోనున్న బ్రిటన్ రాణి కుటుంబం

కరోనా ఎఫెక్ట్: 45 మిలియన్ డాలర్ల ఆదాయం కోల్పోనున్న బ్రిటన్ రాణి కుటుంబం

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ కుదేలు కాగా, దాని ఎఫెక్ట్ బ్రిటన్ రాణి ఎలిజబెత్ కుటుంబపైనా తీవ్రంగా పడింది. బ్రిటన్ రాజ కుటుంబానికి చెందిన  నిర్మాణాలను పర్యాటకులు పెద్ద ఎత్తున సందర్శిస్తుంటారు. ఫలితంగా వచ్చే ఫీజుల రూపంలో పెద్ద ఎత్తున ఆదాయం వచ్చేది. అదంతా ఎలిజబెత్ ఖాతాలోకి చేరేది. అయితే.. కరోనా కారణంగా ప్రపంచం మొత్తం స్తంభించిపోవడంతో పర్యాటకుల రాక తగ్గిపోయింది. ఫలితంగా రాణి కుటుంబం 35 మిలియన్ పౌండ్ల (45 మిలియన్ డాలర్లు) ఆదాయం కోల్పోనున్నట్టు రాజకుటుంబం మనీ మేనేజర్ మైఖేల్ స్టీవెన్స్ తెలిపారు.

రాణి నివసించే బకింగ్‌హామ్ ప్యాలెస్‌కు మరమ్మతులు చేయాల్సి ఉండగా నిధులు లేక ఆపేశారు. దీంతో అది శిథిలావస్థకు చేరుకునే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. నిధులు లేకున్నప్పటికీ ప్రభుత్వాన్ని రాణి కోరబోరని, ఉన్న నిధులతోనే సర్దుబాటు చేసుకుంటామని స్టీవెన్స్ తెలిపారు. మరోవైపు నిధులు లేక సిబ్బందికి జీతాలు చెల్లించడం నిలిపివేశారు. గత ఆర్థిక సంవత్సరంలో బ్రిటన్ ప్రభుత్వం రాజకుటుంబానికి  69.4 మిలియన్‌ పౌండ్లు అందజేసింది.