ఆర్వోబీ, రోడ్డు బ్రిడ్జికి మోక్షం..కేంద్రం నుంచి రూ.75 కోట్లు మంజూరు

ఆర్వోబీ, రోడ్డు బ్రిడ్జికి మోక్షం..కేంద్రం నుంచి రూ.75 కోట్లు మంజూరు


చేగుంట -మెదక్ రూట్ లో తీరనున్న రైల్వే గేటు తిప్పలు
వడ్యారం బైపాస్ సర్కిల్ వద్ద ప్రమాదాలకు చెక్
 
మెదక్, వెలుగు: కేంద్రం నుంచి నిధులు మంజూరు కావడంతో హైదరాబాద్ -మెదక్ రూట్ లో ప్రయాణికుల తిప్పలు తప్పనున్నాయి. చేగుంట పోలీస్ స్టేషన్ సమీపంలో రైల్వే క్రాసింగ్ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణానికి రూ.45 కోట్లు, చేగుంట మండల పరిధిలోని వడ్యారం బైపాస్ సర్కిల్ వద్ద బ్రిడ్జి నిర్మాణానికి రూ.30 కోట్లు మంజూరయ్యాయి. 

రైల్వే గేటు పడి ఇబ్బందులు

మెదక్ -హైదరాబాద్ రూట్​లో చేగుంట వద్ద రైల్వే క్రాసింగ్ ఉంది. సికింద్రాబాద్ ముత్కేడ్ రైల్వే రూట్​లో ప్రతిరోజు ఎక్స్ ప్రెస్, ప్యాసింజర్, గూడ్స్  రైళ్లు 40 వరకు నడుస్తాయి. రైలు వచ్చినపుడల్లా రోడ్డు  క్రాసింగ్ వద్ద గేట్ పడుతుండడంతో వెహికల్స్ రాకపోకలు నిలిచిపోయి వాహనదారులు, ప్రయాణికులు  ఇబ్బందులు పడుతున్నారు. రాత్రింబవళ్లు వెహికల్స్ తో రద్దీగా ఉండే రూట్ కావడంతో గేట్ పడినప్పుడల్లా 10 నిమిషాలకు పైగా ట్రాఫిక్ జామ్ అవుతోంది.

 మెదక్ నుంచి హైదరాబాద్ వెళ్లే వారిలో ఎక్కువ శాతం మంది చేగుంట మీదుగానే హైదరాబాద్​కు రాకపోకలు సాగిస్తుంటారు.  సాధారణ ప్రజలతోపాటు, మెదక్  కలెక్టరేట్ లోని వివిధ గవర్నమెంట్ ఆఫీసుల్లో పనిచేసే ఎంప్లాయీస్, స్కూళ్లలో పనిచేసే టీచర్లు, స్టూడెంట్స్​, వ్యాపారులు ఇదే మార్గంలో వచ్చిపోతుంటారు. మెదక్ ఆర్టీసీ డిపో నుంచి హైదరాబాద్, సికింద్రాబాద్ కు నడిచే బస్సులు ఇదే రూట్​లో నడుస్తుంటాయి. చిన్నశంకరంపేట మండలంలోని వివిధ కంపెనీలకు ముడిసరుకు తీసుకురావడంతో పాటు ఇక్కడ తయారయ్యే ప్రొడక్ట్స్ ను వివిధ ప్రాంతాలకు తరలించే భారీ వెహికల్స్ ఇదే రూట్​లో వెళ్తాయి. 

దీంతో తరచూ రైల్వే క్రాసింగ్ వద్ద గేట్ పడుతుండటంతో ట్రాఫిక్ జామ్ అయి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో చేగుంట రైల్వే క్రాసింగ్ వద్ద ఆర్వోబీ నిర్మించాలని డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. సమస్యను గుర్తించిన ఎంపీ రఘునందన్ రావు చొరవ తీసుకోవడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్వోబీ నిర్మాణానికి రూ.45 కోట్లు మంజూరయ్యాయి. త్వరలో టెండర్ ప్రక్రియ ప్రారంభం కానుంది. వీలైనంత త్వరగా ఆర్వోబీ నిర్మాణం పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటానని ఎంపీ తెలిపారు. 

బైపాస్ సర్కిల్ లో ప్రమాదాలు

నేషనల్ హైవే 44 నుంచి మెదక్ వచ్చే రూట్​లో చేగుంట మండలం వడ్యారం బైపాస్ సర్కిల్ వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. మెదక్ వైపు నుంచి హైదరాబాద్ వెళ్లే క్రమంలో కార్లు, బైక్ లు, తదితర వెహికల్స్ సర్కిల్ వద్ద హైవే క్రాస్ చేసే సమయంలో హైదరాబాద్ -నిజామాబాద్ రూట్​లో రాకపోకలు సాగించే భారీ వెహికిల్స్  స్పీడ్ గా రావడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ సర్కిల్ వద్ద ఏటా పదుల సంఖ్యలో  ప్రాణాలు కోల్పోతున్నారు.

 ఎంతో మంది గాయాలపాలవుతున్నారు. ఈ క్రమంలో ప్రమాదాల నివారణకు ఇక్కడ బ్రిడ్జి నిర్మించాల్సిన అవసరం ఏర్పడింది. ఇదే రూట్​లో తూప్రాన్ మండలం నాగులపల్లి, చేగుంట మండలం రెడ్డి పల్లి, నార్సింగి మండలం జప్తి శివనూర్ వద్ద బ్రిడ్జిలు మంజూరయ్యాయి. ఎంపీ రఘునందన్ రావు కృషితో వడ్యారం వద్ద బ్రిడ్జి నిర్మాణానికి ఇప్పుడు రూ.30 కోట్లు మంజూరయ్యాయి. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే రోడ్డు ప్రమాదాలకు చెక్ పడనుంది.