
- మొయినాబాద్ సమీపంలో పట్టుకున్న పోలీసులు, ఎలక్షన్స్క్వాడ్
చేవెళ్ల, వెలుగు: రాష్ట్రంలో పోలింగ్ గడువు సమీపిస్తున్న కొద్ది భారీగా నగదు పట్టుబడుతున్నది. శనివారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం హిమయత్ సాగర్ సమీపంలో రూ.7.40 కోట్ల నగదు పట్టుబడడం సంచలనం సృష్టించింది. అజీజ్‌నగర్ గ్రామ పరిధిలోని ఓ ప్రైవేట్ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ ఇంటి నుంచి కార్లలో డబ్బులు తరలిస్తున్నట్లు పోలీసులు, ఎలక్షన్ ఫ్లయింగ్స్క్వాడ్కు పక్కా సమాచారం అందడంతో.. అధికారులు అక్కడికి బయల్దేరారు. వీరు వెళ్లే సరికి స్కూల్ చైర్మన్ ఇంటికి సమీపంలో ఉన్న మట్టి రోడ్డులో వెళ్తున్న ఏపీ 39 ఏఎం 4442, టీఎస్ 09 జీబీ5841, టీఎస్ 02 ఎఫ్ఈ 8332, టీఎస్07 జేకే 6488, టీఎస్36 కే 3030, టీఎస్ ఈడబ్ల్యూ 3747 నంబర్లు గల ఆరు కార్లను గుర్తించారు.
వెంటనే వెళ్లి ఆరు వాహనాలను అడ్డుకొని ఆపేశారు. వాటిని తనిఖీ చేయగా భారీగా నగదు ఉన్న సూట్‌కేసులు దొరికాయి. మొత్తం రూ.7కోట్ల 40 లక్షల నగదు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వెంటనే ఐటీ ఆఫీసర్లకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి విచారిస్తున్నారు. తర్వాత రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తనిఖీల్లో పట్టుబడిన డబ్బులు ఎవరివి, ఎక్కడికి వెళ్తున్నాయనేది ఐటీ అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారని త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తారని తెలిపారు. ఆరుగురు డ్రైవర్లతో పాటుగా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు..