తక్కువ ధర‌కే ట్రాక్ట‌ర్.. ఓఎల్ఎక్స్‌లో సైబ‌ర్ నేర‌గాళ్ల‌ మోసం

తక్కువ ధర‌కే ట్రాక్ట‌ర్.. ఓఎల్ఎక్స్‌లో సైబ‌ర్ నేర‌గాళ్ల‌ మోసం

లాక్‌డౌన్‌ సమయంలోనూ సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయ‌క ప్రజలను మోసం చేస్తూ అందిన కాడికి దోచుకుంటున్నారు. తక్కువ ధరకే అమ్మ‌కానికి వ్యవసాయ ట్రాక్టర్ అంటూ… OLX లో ఓ పోస్ట్ చేసి, బ‌షీర్ బాగ్ కు చెందిన ఓ వ్య‌క్తి ద‌గ్గ‌ర రూ.1.60 ల‌క్షలు దోచుకున్నారు.

సైబ‌ర్ నేర‌గాళ్లు పెట్టిన పోస్ట్ చూసి, తక్కువ ధ‌ర‌కే ట్రాక్ట‌ర్ వస్తుందని ఆశపడి, అందులో ఉన్న ఫోన్ నంబర్ కు కాల్ చేశాడు బషీర్ బాగ్ చెందిన గాలి దేవుడు అనే వ్యక్తి. అవ‌త‌లి వ్య‌క్తి తాను.. ఆర్మీ అధికారిన‌ని, ట్రాక్ట‌ర్ డైరెక్ట్ గా డెలివరీ ఇవ్వడం వీలుకాదని, ఆర్మీ ట్రాన్స్ పోర్ట్ ద్వారా డెలివర్ చేస్తానని నమ్మించాడు. అత‌డి మాట‌లు న‌మ్మిన గాలి దేవుడు ప్రాసెసింగ్ , ఇతర ఛార్జీలతో కలిపి 1 ల‌క్షా 60 వేల రూపాయ‌ల‌ను ఆన్ లైన్ ద్వారా ట్రాన్స్‌‌ఫ‌ర్ చేశాడు.

ట్రాక్టర్ డెలివరీ చేయకపోవడం.. వారి మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ రావడంతో.. తాను మోసపోయానని తెలుసుకున్న బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేశాడు. పోలీసులు ఈ ఘ‌ట‌న‌పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సైబ‌ర్ నేర‌గాళ్ల‌ను ప‌ట్టుకునే పనిలో ప‌డ్డారు.

ఇదిలా ఉండ‌గానే.. త‌న‌కు తెలియకుండానే త‌న అకౌంట్ లో నుండి రూ.50,000 నగదు పోయాయంటూ.. హైదరాబాద్ తిరుమలగిరి కి చెందిన రాజేష్ రాఘవ్ అనే వ్యక్తి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సైబర్ పోలీసులు.