నడుస్తున్న రైళ్లో పోలీస్ కాల్పులు..నలుగురు మృతి

నడుస్తున్న రైళ్లో పోలీస్ కాల్పులు..నలుగురు మృతి

మహారాష్ట్రలోని పాల్ఘర్ లో  కదులుతున్న రైల్లో కాల్పులు కలకలం రేపాయి.  జైపూర్ ముంబై  ఎక్స్ ప్రెస్ రైలులో ఓ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఏఎస్ఐ సహా ముగ్గురు ప్రయాణికులు మృతి చెందారు. దహీసర్ స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 

ఈ ఘటన చోటు చేసుకున్న జైపూర్ ఎక్స్ ప్రెస్ ..జైపూర్ నుంచి ముంబై వెళ్తోంది. రైలు పాల్ఘర్ స్టేషన్ దాటుతున్న క్రమంలో, ముంబైకి ఇంకా 100 కిలోమీటర్ల దూరంలో ఉండగా.. ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చేతన్ సింగ్ బి 5 కోచ్ లో ఒక్కసారిగా కాల్పులు జరిపాడు. చేతన్ సింగ్, ఏఎస్ఐతో వాగ్వాదానికి దిగాడని తెలుస్తోంది.  దీంతో కొందరు జోక్యం చేసుకున్నారని..తీవ్ర ఆగ్రహానికి లోనైన కానిస్టేబుల్ ఏఎస్ఐతో సహా వారందరిపై  కాల్పులు జరిపాడని సమాచారం. 

ఈ ఘటనలో ఏఎస్ ఐ సహా నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కాల్పులు జరిపిన అనంతరం నిందితుడు చేతన్ సింగ్  రైలు నుంచి  దూకేశాడు. అనంతరం నిందితుడిని రైల్వే పోలీసులు చాక చక్యంగా అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఉన్న ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు.

జులై 31వ తేదీ సోమవారం ఉదయం 5 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. పాల్ఘర్- ముంబై మధ్య దహిసర్‌లో ఈ కాల్పులు జరిగాయి. కాల్పులు జరిపిన పోలీసు కానిస్టేబుల్ మీరా రోడ్డు సమీపంలో పట్టుబడ్డాడు. కానిస్టేబుల్ మానసిక ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది.