రూ. 2.5 కోట్ల మద్యాన్ని సీజ్ చేసినం : మంత్రి శ్రీనివాస్ గౌడ్

రూ. 2.5 కోట్ల మద్యాన్ని సీజ్ చేసినం : మంత్రి శ్రీనివాస్ గౌడ్

తెలంగాణ బ్రాండ్ పేరుతో ఒడిశాలో కల్తీ మద్యం తయారీపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. ఇక్కడ తీగ లాగితే.. ఒడిశాలో డొంక కదిలిందని అన్నారు. ఒడిశాలోని అభయ్ పూర్ అటవీ ప్రాంతంలో మద్యం తయారీ జరిగిందని చెప్పారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 10మంది నిందితులను అరెస్టు చేశారని, మరికొంతమందిని త్వరలోనే పట్టుకుంటారని తెలిపారు. ఇప్పటికే అనుమానం వచ్చిన నారాయణగూడలోని ఓ మద్యం దుకాణం లైసెన్స్ కూడా రద్దు చేయించామని వివరించారు. ఇంకా ఎవరైనా అలాంటి వారు ఉంటే తమకు సమాచారం ఇవ్వాలని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ విషయంలో ఎంత పెద్ద పలుకుబడి వ్యక్తి ఉన్నా.. వారిని వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇలాంటి చర్యల వల్ల రాష్ట్రానికి ఆదాయం తగ్గిపోతుందని చెప్పారు. 

తండాలలో గుడాంబాను అరికట్టాలని సీఎం కేసీఆర్ చెప్పిన ఏడాదిలోనే లేకుండా చేశామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ ఘటనలో ఎవర్నీ వదలిపెట్టమని స్పష్టం చేశారు. ఎక్కడా అనుమానం రాకుండా, ఎంతో తెలివితో బార్ కోడ్ లోనూ ఎలాంటి డౌట్ రాకుండా ఈ పన్నాగం పన్నారని చెప్పారు. దాదాపు 2.5 కోట్ల మద్యాన్ని అధికారులు సీజ్ చేశారన్నారు. గతంలో ఇలాంటి పనులు మాఫియాలు చేస్తుండేవని, కానీ తెలంగాణ వచ్చాక పేకాట, గుడుంబా, అక్రమ మద్యం సరఫరాపై ఉక్కుపాదం మోపడంతో ఆగిపోయిందని చెప్పారు. ఇలాంటి అక్రమాలు వేరే రాష్ట్రం వాళ్లే కాదు.. మన రాష్ట్రం వాళ్లు చేసినా వదిలిపెట్టమని స్పష్టం చేశారు. దీంట్లో ఏ రాజకీయ నేత ఉన్నా.. ఇంకెవరున్నా వదిలిపెట్టమన్నారు. ఈ ఘటనపై అణువణువూ పరిశోధించి, విచారిస్తామని హామీ ఇచ్చారు.