బహుజన ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కేసీఆర్ కుట్ర : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

బహుజన ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కేసీఆర్ కుట్ర :  ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

బహుజన ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని బీఎస్పీ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ప్రగతిభవన్ ను బహుజనుల పరం చేయడమే బీఎస్పీ పార్టీ లక్ష్యమన్నారు. తెలంగాణలో బహుజన ఉద్యమాన్ని నీరుగార్చేందుకే కల్వకుంట్ల కుటుంబం.. ఉత్తర భారతదేశం నుంచి కొంతమందిని రాష్ట్రానికి అరువు తెచ్చుకుంటోందని ఆరోపించారు. 99 శాతం జనాభా ఉన్న తమకు సంపదలోనూ 99 శాతం వాటా కావాలని డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలోని సాయి శివ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన మహిళా రాజకీయ చైతన్య సదస్సులో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ కామెంట్స్ చేశారు. 

తెలంగాణ వ్యాప్తంగా 29 రోజులుగా పారిశుధ్య కార్మికులు సమ్మె చేస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి రాకుండానే కేసీఆర్ నెలకు రూ.3 లక్షల 36 వేల జీతం తీసుకుంటున్నారని చెప్పారు. కేసీఆర్ నిత్యం ప్రతిపక్షాల గొంతు నొక్కడం, ప్రతిపక్ష పార్టీల్లో చీలికలు తేవడం కోసమే అహర్నిశలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

భారీ వర్షాలకు మునిగిపోయిన లోతట్టు ప్రాంతాల్లో కేసీఆర్ పర్యటించకపోవడం శోచనీయమన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ప్రజాధనంతో ముఖ్యమంత్రి తన ఫామ్ హౌస్ లకు అద్దాల్లాంటి రోడ్లు వేసుకుంటున్నారని ఆరోపించారు. నీళ్లు, నిధులు, నియామాకాల పేరుతో ప్రజలను మభ్యపెట్టి..దళితులకు మూడెకరాల పేరుతో మోసం చేశారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీఎస్పీ అధికారంలోకి వచ్చిన వెంటనే భూమిలేని ప్రతి నిరుపేద కుటుంబానికి ఒక ఎకరం భూమి పంచుతామన్నారు. బెల్ట్ షాపులను పూర్తిగా రద్దు చేసి, పాల షాపులు ఏర్పాటు చేస్తామన్నారు.