
అది ఓ కార్ షోరూం.. నాలుగు బ్రాంచీలు ఉన్నాయి.. ఏదో కార్లు అమ్ముకుంటున్నారు అనుకుంటే పొరపాటే.. కార్ షోరూంలో కార్ల అమ్మకాలు, కొనుగోళ్ల ద్వారా ఏకంగా 100 కోట్ల రూపాయల బ్లాక్ మనీ లావాదేవీలు జరిగినట్లు వెలుగులోకి రావటం అందర్నీ షాక్ కు గురి చేసింది. కేరళ రాష్ట్రంలోని ఐటీ అధికారుల తనిఖీల్లో బయటపడిన ఈ బ్లాక్ మనీ లావాదేవీల బాగోతంలో.. క్రికెటర్లు, సినిమా స్టార్లు సైతం ఉన్నట్లు బయటపడటం సంచలనంగా మారింది.
వివరాల్లోకి వెళితే.. కేరళ రాష్ట్ర తీరప్రాంత నగరమైన కోజికోడ్ లోని కార్ షోరూమ్ 'రాయల్ డ్రైవ్' అనే కంపెనీలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఆకస్మిక దాడులు జరిపారు. మలప్పురం నివాసి ముజీబ్ రెహమాన్‌కు చెందిన ఈ కార్ షోరూమ్‌లో రూ.102 కోట్ల విలువైన నల్లధనం వ్యవహారం బయటపడింది. తిరువనంతపురం, ఎర్నాకులం, మలప్పురం, కోజికోడ్ బ్రాంచ్‌లలో రెండు రోజులుగా దాడులు నిర్వహించారు.
గత కొన్ని నెలలుగా ఈ కార్ షోరూమ్‌లో పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు జరుగుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు జరిపగా.. ప్రముఖ సెలబ్రిటీలు లగ్జరీ కార్లను కొనుగోలు చేసి, వాటిని ఏడాది లేదా రెండేళ్లపాటు వినియోగించి, ఆ తర్వాత తమ ఖాతాల్లోని లావాదేవీలను నమోదు చేయకుండా రాయల్ డ్రైవ్‌కు విక్రయించినట్లు తేలింది.
అంతేకాదు.. షోరూమ్‌లో నల్లధనం చెల్లించి కార్లను కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఈ ఘటనలో భారత క్రికెటర్‌తోపాటు పలువురు మలయాళ సినీ తారలు కూడా ఉన్నారని అనుమానిస్తున్నారు అధికారులు. దీంతో వారికి నోటీసులు పంపాలని ఆదాయపు పన్ను శాఖ నిర్ణయించినట్లు తెలుస్తోంది.