కరోనా ఇన్​పేషెంట్లకు రోజుకు రూ.50వేల బిల్లు

కరోనా ఇన్​పేషెంట్లకు రోజుకు రూ.50వేల బిల్లు
  • కరోనా ఇన్​పేషెంట్లకు రోజుకు రూ.50వేల బిల్లు
  • జిల్లాల్లో దోచుకుంటున్న ప్రైవేట్​ హాస్పిటళ్లు

వరంగల్/ కరీంనగర్/ సంగారెడ్డి/మంచిర్యాల, వెలుగు: కరోనా సెకండ్​వేవ్​ప్రైవేట్​హాస్పిటల్స్​కు కాసులు కురిపిస్తోంది. సెకండ్​వేవ్​ఎఫెక్ట్​ తీవ్రంగా ఉందన్న ప్రచారం, రోజురోజుకు పాజిటివ్​కేసులు, మరణాలు పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఖర్చుకు వెనుకాడకుండా ప్రాణభయంతో ప్రైవేట్​హాస్పిటళ్లకు పరుగులు పెడుతున్నారు. దీనిని ఆసరాగా చేసుకుని హాస్పిటళ్ల​ యజమానులు అందినంత దండుకుంటున్నారు. లక్ష అడ్వాన్స్​కడితేనే బెడ్​ఇస్తున్నారు. స్పెషల్​రూమ్​కు రూ.20 వేలు, ఐసీయూకు రూ.30 వేలు, మెడికల్, ల్యాబ్, డాక్టర్​చార్జీలంటూ రోజుకు రూ.50 వేలకు పైగా వసూలు చేస్తున్నారు. గర్నమెంట్​ రేట్లను పట్టించుకోకుండా సొంత రేట్లు ఫిక్స్​ చేశారు. పేదలను పీల్చిపిప్పి చేయడమే కాకుండా విలువైన ప్రాణాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై విమర్శలు వస్తున్నాయి.

ఐసీయూలో బెడ్​కు రూ.30వేలు 
20 బెడ్స్​కు మించి కెపాసిటీ ఉన్న ప్రైవేట్​ఆసుపత్రులన్నింటిలో కోవిడ్​ట్రీట్​మెంట్​కు రాష్ట్ర సర్కారు పర్మిషన్​ఇచ్చింది. ఇదే అదునుగా అన్ని జిల్లాల్లో ప్రైవేట్​హాస్పిటల్స్​కార్పొరేట్​ఆసుపత్రులకు దీటుగా కరోనా పేషెంట్లను దోచుకుంటున్నాయి. వరంగల్ అర్బన్​ జిల్లాలో కోవిడ్​ట్రీట్​మెంట్​ కోసం వచ్చే వారి నుంచి ప్రైవేటు హాస్పిటల్స్​పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నాయి.  ఇద్దరికో నర్సును కేర్​ టేకర్​గా పెట్టి వాళ్లకు కావాల్సిన పీపీఈ కిట్లు, గ్లౌజ్​లు, మాస్కుల ఖర్చు, వేస్ట్​ మేనేజ్​మెంట్​చార్జీలు, పీఆర్వోలు, ఆర్​ఎంపీలకు ఇచ్చే కమీషన్లు.. ఇలా అన్నీ పేషెంట్ల అకౌంట్​లోనే వేస్తున్నారు. స్పెషల్​ రూంకు రోజుకు రూ.20 వేల నుంచి రూ.25 వేలు, ఐసీయూకు రూ.30వేల చొప్పున వసూలు చేస్తున్నారు. వీటికి మెడికల్, ల్యాబ్​బిల్లు అదనం. ఇలా ఒక్కో పేషెంట్​కు ఐదు రోజులైనా ట్రీట్​మెంట్​అందిస్తున్నారు. జిల్లాలో 171 ప్రైవేట్​హాస్పిటల్స్​కు పర్మిషన్​ ఇవ్వగా, వాటిలో కేవలం 19 హాస్పిటల్స్​లో శుక్రవారం సాయంత్రం వరకు 349 మంది ట్రీట్​మెంట్​ తీసుకుంటున్నారు. మొన్నటివరకు ఒక్కో ఆసుపత్రిలో సగటున 10 మంది ఇన్​పేషెంట్లుగా ఉంటే  గురువారం 75, శుక్రవారం 55 మంది పేషెంట్ల చొప్పున ఉన్నారు.

అడ్వాన్స్​గా రూ. లక్ష కట్టాల్సిందే.. 
కరీంనగర్​లోని ప్రైవేట్​హాస్పిటల్స్​లో రూ.లక్ష అడ్వాన్స్​కడితేనే పేషెంట్లను అడ్మిట్​ చేసుకుంటున్నారు. బెడ్, రూమ్ కీపింగ్, నర్సింగ్, డాక్టర్, చెస్ట్ ఫిజీషియషన్ చార్జీలు అంటూ రోజుకు రూ.10వేలు తీసుకుంటున్నారు. మెడిసిన్​కు మరో రూ.10 వేలు అవుతున్నాయి. ఆక్సిజన్​పెడితే గంటకు రూ.300, వెంటిలేటర్​కు రూ.7,500 చొప్పున వసూలు చేస్తున్నారు. చాలాచోట్ల ఆక్సిజన్ పెట్టి వెంటిలేషన్ ఫీజులు గుంజుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెమ్డెసివిర్​ఇంజక్షన్ కు రూ.6వేలు, స్క్రీనింగ్ టెస్టుల పేరుతో రూ.1,500 వసూలు చేస్తున్నారు.  ఎటువంటి స్కానింగ్​కు అయినా రూ.3వేలకు మించి వసూలు చేస్తే యాక్షన్​ తీసుకుంటామని కలెక్టర్​ హెచ్చరించినా ఎవరూ పట్టించుకోడం లేదు. అన్నీ కలిపి రోజుకు రూ.50 వేల నుంచి రూ.60వేలు వసూలు చేస్తున్నారు.

అటెండర్లతో సపర్యలు 
సంగారెడ్డిలో 11 ప్రైవేట్ హాస్పిటళ్లలో కోవిడ్​ట్రీట్​మెంట్​కు ప్రభుత్వం పర్మిషన్​ ఇచ్చింది. ఇక్కడ రోజుకు రూ.30వేల నుంచి రూ.50వేల వరకు వసూలు చేస్తున్నారు. ఎమర్జెన్సీ లేకపోయినా ఐసీయూలో పెట్టి క్యాష్​ చేసుకుంటున్నారు. కరోనా పేషెంట్ల వద్ద నర్సింగ్​స్టాఫ్​ ఉండకుండా అటెండెంట్లతో సపర్యలు చేయిస్తున్నారు. వారికి వైరస్​ సోకే ప్రమాదం ఉన్నా పట్టించుకోవడం లేదు.

రెమ్డెసివిర్​ ఇంజక్షన్​కు రూ.10వేలు
రాష్ర్టవ్యాప్తంగా రెమ్డెసివిర్​ఇంజక్షన్లకు తీవ్ర కొరత ఏర్పడింది. కండీషన్​సీరియస్​గా ఉన్న కరోనా పేషెంట్లకు ఆరు ఇంజక్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కో ఇంజక్షన్​కు వివిధ కంపెనీల ధరలు రూ.3వేల లోపు ఉన్నాయి. ఈ లెక్కన ఆరింటికి రూ.18వేలు ఖర్చవుతుంది. కానీ మంచిర్యాలలోని కొన్ని ప్రైవేట్​ హాస్పిటల్స్​లో ఇంజక్షన్ల కొరత సాకుతో ఒక్కోటి రూ.10వేల చొప్పున ఆరింటికి రూ.60వేలు వసూలు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో 19 ప్రైవేట్​ హాస్పిటల్స్​లో కోవిడ్​ ట్రీట్​మెంట్​కు పర్మిషన్​ ఉంది. అన్నీ కలిపి 200 ఐసీయూ బెడ్స్​, 15 వరకు వెంటిలేటర్లు ఉన్నాయి. పేషెంట్ల కండీషన్​ను బట్టి ఐసీయూ, మెడిసిన్, ల్యాబ్, డాక్టర్​ చార్జీలు రోజుకు రూ.30వేల నుంచి రూ.40వేల దాకా గుంజుతున్నారు.

ఎంజీఎంకు వస్తలేరు 
వరంగల్​లోని ఎంజీఎం హాస్పిటల్​లో కోవిడ్​ పేషెంట్ల కోసం 440 బెడ్లు ఉన్నా.. అందులో చేరేవారి సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది. ఇక్కడ పేషెంట్లను సరిగ్గా పట్టించుకోరనే ప్రచారం, తిండి, సౌకర్యాల విషయంలో గతంలో చోటుచేసుకున్న ఘటనల దృష్ట్యా పేషెంట్లు ఇంట్రెస్ట్​ చూపడం లేదు. ఎంజీఎంలో 440 కోవిడ్​ బెడ్లు ఉండగా.. శనివారం వరకు 177 మంది పేషెంట్లు ఉన్నారు. 263 బెడ్లు ఖాళీగా ఉన్నాయి. అదే టైంలో ప్రైవేట్​హాస్పిటల్స్​లో బెడ్ల కోసం ఎగబడుతున్నాడు.

మహారాష్ట్ర పేషెంట్ల తాకిడి 
పొరుగున ఉన్న మహారాష్ర్టలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. అక్కడి హాస్పిటల్స్​లో బెడ్స్​ దొరక్కపోవడంతో సరిహద్దు ప్రాంతాలకు చెందిన పేషెంట్లు తెలంగాణ బాటపడుతున్నారు. నాందేడ్​ వైపు నుంచి నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్​కు.. చంద్రాపూర్, బల్లార్షా, సిరొంచా ప్రాంతాల నుంచి మంచిర్యాల, కరీంనగర్, వరంగల్​లోని హాస్పిటళ్లకు పేషెంట్లు వస్తున్నారు. అటెండెంట్లు, అంబులెన్స్​ డ్రైవర్లు, స్టాఫ్​ కనీస జాగ్రత్తలు పాటించకుండా ఎక్కడపడితే అక్కడ తిరుగుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 

వారం రోజులకు రూ.4.20 లక్షల బిల్లు
 సంగారెడ్డి టౌన్ నేషనల్ హైవేపై ఉన్న ఓ ప్రైవేట్ హాస్పిటల్​లో వికారాబాద్ జిల్లా పులిమామిడికి చెందిన 70 ఏళ్ల అవ్వ వారం కింద అడ్మిట్​అయ్యింది. రోజుకు రూ.40 వేల చొప్పున 8 రోజులకు రూ.3.2 లక్షలు, ఇతర చార్జిలు మరో రూ.లక్ష కలిపి రూ.4.20 లక్షల బిల్లు చేతిలో పెట్టారు. అడ్వాన్స్​ పోను మిగతా బ్యాలెన్స్ కడితేనే పేషెంట్​ను పంపిస్తామన్నారు. దీంతో ఆమె బంధువులు డాక్టర్లతో గొడవపడ్డారు. లీడర్ల జోక్యంతో బిల్లులో రూ.లక్ష తగ్గించారు.

చేర్చుకున్నరు.. చేతులెత్తేసిన్రు 
అందోల్ మండలం సాయిబాబాపేటకు చెందిన 65 ఏళ్ల మహిళ సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్​లో చేరింది. ఆమె భర్త (74)కూ పాజిటివ్​ రావడంతో అక్కడే చేరాడు. పెద్దా యన కండీషన్​ సీరియస్​గా మారడంతో చేతులెత్తేశారు. మూడు రోజులకు రూ.1.10 లక్షల బిల్లు వేశారు. ఇంటికి వెళ్లిన మరుసటి రోజే పెద్దాయన చనిపోయాడు. ఆయన భార్య ఆరు రోజులకు కోలుకొని ఇంటికి వచ్చేసరికి భర్త చనిపోయిన విషయం తెలిసి కన్నీరుమున్నీరైంది.