మేం అధికారంలోకి వస్తే ఏటా జాబ్ క్యాలెండర్ : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

మేం అధికారంలోకి వస్తే ఏటా జాబ్ క్యాలెండర్ : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
  • మేం అధికారంలోకి వస్తే..ఏటా జాబ్ క్యాలెండర్
  • రూ.25 వేల కోట్లతో ప్రజా ఆరోగ్య బడ్జెట్: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
  • బీఎస్పీ మేనిఫెస్టో విడుదల

హైదరాబాద్, వెలుగు : బీఎస్పీ అధికారంలోకి వచ్చిన వెంటనే ‘శ్రీకాంతాచారి ఉద్యోగ హామీ’ ద్వారా ఏటా టీఎస్​పీఎస్సీ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. పేపర్ లీకేజీ కాకుండా చర్యలు తీసుకుని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని వెల్లడించారు. కాన్షీరాం యువ సర్కార్ పేరుతో యువతను షాడో మంత్రులుగా నియమిస్తామన్నారు. 

సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మంగళవారం బీఎస్పీ ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాలను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాకు వివరించారు. రాష్ట్రంలో లిక్కర్ అమ్మకాలు నియంత్రిస్తామన్నారు. ఏటా రూ.25,000 కోట్లతో ప్రజా ఆరోగ్య బడ్జెట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో డ్రగ్స్ అమ్మకాలు అరికడతామని, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 60 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కేటాయిస్తామని వివరించారు. మెదక్ జిల్లాకు ప్రజా గాయకుడు గద్దర్ పేరు పెట్టి ఆయన స్మారకంగా గద్దర్ ఫ్రీడమ్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. - జనాభాలో 99% ఉన్న పేదలకు రాజ్యాధికారం దక్కాలన్నదే బీఎస్పీ లక్ష్యమన్నారు. ఆత్మహత్య చేసుకున్న ప్రవళిక ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. 

మేనిఫెస్టోలోని అంశాలు..

* అత్యాధునిక మౌలిక సదుపాయాలతో ప్రతి జిల్లాలో అబ్దుల్ కలాం ఇన్నోవేషన్ బిజినెస్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. 

* యువ వ్యాపారులకు వడ్డీలేని రుణాలు, రాయితీలు కల్పిస్తామన్నారు. 

* హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ లోని స్టూడెంట్స్​కు బూట్లు, స్మార్ట్ వాచ్​లు ఇస్తామని ప్రకటించారు. 

* పూర్ణ-, ఆనంద్ క్రీడా స్ఫూర్తితో ప్రతి జిల్లాలో అంతర్జాతీయ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తామన్నారు. 
    
* స్పోర్ట్స్​లో రాణించే స్టూడెంట్స్​కు నెలకు రూ.15,000 స్కాలర్​షిప్, క్రీడా పరికరాలు, పోషక ఆహారం అందజేస్తామని ప్రకటించారు.
    
* కాంట్రాక్టు ఆశా, అంగన్ వాడీ, పారిశుధ్య కార్మికులను క్రమబద్ధీకరిస్తామన్నారు.
    
* సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేక విధానాలు రూపొందిస్తామన్నారు.
    
* చాకలి ఐలమ్మ డిగ్నిటీ స్కీమ్ కింద శ్రామిక మహిళల ప్రజా రవాణాపై 50% రాయితీ కల్పిస్తామన్నారు.
    
* పారిశుధ్య కార్మికులకు కనీస వేతనాలు పెంచి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామన్నారు. 
    
* వరి పంటకు రూ.3,000 మద్దతు ధర ప్రకటించి, రూ.2 లక్షల దాకా రైతులకు వడ్డీ లేని రుణాలను అందజేస్తామని వివరించారు.
    
* రాష్ట్రంలోని ప్రతి రైతుకూ గ్రీన్ కార్డు అందజేస్తామన్నారు. 
    
* ఎకరాకు రూ.10వేల ఆర్థిక సాయం, రైతు ఇంటి వద్దకు ఫ్రీగా విత్తనాలు, ఎరువులు అందజేస్తామన్నారు.
    
* మండలానికో కోల్డ్ స్టోరేజ్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామన్నారు.