
బషీర్‌బాగ్, వెలుగు: స్టాక్ ట్రేడింగ్ పేరుతో రూ.67 లక్షలు కొట్టేసిన ఇద్దరిని సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. గుజరాత్‌కు చెందిన దేవరాజ్ బాయ్ రామాణి, గొండలియ హార్దిక్ కుమార్ ఆన్లైన్లో మోసాలు చేస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన 57 ఏండ్ల ప్రైవేట్ ఉద్యోగిని స్టాక్ ట్రేడింగ్‌లో టిప్స్ ఇస్తామని ఓ వాట్సప్ గ్రూప్ లో యాడ్ చేశారు. ఆయనను నమ్మించి రూ.67. 60 లక్షలు కాజేశారు. బాధితుడు ఇటీవల సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఇద్దరు నిందితులను శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సైబర్ క్రైమ్ డీసీపీ శివమారుతి తెలిపారు.
డైమండ్స్ పంపిస్తున్నామని నమ్మించి..
కొరియర్లో డైమండ్స్, గోల్డ్ పంపిస్తున్నట్లు నమ్మించి ఓ యువకుడిని సైబర్ చీటర్లు మోసగించారు. తొలుత ఆసిఫ్ నగర్‌కు చెందిన 27 ఏండ్ల యువకుడికి వాట్సాప్‌లో మెసేజ్ పంపారు. తాము యూకేలో ఉంటున్నామని, ఇండియన్స్‌కు గిఫ్ట్స్ పంపిస్తూ ఉంటామని నమ్మించారు.
డైమండ్స్, గోల్డ్, క్లాత్స్, డబ్బులు పార్శిల్ పంపిస్తున్నట్లు ఓ ఫొటో షేర్ చేశాడు. పార్శిల్‌ను ముంబైలో కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారని కథ అల్లారు. కస్టమ్స్ చార్జీల పేరుతో రూ.2.48 లక్షలువసూలు చేశారు. ఆ తర్వాత నంబర్ బ్లాక్ చేయడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.