గురుకుల నియామకాల్లో రీలింక్విష్‌‌మెంట్ పాటించండి: ఆర్‌‌‌‌ఎస్‌‌ ప్రవీణ్ కుమార్

గురుకుల నియామకాల్లో రీలింక్విష్‌‌మెంట్ పాటించండి:  ఆర్‌‌‌‌ఎస్‌‌ ప్రవీణ్ కుమార్

హైదరాబాద్, వెలుగు:  తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామక మండలి (టీఆర్‌‌‌‌ఈఐ ఆర్‌‌‌‌బీ) ఉద్యోగ నియామకాల్లో రీలింక్విష్‌‌మెంట్‌‌ విధానం పాటించి.. అవరోహణ క్రమంలో ఉద్యోగాలు భర్తీ చేయాలని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌‌‌‌ఎస్ ప్రవీణ్ కుమార్ కోరారు. ఈ మేరకు ‘ఎక్స్‌‌’వేదికగా సీఎం రేవంత్ రెడ్డికి శనివారం లేఖ రాశారు. ‘‘గురుకుల రిక్రూట్‌‌మెంట్ బోర్డు నియామకాలు కొందరికి మోదం, మరికొందరికి ఖేదం మిగిలిస్తున్నాయి. గతేడాది గురుకుల బోర్డు డిగ్రీ లెక్చరర్, లెక్చరర్, పీజీటీ, టీజీటీ లాంటి అనేక ఉద్యోగ నియామకాలకు వరుస నోటిఫికేషన్లు జారీ చేసింది. అర్హత ఉన్న వేల మంది నిరుద్యోగులు అన్ని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొని, పరీక్షలు రాశారు.

 అయితే, బోర్డు వెల్లడించిన అన్ని ఫలితాల్లో ఒకే అభ్యర్థి, ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఒకే అభ్యర్థి వివిధ ఉద్యోగాలకు ఎంపిక కావడం వల్ల, ఎక్కువ ఉద్యోగాలు సాధించిన వ్యక్తి ఏదో ఒక ఉద్యోగాన్ని ఎంచుకొని మిగతా వాటిని వదిలేయడం జరుగుతుంది. దీంతో ఆ అభ్యర్థి వదిలి వెళ్లిన ఉద్యోగాలు ఖాళీగా ఉండిపోవడంతో తర్వాత మెరిట్ లిస్టులో ఉన్న అభ్యర్థులకు తీరని నష్టం జరుగుతుంది. ఈ క్రమంలో బోర్డు వెంటనే జనరల్ ర్యాంకింగ్ ప్రకటించి అవరోహణ క్రమంలో ఉద్యోగాలు భర్తీ చేయాలి”అని కోరారు. ఉద్యోగాలు ఖాళీగా మిగలకుండా ఉండాలంటే అభ్యర్థులు సాధించిన మెరిట్ ఆధారంగా రెండో జాబితా విడుదల చేసి ఖాళీలు లేకుండా భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 

ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తెండి: సీఎం రేవంత్

గురుకుల టీచర్ల రిక్రూట్‌‌మెంట్‌‌కు సంబంధించి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌‌‌‌ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన ట్వీట్‌‌పై సీఎం రేవంత్‌‌ రెడ్డి స్పందించారు. ప్రవీణ్ కుమార్ ఇచ్చిన సూచనలను పరిశీలించి, సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశిస్తామని సీఎం తెలిపారు. గురుకుల టీచర్ల రిక్రూట్మెంట్‌‌కు సంబంధించి ఆర్‌‌‌‌ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన ట్వీట్‌‌కు సీఎం రేవంత్‌‌ మరో ట్వీట్‌‌తో రిప్లై ఇచ్చారు. ‘‘మన తెలంగాణ యువతకు సంబంధించిన సమస్యని ప్రజా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే మీ ప్రయత్నానికి నా ధన్యవాదాలు. గడిచిన పదేండ్లలో తెలంగాణ యువత ఎంత దగా పడిందో, వారి భవిష్యత్‌‌ మీద గత ప్రభుత్వం ఏ విధంగా కోలుకోలేని దెబ్బతీసిందో మనందరం చూశాం. 

ఆ దశాబ్దకాల విషాదాన్ని త్వరగా అధిగమించాలని, ఎలాంటి పొరపాట్లు లేకుండా మన యువత భవితను పునర్నిర్మించాలనే సంకల్పంతో మా ప్రభుత్వం పని చేస్తున్నది. పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా తెలంగాణ పునర్నిర్మాణానికి ఎవరు కలిసొచ్చినా వారి విలువైన సూచనలు, సహకారం తీసుకోవడానికి, వారితో కలిసి పనిచేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. మా ప్రయత్నం.. మా తాపత్రయం అంతా.. తెలంగాణ ప్రజల మంచి కోసమే తప్ప.. గుర్తింపు కోసం కాదు. మీరు మున్ముందు కూడా ప్రజా సమస్యలేమైనా సరే మా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కోరుకుంటున్నాను’’అని ఎక్స్‌‌లో సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.