సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ కాలేజీలకు రూ.3.34 కోట్లు మంజూరు .. కాలేజీల్లో తీరనున్న సమస్యలు

సంగారెడ్డి జిల్లాలోని  ప్రభుత్వ  కాలేజీలకు రూ.3.34 కోట్లు మంజూరు .. కాలేజీల్లో తీరనున్న సమస్యలు
  • 17 కాలేజీల్లో వసతుల ఏర్పాటుకు వినియోగం

సంగారెడ్డి, వెలుగు:  ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో కనీస వసతులు కల్పించేందుకు ప్రభుత్వం రూ.3.34 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో మౌలిక సౌకర్యాలు కల్పించి నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రణాళికలు రూపొందించింది. జిల్లా వ్యాప్తంగా 20 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉండగా ప్రైవేట్​కాలేజీలు 48 ఉన్నాయి. వీటిలో17 ప్రభుత్వ కాలేజీల్లో వసతుల లేమి కారణంగా స్టూడెంట్స్ ప్రైవేట్ కాలేజీల వైపు మొగ్గుచూపుతున్నట్లు అధికారులు గుర్తించారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి నివేదికలు పంపించి నిధులు మంజూరు చేయాలని కోరింది. అందుకు తగ్గట్టుగా ఆయా కాలేజీల్లో వసతులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నెల చివరి వరకు అడ్మిషన్లు కొనసాగుతున్న నేపథ్యంలో విద్యార్థుల సంఖ్యను మరింత పెంచేందుకు అధికారులు ప్లాన్ చేశారు.

కాలేజీల్లో సౌకర్యాలు ఇలా..

ప్రభుత్వం మంజూరు చేసిన రూ.3.34 కోట్ల నిధులను అవుట్ సోర్సింగ్ ద్వారా లెక్చరర్ పోస్టుల భర్తీ, భవన నిర్మాణాలు, మూత్రశాలల మరమ్మతులు, డ్యూయల్ డెస్క్ లు, గ్రీన్ బోర్డులు, సీసీ కెమెరాల ఏర్పాటు, ఫ్రీగా పాఠ్యపుస్తకాల పంపిణీ, స్టూడెంట్స్ హాజరు పర్యవేక్షణ తదితర సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు వినియోగించనున్నారు. కనీస సౌకర్యాలు మెరుగుపడుతున్న క్రమంలో కాలేజీల్లో స్టూడెంట్స్ సంఖ్య పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

సౌకర్యాలు మెరుగుపరుస్తున్నాం

జిల్లాలో ఉన్న 17 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో సౌకర్యాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఆ నిధులతో మౌలిక అవసరాలు తీర్చి స్టూడెంట్స్ కు సౌకర్యాలు సమకూరుస్తాం. విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పిస్తే ప్రభుత్వ కాలేజీల్లో వారి సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. విద్యార్థులు ప్రభుత్వ కాలేజీల్లో చేరి భవిష్యత్​కు చక్కటి బాటలు వేసుకోవాలి. 

గోవిందరావు, డీఐఈవో , సంగారెడ్డి జిల్లా

కాలేజీల వారీగా మంజూరైన నిధులు

కాలేజీ    నిధులు లక్షల్లో..
సంగారెడ్డి (బాలురు)    రూ.31.00
సంగారెడ్డి (బాలికలు)    రూ.10.51
సదాశివపేట    రూ.21.60
రామచంద్రపురం    రూ.12.50
పుల్కల్    రూ.9.20
పటాన్ చెరు    రూ.6.00
అందోల్ (బాలురు)    రూ.20.00
ఆందోల్ (బాలికలు)    రూ.15.00
కోహిర్    రూ.24.50
కంగ్టి    రూ.28.50
బుదేరా (మునిపల్లి)    రూ.13.50
న్యాల్కల్    రూ.26.50
హద్నార్ (న్యాల్కల్)    రూ.29.50
హత్నూర    రూ.11.30
కొండాపూర్    రూ.25 .00 నారాయణఖేడ్    రూ.28.00
జిన్నారం    రూ.21 .00