
- రూ.74 చాలు.. గోల్డ్ కొనొచ్చు
- డెలివరీ కావాలంటే కనీసం ఒక గ్రాము కొనాలి
- ఆన్‌లైన్ సేల్స్‌కు ఇంపార్టెన్స్ ఇస్తున్న జ్యువెలర్లు
- ఇప్పుడు డిజిటల్ గోల్డే పాపులర్
బిజినెస్‌డెస్క్, వెలుగు: ఆన్‌లైన్‌లో గోల్డ్ కొనుగోళ్లు పెరుగుతున్నాయి. దీంతో దేశంలోని చాలా జ్యువెలర్లు రూ. 74 (ఒక డాలర్) నుంచే గోల్డ్‌ను అమ్మడం ప్రారంభిస్తున్నాయి. కరోనా సంక్షోభం వలన గోల్డ్, జ్యువెలరీ సెగ్మెంట్‌లో మార్పులు మొదలయ్యాయి. ఒకప్పుడు గోల్డ్ కాయిన్లు, జ్యువెలరీలను కొనడానికి షాపులకు మాత్రమే వెళ్లే కన్జూమర్లు, ప్రస్తుతం ఆన్‌లైన్‌లో కొనడానికి వెనకడుగు వేయడం లేదు. కిందటేడాది లాక్‌డౌన్ దెబ్బకు జువెలరీ షాపులు ఆన్‌లైన్ అవసరాన్ని గుర్తించాయి. ఆన్‌లైన్ సేల్స్‌ను పెంచుకునేందుకు వివిధ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. జ్యువెలరీ కంపెనీలు తనిష్క్, కళ్యాణ్ జ్యువెలర్స్, పీసీ జ్యువెలర్, సెన్కో గోల్డ్ అండ్ డైమండ్స్ వంటి పెద్ద కంపెనీలు సైతం రూ. 100 (1.3 డాలర్లు) నుంచే గోల్డ్‌ను అమ్ముతున్నాయి. డైరెక్ట్‌గా వాటి వెబ్‌సైట్ల ద్వారా లేదా ఇతర డిజిటల్ గోల్డ్ ప్లాట్‌ఫామ్‌లతో టై అప్ అవ్వడం ద్వారా ఈ సేల్స్ జరుపుతున్నాయి. కన్జూమర్లు ఒక గ్రాము ధరకు సరిపడ ఇన్వెస్ట్ చేశాక గోల్డ్‌ను డెలివరీ పెట్టుకోవచ్చు.
కరోనా సంక్షోభం వలన మారుతున్న పరిస్థితులు..
దేశంలో డిజిటల్ గోల్డ్ సేల్స్ కొత్తేమి కాదు. ఇప్పటికే ఆగ్‌మోంట్ గోల్డ్, వరల్డ్ గోల్డ్ కౌన్సిల్‌కు చెందిన సేఫ్‌గోల్డ్ వంటి మొబైల్ వాలెట్లు, ప్లాట్‌ఫామ్‌లు ఆన్‌లైన్‌లో గోల్డ్‌ను అమ్ముతున్నాయి. కానీ, జ్యువెలర్లు ఇప్పటి వరకు ఆన్‌లైన్ బాట పట్టడానికి వెనకడుగు వేశారు. దేశంలో గోల్డ్ సేల్స్ ఎక్కువగా రిటైల్ స్టోర్ల ద్వారానే జరుగుతున్నాయి. దీంతో ఆన్‌లైన్ వైపు ఎంటర్ అవ్వడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. కానీ, గత ఏడాది కాలం నుంచి ఈ పరిస్థితుల్లో మార్పులొస్తున్నాయి. సొంత వెబ్‌సైట్ల ద్వారా లేదా ఇతర డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లతో టై అప్ అయ్యి గోల్డ్‌ను అమ్ముతున్నాయి. ‘కరోనా వలన చాలా జ్యువెలరీ కంపెనీల ఆలోచనల్లో మార్పొచ్చింది. ఆన్‌లైన్‌లో జ్యువెలరీని అమ్మడంపై పాజిటివ్‌గా ఉన్నాయి. ఇది మొత్తం ఇండస్ట్రీ మైండ్‌సెట్ మారిందనడానికి నిదర్శనం’ అని ఆగ్‌మోంట్ గోల్డ్ డైరెక్టర్ కేతన్ కొఠారీ అన్నారు. ఆగ్‌మోంట్ సుమారు 4 వేల జ్యువెలర్లతో పార్టనర్‌షిప్ కుదుర్చుకుంది.
ఆన్‌లైన్ గోల్డ్ సేల్స్‌కు యంగర్ జనరేషన్ దన్ను
గోల్డ్ కొనుగోళ్లు పండగ సీజన్‌లో ఎక్కువగా ఉంటాయి. దీంతో కొత్త కొత్త ఆఫర్లను జ్యువెలర్లు లాంచ్ చేస్తున్నారు. డిజిటల్ గోల్డ్ కొనుగోళ్లు దేశంలో పెరుగుతున్నాయి. ముఖ్యంగా యంగర్ జనరేషన్ ఆన్‌లైన్‌లో గోల్డ్‌ను కొనడానికి భయపడడం లేదు. గోల్డ్, జ్యువెలరీ సెక్టార్‌ను యంగర్ జనరేషన్ ముందుకు నడిపిస్తుందని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి కూడా. ‘డిజిటల్‌గా గోల్డ్ కొనడంపై కన్జూమర్లలో ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా యంగర్ జనరేషన్ గోల్డ్‌లో కొద్ది కొద్దిగా ఇన్వెస్ట్ (సిప్) చేయడంపై ఆసక్తి చూపిస్తోంది’ అని కళ్యాణ్ జ్యువెలర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమేష్ కళ్యాణరామన్ అన్నారు. వెబ్‌సైట్ల ద్వారా జరుగుతున్న గోల్డ్ కొనుగోళ్లలో 2 శాతం వాటా నగలది ఉందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ కిందటేడాది ఓ రిపోర్ట్‌లో పేర్కొన్న విషయం తెలిసిందే. వీటిలో మెజార్టీ ట్రాన్సాక్షన్లు 45 ఏళ్ల లోపు ఉన్నవారే జరిపారని పేర్కొంది. గోల్డ్ ధరలు పడుతుండడంతో కూడా ఆన్‌లైన్‌లో గోల్డ్ సేల్స్ పెరగడానికి కారణమవుతోందని సేఫ్‌గోల్డ్ ఫౌండర్ గౌరవ్ మథుర్ అన్నారు. ‘ప్రస్తుతం గోల్డ్ ధరలు తక్కువగా ఉన్నాయని ప్రజలు భావిస్తున్నారు. కేవలం గోల్డ్ అనే కాకుండా ఇతర కేటగిరీలలో (సిల్వర్, ప్లాటినమ్ వంటివి) కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్లు జరుపుతున్నారు’ అని ఆయన పేర్కొన్నారు. ‘కిందటేడాది ఫిబ్రవరి నుంచి గమనిస్తే మా ప్లాట్‌ఫామ్ ద్వారా జరిగే సేల్స్ 200 శాతం పెరిగాయి. రూ. 3–4 వేల మధ్యలో ఉండే గోల్డ్ కాయిన్స్, బార్లను కొనేందుకు కన్జూమర్లు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు’ అని కొఠారీ అన్నారు. కరోనా సంక్షోభ టైమ్‌లో డిజిటల్‌గా గోల్డ్ కొనుగోళ్లు పాపులరయ్యాయని, కిందటేడాది ఫెస్టివ్ సీజన్‌తో పోలిస్తే ఈసారి డిజిటల్‌గా గోల్డ్ అమ్మకాలు 20–30 శాతం పెరుగుతాయని ఆయన అంచనావేశారు.
గోల్డ్ కోసం సపరేట్‌గా ఎక్స్చేంజే!
కేవలం గోల్డ్ మాత్రమే ట్రేడయ్యేందుకు త్వరలో గోల్డ్ ఎక్స్చేంజ్ రాబోతోంది. గోల్డ్ ఎక్స్చేంజికి సంబంధించిన ఫ్రేమ్‌వర్క్‌కు సెబీ ఆమోదం తెలిపింది. ఈ ఎక్స్చేంజ్‌లో ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్ (ఈజీఆర్) విధానంలో గోల్డ్ ట్రేడవుతుంది. ఈ ఎక్స్చేంజి వలన దేశం మొత్తం మీద గోల్డ్ స్పాట్ రేటు ఒకేలా ఉంటుంది. దీంతోపాటు మ్యూచువల్ ఫండ్‌లు గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) లానే సిల్వర్ ఈటీఎఫ్‌లను కూడా ఆఫర్ చేసేందుకు సెబీ అనుమతిచ్చింది. సిల్వర్ ఈటీఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇన్వెస్టర్ పెట్టిన డబ్బులకు తగ్గ సిల్వర్‌ను మ్యూచువల్ ఫండ్‌లు కొని పక్కన పెడతాయి. సెబీ చైర్మన్ అజయ్ త్యాగి నేతృత్వంలో జరిగిన బోర్డు మీటింగ్‌లో ఈ నిర్ణయాలు తీసుకున్నారు.
సోషల్ ఎక్స్చేంజిలు కూడా..
సొసైటీ బాగు కోసం పనిచేసే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్లు, ఫ్రాఫిట్ కోసం చూసే ఆర్గనైజేషన్‌ల షేర్లు ట్రేడయ్యేందుకు సపరేట్‌గా సోషల్ ఎక్స్చేంజ్‌ను ఏర్పాటు చేసేందుకు సెబీ అనుమతిచ్చింది. సోషల్ ఎంటర్‌ప్రెనూర్లు ఫండ్ రైజ్ చేసుకోవడానికి ఈ ఎక్స్చేంజిలు సాయపడతాయి. సోషల్ స్టాక్ ఎక్స్చేంజిలకు సంబంధించి టైమ్‌లైన్‌ను ప్రకటించలేదు. ఈ విషయంలో ప్రభుత్వంతో కలిసి ముందుకెళ్తున్నామని సెబీ చైర్మన్ అజయ్ త్యాగి పేర్కొన్నారు.