మహిళా రిజర్వేషన్లు 50 శాతానికి పెంచాలె: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్​

మహిళా రిజర్వేషన్లు 50 శాతానికి పెంచాలె: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్​

హైదరాబాద్, వెలుగు :  చట్టసభల్లో మహిళలకు కల్పిం చే 33 శాతం రిజర్వేషన్లలో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని బీఎస్పీ స్టేట్​చీఫ్​ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మంగళవారం లక్డీకాపూల్​లోని పార్టీ స్టేట్​ఆఫీసులో రిటైర్డ్​ ఐఏఎస్ ఆకునూరి మురళితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రం తెచ్చిన మహిళా బిల్లును స్వాగతిస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో లబ్ధిపొందడం కోసమే బీజేపీ మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టిందన్నారు. చట్టసభల్లో మహిళా కోటాను జనాభా ప్రాతిపదికన 50 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. 

ఈడీ కేసు లను తప్పించుకోవడం కోసమే కవిత మహిళా బిల్లు కోసం ధర్నా చేసిందన్నారు. కవితకు చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ పార్టీలో మహిళకు రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారెంటీల అమలు ఆచరణలో సాధ్యం కావని విమర్శించారు. ఆ పార్టీ ఇచ్చిన మోసపూరిత వాగ్దానాలను నమ్మి ప్రజలు మోసపోవద్దని హెచ్చరించారు. టీచర్ల రిక్రూట్​మెంట్ రాత పరీక్షలను ఆరు నెలలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అన్ని వర్సిటీల్లో పనిచేస్తున్న పార్ట్‌‌‌‌టైమ్‌‌‌‌ అధ్యాపకులను క్రమబద్ధీకరించాలని సీఎంకు బహిరంగ లేఖ రాసినట్లు తెలిపారు. 

ఎస్డీఎఫ్​ తీర్మానాలను పాలసీలుగా మార్చండి: మురళి 

రాష్ట్రంలో విద్యా, వైద్యం, వ్యవసాయ రంగాలను సీఎం కేసీఆర్ పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని మాజీ ఐఏఎస్ అధికారి, సోషల్ డెమోక్రటిక్ ఫోరం (ఎస్డీఎఫ్) కన్వీనర్‌‌‌‌ ఆకునూరి మురళి అన్నారు. ఎస్డీఎఫ్ చేసిన తీర్మానాలను పాలసీలుగా మార్చి అమలు చేయాలని కోరారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ కమిషన్ నియమించాలన్నారు.