ఆసిఫాబాద్ ఎస్పీని బదిలీ చేయండి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

ఆసిఫాబాద్ ఎస్పీని బదిలీ చేయండి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
  • ఆసిఫాబాద్ ఎస్పీని బదిలీ చేయండి
  • కేంద్ర ఎన్నికల సంఘానికి 
  • ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు
  • ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణ

హైదరాబాద్, వెలుగు : బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ సురేశ్​ కుమార్​ను వెంటనే బదిలీ చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి గురువారం ఫిర్యాదు చేశారు. అనంతరం హైదారాబాద్​లో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి వికాస్ రాజ్​తోనూ ఆయన భేటీ అయ్యారు. సురేశ్​ కుమార్ స్థానిక ఎమ్మెల్యే కోనేరు కొనప్పకు అనుకూలంగా వ్యవహరించిన తీరును, ఎన్నికల రూల్స్ ను దుర్వినియోగం చేస్తున్న తీరును ఎన్నికల అధికారులకు వివరించామని మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. అన్ని అంశాలను పరిశీలిస్తామని వికాస్​రాజ్  హామీ ఇచ్చారని చెప్పారు. 

నిబంధనలను తుంగలో తొక్కి ఎమ్మెల్యేకు చెందిన కోనప్ప ట్రస్ట్​కు జిల్లా ఎస్పీ వెళ్లి ప్రజల ముందు ఎమ్మెల్యేను సన్మానించి అక్కడ ఫోటోలు దిగారని, దానికి సంబంధించిన కాపీలను సీఈసీకి అందజేశానని తెలిపారు. కోనప్ప కుటుంబం అనేక చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటున్నప్పటికీ, వాటిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసులు పెట్టట్లేదని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. బీఎస్పీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న ఢిల్లీ యూనివర్శిటీకి చెందిన ముగ్గురు అమాయక విద్యార్థి వలంటీర్లను ఎమ్మెల్యే అనుచరులు కిడ్నాప్ చేసి కొట్టినా కాగజ్‌‌‌‌‌‌‌‌నగర్ పోలీసులు కేసు పెట్టేందుకు వెనకాడారని, ఐపీఎస్ అధికారులతో మాట్లాడితే తప్ప ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని అన్నారు.