హుజురాబాద్ అభివృద్ధికి రూ.35 కోట్లు మంజూరు

హుజురాబాద్ అభివృద్ధికి రూ.35 కోట్లు మంజూరు

కరీంనగర్: హుజురాబాద్ అభివృద్ధికి రూ.35 కోట్లు మంజూరు చేసుకున్నామని తెలిపారు మంత్రి గంగుల కమలాకర్. బుధవారం ఆయన హుజురాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ..హుజురాబాద్ పట్టణం ఇంతకాలం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. అందుకే వెంటనే రూ. 35 కోట్లు మంజూరు చేసుకున్నామన్నారు. వెంటనే అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని గ్రామాలు అభివృద్ధి చెందుతున్నా.. హుజురాబాద్ అభివృద్ధి కాకపోవడం బాధాకరమన్నారు. ప్రస్తుతం హుజురాబాద్ ఎమ్మెల్యే రాజీనామా చేయడంతో.. అభివృద్ధి చేసే బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు.  హుజురాబాద్ లో ప్రధాన రహదారులపై మురుగు నీరు ప్రవహిస్తూ అధ్వానంగా కనిపిస్తున్నాయని.. ఇంతకాలం హుజరాబాద్ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ పట్టణ అభివృద్ధిని విస్మరించి ప్రజా సమస్యలను గాలికి వదిలేశారన్నారు. 

మున్సిపల్ లో ఉన్న అరకొర నిధులతో పాలకవర్గం అభివృద్ధి చేయలేక పోయిందని..హుజరాబాద్ లో నెలకొన్న సమస్యలను పాలకవర్గ సభ్యులు ప్రభుత్వం దృష్టికి తీసుకు రావడంతో వెంటనే పట్టణ అభివృద్ధికి రూ. 35 కోట్లు సీఎం మంజూరు చేశారని తెలిపారు. వీటిలో రూ.10 కోట్ల 50 లక్షలు మిషన్ భగీరథ పైప్ లైన్ ఏర్పాటుకు, రూ. 25 కోట్లతో ఇతర పనులు ప్రారంభిస్తామన్నారు. పట్టణంలో రోడ్లపై మట్టి లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించామని..హుజురాబాద్ అభివృద్ధి కోసం ముగ్గురు ఏఇలు, డిఈ, ఈఈలను వెంటనే నియమిస్తున్నామని తెలిపారు. కరీంనగర్ వరంగల్ ప్రధాన రహదారి, సైదాపూర్ రహదారి మరమ్మతులు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్న గంగుల.. హుజురాబాద్, జమ్మికుంట పట్టణాల ఆధునీకరణకు ఎన్ని నిధులైన ప్రభుత్వం ఇచ్చేందుకు రెడీగా ఉందన్నారు.