డిస్కంలను ముంచిన సర్కారు .. తొమ్మిదిన్నరేండ్లలో రూ.లక్ష కోట్ల అప్పులు: టీజేఏసీ

డిస్కంలను ముంచిన సర్కారు ..  తొమ్మిదిన్నరేండ్లలో రూ.లక్ష కోట్ల అప్పులు: టీజేఏసీ
  • రూ.52 వేల కోట్ల నష్టాల ఊబిలోకి సంస్థలు
  • రూ.25 వేల కోట్ల వ్యవసాయ సబ్సిడీ ఎగ్గొట్టిన ప్రభుత్వం 
  • ఉన్నపళంగా చార్జీలు పెంచలేరు.. నష్టాలు పూడ్చలేరు
  • అప్పుల అగ్నిపర్వతం ఎప్పుడైనా బద్దలు కావొచ్చని హెచ్చరిక

హైదరాబాద్‌‌, వెలుగు:  విద్యుత్‌‌ సంస్థలు తొమ్మిదిన్నరేండ్లలో రూ. లక్ష కోట్ల అప్పుల్లో మునగడంతో పాటు రూ.52 వేల కోట్లకు పైగా నష్టాల్లో కూరుకుపోయాయని తెలంగాణ జాయింట్​యాక్షన్​కమిటీ(టీజేఏసీ) తెలిపింది. రాష్ట్ర సర్కారు అడ్డగోలు ధరలతో కరెంటు కొని సప్లయ్​ చేస్తూ..  సబ్సిడీలు ఎగ్గొట్టడంతో ఏటా వేల కోట్లలో నష్టాలు పెరిగిపోయాయని, డిస్కంలు దివాలా తీసే పరిస్థితి ఉందని టీజేఏసీ తెలిపింది. తొమ్మిదిన్నరేండ్లలో విద్యుత్‌‌ సంస్థలకు సర్కారు ఎలా నష్టం చేసిందనే అంశాలను టీజేఏసీ మీడియాకు వెల్లడించింది. 

సర్కారు సంస్థల నుంచి బిల్లులు రాక, బకాయిలు పెరిగి, డిస్కంల రేటింగ్‌‌ భారీగా పడిపోయినా 24 గంటల కరెంటు అందిస్తున్నాం, రైతులకు ఉచిత విద్యుత్‌‌ ఇస్తున్నామని, అంతా బాగుందని చెప్పేందుకు సర్కారు ప్రయత్నిస్తోందని టీజేఏసీ విమర్శించింది. గత తొమ్మిదిన్నర ఏండ్లలో విద్యుత్ పంపిణీ సంస్థలు ఆర్థికంగా నిలదొక్కుకోకుండా సర్కారు నిండా ముంచిందని ఆరోపించింది. అప్పుల అగ్నిపర్వతం ఎప్పుడైనా బద్దలు కావచ్చని, రాష్ట్ర ప్రజలపై పర్యవసానాలు భయంకరంగా ఉండే ప్రమాదం ఉందని టీజేఏసీ ఆందోళన వ్యక్తం చేసింది. 

తెల్ల ఏనుగు లాంటి ప్రాజెక్టులు

రాష్ట్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు విద్యుత్ సంస్థలు లక్ష కోట్లకు పైగా అప్పులు చేశాయని, ఈ అప్పుల్లో సగం కొత్తగా కట్టే పవర్ ప్రాజెక్టులకే వెచ్చించినట్లు టీజేఏసీ తెలిపింది. ఆ అప్పులతో కట్టిన 1080 మెగావాట్ల భద్రాద్రి ప్రాజెక్టు ఉత్పత్తి పరంగా దేశంలోనే అత్యధిక ఖరీదైన ప్రాజెక్టుల్లో ఒకటి అని, గోదావరి నది ఒడ్డున కట్టడంతో సాధారణ వరదలకే ప్లాంటులోకి నీళ్లు వచ్చే పరిస్థితి ఉందని పేర్కొంది. పోలవరం నిర్మాణం పూర్తయితే చిన్న వరదకే పూర్తిగా మునగడం ఖాయమని టీజేఏసీ ఆందోళన వ్యక్తం చేసింది.16 నెలల్లోనే ప్రాజెక్టు కడతామన్న సర్కారు.. టెక్నాలజీని వాడినా నిర్మాణానికి 6 ఏండ్ల టైమ్ ​తీసుకుందని చెప్పింది. 

మరో పెద్ద ప్రాజెక్టు 4000 మెగావాట్లతో పనులు మొదలు పెట్టిన యాదాద్రి ప్రాజెక్టు 7 ఏండ్లయినా పూర్తి కాలేదని, ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణం కోసమే దాదాపు రూ.50 వేల కోట్లు ప్రభుత్వం దారపోసిందని టీజేఏసీ ఆరోపించింది. బహిరంగ మార్కెట్​లో తక్కువ ధరకే కరెంట్ దొరుకుతుంటే, రాష్ట్ర సర్కారు తెల్ల ఏనుగుల్లాంటి ఈ ఖరీదైన ప్రాజెక్టులపై వేల కోట్లు ఖర్చు చేసిందని టీజేఏసీ విమర్శించింది. 

సబ్సిడీ విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేరుతో..

రైతులకు ఉచిత విద్యుత్తు, సంక్షేమ పథకాల కోసం సబ్సిడీ విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందించడానికి రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే కరెంటు ఏ మాత్రం సరిపోక బహిరంగ మార్కెట్​లో ప్రభుత్వం పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తోందని టీజేఏసీ ఆరోపించింది. విద్యుత్ సంస్థలు అప్పులు చేసి కిందా మీదా పడి రైతులకు, ఇతర అవసరాలకు కరెంటు సరఫరా చేస్తే, ఆ ఖర్చులు ప్రభుత్వం సబ్సిడీ కింద భరించలేదని, ఇలా ఇప్పటికీ రూ.25 వేల కోట్ల వ్యవసాయ సబ్సిడీలు ప్రభుత్వం ఎగ్గొట్టినట్లు పేర్కొంది. మరోవైపు ఎత్తిపోతల పథకాలకు సరఫరా చేసిన కరెంటు బకాయిలు రూ.12 వేల కోట్ల దాటాయని, ఇవీగాక మొత్తం ప్రభుత్వ శాఖలు చెల్లించాల్సిన బాకీలు రూ.20 వేల కోట్ల మేర ఉన్నాయని టీజేఏసీ తెలిపింది.  ప్రభుత్వం నుంచి సబ్సిడీలు, ప్రభుత్వ శాఖల నుంచి బాకీలు  వసూలయ్యే పరిస్థితి లేదని, ఇప్పటికే సంస్థలన్నింటినీ తాకట్టు పెట్టడంతో కొత్తగా అప్పు చేద్దామంటే కుదవ పెట్టడానికి గజం భూమి కూడా మిగలలేని పరిస్థితికి సర్కారు తీసుకొచ్చిందని విమర్శించింది. 

క్రెడిట్ ​సర్కారుకు.. నష్టాలు డిస్కంలకు

రాష్ట్రంలో కరెంటు సరఫరా అద్భుతంగా ఉందని, 24 గంటల కరెంట్​ఇస్తున్నట్లు క్రెడిట్ తీసుకోవడానికే ప్రభుత్వం పరిమితమైందని, కరెంటు కొని సరఫరా చేసిన విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంస్థల ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారిందని టీజేఏసీ తెలిపింది. దేశ వ్యాప్తంగా మొత్తం 51 డిస్కంలు ఉంటే సెంట్రల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎలక్ట్రిసిటీ అథారిటీ విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంస్థలకు ఇచ్చే ర్యాంకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తెలంగాణ డిస్కంలు సదరన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిస్కం 43వ ర్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో, నార్తర్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిస్కం  47 ర్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో అట్టడుగున ఉన్నాయని గుర్తు చేసింది. 

తెలంగాణ డిస్కమ్ ల క్రెడిట్ రేటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‘సి’ గ్రేడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పడిపోయిందని, బ్యాంకుల నుంచి అప్పు కూడా పుట్టే పరిస్థి లేదని వెల్లడించింది. ఈ తొమ్మిదిన్నరేండ్లలో విద్యుత్ సంస్థల నష్టాలు రూ.52 వేల కోట్లు దాటాయని, ఈ నష్టాలు పూడ్చుకోవాలంటే కరెంటు అమ్మకాల ద్వారా సాధ్యమయ్యేలా కనిపించడం లేదని టీజేఏసీ అభిప్రాయపడింది. 2022 లో పెంచిన రూ.5600 కోట్ల చార్జీలకే జనాలు అల్లాడిపోతున్న.. మళ్లీ చార్జీలు పెంచే అవకాశం లేకుండా పోయిందని, ఒక వేళ పెంచాల్సిన తప్పని పరిస్థితి ఏర్పడితే.. రూ.52 వేల కోట్ల  చార్జీల పెంపు అంటే పరిస్థితి ఊహకందదని టీజేఏసీ ఆందోళన వ్యక్తం చేసింది. 

ప్రభుత్వ పెద్దలు పలు వేదికలపై మాట్లాడుతూ.. నష్టాలను అప్పులుగా చూపిస్తూ, అప్పులు లేకుండా అభివృద్ధి ఎట్లా ? అని, డెఫిసిట్ ఫైనాన్స్ అని, డెవలప్​మెంట్ ఎకనామిక్స్ అని గందరగోళం చేస్తూ.. అంతా బాగుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని టీజేఏసీ ఆరోపించింది.