​ మరో భారీ భూ దందా!

​ మరో భారీ భూ దందా!
  •     భూపాలపల్లి జిల్లా కొంపెల్లిలో భూ అక్రమాలు
  •     బీఆర్ఎస్​ మాజీ ఎమ్మెల్యేతో పాటు కలెక్టర్ పాత్ర 
  •     సుప్రీంకోర్టుకూ తప్పుడు అఫిడవిట్ ​
  •      బీఆర్ఎస్ హయాంలో ఐఏఎస్​ల భూ దందాలపై సర్కార్ నజర్

హైదరాబాద్, వెలుగు: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన మరో భారీ భూ దందా వెలుగులోకి వచ్చింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వందల కోట్ల విలువైన అటవీ భూముల ఆక్రమణ వ్యవహారంలో ఓ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేతో పాటు జిల్లా కలెక్టర్ పాత్ర కూడా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇటీవల భూపాలపల్లి జిల్లా కొంపెల్లి అటవీ భూములపై సుప్రీంకోర్టు వె ల్లడించిన తీర్పుతో భూ దందాలో కొత్త కోణం బయటపడింది. కొంపెల్లిలో రూ.380 కోట్ల విలువైన106 ఎకరాల అటవీ భూమిని కబ్జా చేసేందుకు అప్పటి బీఆర్ఎస్ లీడర్లు, అధికారులు కలిసి ఆడిన నాటకం సంచలనం రేపుతోంది. దీంతో బాధ్యులైన అధికారులపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కొంపెల్లిలోని అటవీ భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేలా గత ప్రభుత్వమే పథకం ప్రకారం పావులు కదిపినట్లు తెలుస్తోంది. 

ఇదీ కేసు.. 

కొంపెల్లి గ్రామ పరిధిలో రిజర్వ్ ఫారెస్ట్ లో ఉన్న 106 ఎకరాల భూమిపై హక్కులు తనవేనని 20 ఏండ్ల కిందటే ఓ ప్రైవేటు వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. 1994లోనే వరంగల్ ఉమ్మడి జిల్లా కోర్టు అటవీ శాఖకు అనుకూలంగా  తీర్పునిచ్చింది. తర్వాత ఆక్రమణదారుడు హైకోర్టును ఆశ్రయించినప్పటికీ అదే తీర్పు వచ్చింది. 2021లో బీఆర్ఎస్ హయాంలో ఈ కేసుపై హైకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలైంది. ఆ భూమి సదరు ప్రైవేటు వ్యక్తికి చెందినదని హైకోర్టు తీర్పునిచ్చింది. ఆ తీర్పును అటవీ శాఖ పట్టించుకోకపోవటంతో ఆక్రమణదారుడు కంటెప్ట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంపై హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ అటవీ శాఖ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. కానీ అక్కడి జిల్లా కలెక్టర్ ప్రభుత్వ అనుమతి లేకుండానే సుప్రీంకోర్టులో రిజాయిండర్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఆ భూమి సదరు ప్రైవేటు వ్యక్తికే చెందుతుందని పేర్కొంటూ హైకోర్టు తీర్పునకు అనుకూలంగా అఫిడవిట్ తయారుచేసి సమర్పించారు.  

ప్రత్యేక చొరవ తీసుకున్న సీఎం రేవంత్​

రెండు ప్రభుత్వ విభాగాలు పొంతన లేకుండా భిన్నమైన అఫిడవిట్లు సమర్పించటంపై అభ్యంతరం తెలిపిన సుప్రీంకోర్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి వివరణ కోరింది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే తన దృష్టికి వచ్చిన ఈ వ్యవహారంపై రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేయించి.. కేసు గెలిచేంత వరకు న్యాయపోరాటం చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం జోక్యంతో సుప్రీంకోర్టులో జిల్లా కలెక్టర్ సమర్పించిన అఫిడవిట్ ను విత్ డ్రా చేయించారు. ఈ భూమి రిజర్వు ఫారెస్ట్ కు చెందినదేనని ఫిబ్రవరి 8వ తేదీన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అఫిడవిట్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు రెండు రోజుల కిందట ఈ కేసులో తీర్పు వెలువరించింది. ఈ భూమి అటవీ శాఖకే చెందుతుందని స్పష్టం చేసింది.   

అధికారులపై చర్యలకు సుప్రీం ఆదేశం 

ప్రైవేటు వ్యక్తులకు అనుకూలంగా అఫిడవిట్ దాఖలు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. గత ప్రభుత్వ చర్యలను ఖండించిన సుప్రీంకోర్టు.. ఆక్రమణదారుకు, ప్రభుత్వానికి రూ.5 లక్షల జరిమానా విధించింది. ఆక్రమణదారులతో చేతులు కలిపిన అధికారులపై విచారణ జరిపి, వారి నుంచి జరిమానా రికవరీకి కూడా అభ్యంతరం లేదని తేల్చిచెప్పింది. అయితే, ఓ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఒత్తిడితోనే జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులు ఆక్రమణదారులతో చేతులు కలిపి తప్పుడు నివేదికలు తయారు చేసినట్లు చర్చ జరుగుతోంది.

రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనూ అనేకం

రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్​గిరి జిల్లాల్లోనూ ప్రభుత్వ, వక్ఫ్, దేవాదాయ భూములకు సంబంధించి ఇలాంటి దందాలు భారీగానే సాగినట్లు ప్రభుత్వం గుర్తించింది. ధరణిలోనూ భూములకు సంబంధించి అటు.. ఇటు చేసి ప్రభుత్వ భూములను పట్టా భూములుగా కట్టాబెట్టారనే విమర్శలు వస్తున్నాయి. వాటిమీద ధరణి కమిటీ కూడా ఒక రిపోర్టును రెడీ చేస్తోంది. ప్రభుత్వం కూడా ఇంటర్నల్​గా ఎక్కడెక్కడ అక్రమంగా భూములు మారాయనే దానిపై వివరాలు సేకరిస్తోంది. అప్పట్లో నలుగురు ఐఏఎస్​లు.. బీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా, ఎలా చెబితే అలా భూముల వివరాల్లో మార్పులు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. వారిపై కూడా ప్రభుత్వం నిఘా పెట్టింది. నిర్ధారణ అయిన వెంటనే చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తోంది.