ఆచరణ సాధ్యం కాని హామీలిస్తున్నరు: ప్రవీణ్ కుమార్

ఆచరణ సాధ్యం కాని హామీలిస్తున్నరు:  ప్రవీణ్ కుమార్

మిర్యాలగూడ, వెలుగు : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో..లిక్కర్, డబ్బు పంపిణీ జరగకుండా ఎన్నికల కమిషన్​చర్యలు చేపట్టాలని బీఎస్పీ స్టేట్ ప్రెసిడెంట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోరారు. మంగళవారం మిర్యాలగూడలో ఆయన మీడియాతో మాట్లాడారు. మునుగోడు ఉప ఎన్నికల్లో లిక్కర్, డబ్బు పంపిణీ బహిరంగంగా సాగినా నియంత్రించడంలో ఎన్నికల సంఘం విఫలమైందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఅర్ఎస్, బీజేపే, కాంగ్రెస్ పార్టీలు ఆచరణ సాధ్యం కాని అబద్ధపు హామీలను ఇస్తున్నాయన్నారు

 బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసిన గ్రామాలకు అత్యధిక ఫండ్స్ కేటాయించాలని పంచాయతీ రాజ్ మినిస్టర్ ఎర్రబెల్లి దయాకర్ రావు కలెక్టర్లకు ఆదేశాలివ్వడంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. సూర్యాపేట,ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీలు అధికార పార్టీ చేతిలో కీలుబొమ్మలుగా మారారని ఆరోపించారు. ప్రతిపక్ష లీడర్లపై అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తున్నారని, దీనిపై కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు  చెప్పారు. 

యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కోసం వేల ఎకరాల భూమిని తీసుకున్న ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం చెల్లించడంలో, పవర్ ప్లాంట్ పూర్తి చేయడంలో విఫలమైందన్నారు. నల్లగొండ జిల్లా మార్కెటింగ్​సొసైటీ చైర్మన్(డీసీఎంఎస్) వట్టే జానయ్యపై అక్రమ కేసులు పెట్టించడం వెనుక మంత్రి జగదీశ్ రెడ్డి హస్తం ఉన్నట్లు ఆరోపించారు. మిర్యాలగూడ అపోలో దవాఖానలో ట్రీట్ మెంట్ పొందుతున్న నాగార్జున సాగర్ బీఎస్పీ ఇన్​చార్జి ఆదిమల్ల వెంకటేశ్వర్లును పరామర్శించారు. వెంట బీఎస్పీ స్టేట్ లీడర్ జాడి రాజు ఉన్నారు.