కోడ్‌‌‌‌తో సంబంధం లేకున్నా..సింగరేణిలో కొనుగోళ్లు ఆపేసిన్రు

కోడ్‌‌‌‌తో సంబంధం లేకున్నా..సింగరేణిలో కొనుగోళ్లు ఆపేసిన్రు
  • సింగరేణి సంస్థలో ఆగిపోయిన రూ. 1000 కోట్ల పనులు
  • నిలిచిన మెషినరీ, స్పేర్‌‌‌‌ పార్ట్స్‌‌‌‌ కొనుగోళ్లు, ఓబీ రిమూవల్‌‌‌‌ టెండర్లు
  • సింగరేణికి కోడ్‌‌‌‌తో సంబంధం లేదని గతంలోనే చెప్పిన ఈసీ 
  • అయినా పట్టించుకోని ఆఫీసర్లు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: పార్లమెంట్‌‌‌‌ ఎన్నికల కోడ్​ఎఫెక్ట్‌‌‌‌ సింగరేణి సంస్థకూ తాకింది. ఎసెన్షియల్‌‌‌‌ సంస్థ అయిన సింగరేణికి కోడ్‌‌‌‌తో సంబంధం లేదని గతంలోనే ఎన్నికల సంఘం చెప్పినా కొందరు ఆఫీసర్లు అవగాహనలోపంతో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. దీంతో రూ. వెయ్యి కోట్లకుపైగా విలువైన పనులు నిలిచిపోయాయి. టెండర్ల ప్రాసెస్‌‌‌‌, మెషినరీ, స్పేర్ పార్ట్స్‌‌‌‌ కొనుగోళ్లు, ఇతరత్రా ప్రమోషన్లకు యాజమాన్యం కోడ్‌‌‌‌ను సాకుగా చూపుతోంది. దీని వల్ల ప్రొడక్షన్‌‌‌‌పై ప్రభావం పడే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

కోల్‌‌‌‌ ప్రొడక్షన్‌‌‌‌పై ప్రభావం

ఈ ఆర్థిక సంవత్సరంలో 72 మిలియన్‌‌‌‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా చేయాలని సింగరేణి సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. కోల్‌‌‌‌ ప్రొడక్షన్‌‌‌‌ టార్గెట్‌‌‌‌ రీచ్‌‌‌‌ కావాలంటే అండర్‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌, ఓపెన్‌‌‌‌ కాస్ట్‌‌‌‌, లాంగ్‌‌‌‌ వాల్ ప్రాజెక్ట్‌‌‌‌లకు అవసరమైన వెహికల్స్, వాటికి సంబంధించిన స్పేర్‌‌‌‌ పార్ట్స్‌‌‌‌ను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచాలి. ఇప్పటికే సేఫ్టీతో పాటు పలు మిషనరీకి అవసరమైన స్పేర్‌‌‌‌పార్ట్స్‌‌‌‌ను అందుబాటులో ఉంచడం లేదని కార్మికులు ఆగ్రహంగా ఉన్నారు. దీనికి తోడు ఎన్నికల కోడ్‌‌‌‌ పేరుతో పరికరాలు కొనకపోవడం సరికాదని కార్మికులు అంటున్నారు. కోల్​ప్రొడక్షన్‌‌‌‌లో కీలకమైన మెషినరీని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని ఆదేశిస్తున్న యాజమాన్యం కొనుగోళ్లు, టెండర్లు ఆపడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఓబీ రిమూవల్, సాండ్‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌పోర్టు, బాటమ్‌‌‌‌ యాష్‌‌‌‌ ఇతరత్రా టెండర్లు కూడా ఆగిపోవడంతో కోల్‌‌‌‌ ప్రొడక్షన్‌‌‌‌పై ప్రభావం పడుతుందని పలువురు అంటున్నారు.

బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌లో హయాంలో సింగరేణిలో పెరిగిన రాజకీయ జోక్యం

బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సింగరేణి సంస్థలో రాజకీయ జోక్యం క్రమంగా పెరిగింది. కంపెనీలో చేపట్టే టెండర్లకు ప్రభుత్వ పోర్టల్‌‌‌‌ ద్వారానే నోటిఫికేషన్​ ఇవ్వాలంటూ అప్పటి పాలకులు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్‌‌‌‌ అధికారంలోకి వచ్చినప్పటికీ సింగరేణిలో పనిచేస్తున్న కొందరు ఆఫీసర్లు పాత పద్ధతినే కొనసాగిస్తున్నారు. ఎన్నికల కోడ్‌‌‌‌తో సింగరేణికి సంబంధం లేకున్నా గత బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ హయాంలో ఇచ్చిన ఆదేశాలనే ఇంకా అమలు చేస్తున్నారు. ఎసెన్షియల్‌‌‌‌ సంస్థ అయిన సింగరేణిలో జీఎం స్థాయి ట్రాన్స్‌‌‌‌ఫర్స్‌‌‌‌, మెషినరీ స్పేర్‌‌‌‌ పార్ట్స్‌‌‌‌, ఓబీ రిమూవల్‌‌‌‌ టెండర్ల వంటి వాటిని ప్రాసెస్‌‌‌‌ చేసుకునేందుకు కోడ్‌‌‌‌తో సంబంధం లేదని గతంలోనే ఎన్నికల సంఘం చెప్పినప్పటికీ అవగాహన లేని కొందరు ఆఫీసర్ల కారణంగా సంస్థకు నష్టం వాటిల్లుతోందని పలువురు సీనియర్లు వాపోతున్నారు. సింగరేణి జీఎంలకు ఎలక్షన్‌‌‌‌ డ్యూటీలకు సంబంధం లేకున్నా ప్రమోషన్లు, ట్రాన్స్‌‌‌‌ఫర్స్‌‌‌‌ను ఆపేసి ఇన్‌‌‌‌చార్జులతో నెట్టుకొస్తున్నారు.

నెలరోజులుగా నిలిచిన కొనుగోళ్లు

సింగరేణి కాలరీస్‌‌‌‌ కంపెనీని ఎసెన్షియల్‌‌‌‌ సంస్థగా గుర్తిస్తున్నారు. వేసవి తీవ్రత పెరిగినందున రాష్ట్రంలో విద్యుత్‌‌‌‌ అవసరం భారీగా పెరిగింది. బొగ్గు ఉత్పత్తికి బ్రేక్‌‌‌‌ పడితే ఆ ప్రభావం విద్యుత్‌‌‌‌ సంస్థలపై పడుతుంది. కానీ సంస్థలో పనిచేసే కొందరు ఆఫీసర్ల అవగాహనాలోపంతో ఎన్నికల కోడ్‌‌‌‌ ఉందంటూ ముఖ్యమైన టెండర్లతో పాటు మిషనరీ, స్పేర్‌‌‌‌ పార్ట్స్‌‌‌‌ కొనుగోళ్లను అధికారికంగా ఆపేశారు. కోల్​ప్రొడక్షన్‌‌‌‌లో కీలకమైన లాంగ్‌‌‌‌వాల్‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌లకు అవసరమైన స్పేర్‌‌‌‌ పార్ట్స్‌‌‌‌తో పాటు సేఫ్టీ, ఓపెన్‌‌‌‌ కాస్ట్‌‌‌‌లలో వెహికల్స్‌‌‌‌కు అవసరమైన పలు మిషనరీ స్పేర్‌‌‌‌ పార్ట్స్‌‌‌‌, ఎస్డీఎల్‌‌‌‌ వెహికల్స్‌‌‌‌, ఓవర్‌‌‌‌ బర్డెన్‌‌‌‌ (ఓబీ) రిమూవల్‌‌‌‌ వంటి పలు టెండర్ల ప్రాసెస్‌‌‌‌ను నెల రోజులుగా నిలిపివేశారు.