బీఆర్ఎస్ తో బీఎస్పీ కటీఫ్.. గులాబీ పార్టీలోకి RSP

బీఆర్ఎస్ తో బీఎస్పీ కటీఫ్.. గులాబీ పార్టీలోకి RSP

హైదరాబాద్‌: బీఎస్పీకి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ గుడ్​బై చెప్పారు. ఈ మేర‌కు ఆయన అధికారికంగా ట్వీట్ చేశారు. భారమైన హృద‌యంతో బీఎస్పీని వీడాల‌ని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. కొత్త మార్గంలో ప్రయాణించాల్సిన సమయం వచ్చిందని, పార్టీని వీడటం తప్ప మరో  చాన్స్​ లేకుండాపోయిందన్నారు. బహుజన సమాజం తనను ద‌య‌చేసి క్షమించాలని కోరారు.

‘పొత్తు (బీఆర్ఎస్–​-బీఎస్పీ) పొత్తులో భాగంగా ఎన్ని ఒడుదొడుకులు వచ్చినా ముందుకు సాగాల్సిందే. ఇదే నేను నమ్మిన నిజమైన ధర్మం. మా పొత్తు గురించి వార్త బయటకు వచ్చిన వెంటనే బీజేపీ దాన్ని భగ్నం చేయాలని విశ్వప్రయత్నాలు (కవిత అరెస్టుతో సహా) చేస్తోంది. ఈ కుట్రలకు భయపడి నేను నమ్ముకున్న విలువలకు తిలోదకాలు ఇవ్వలేను. నా ప్రస్థానాన్ని ఆపలేను. చివరి వరకు బహుజనవాదాన్ని నా గుండెల్లో పదిలంగా దాచుకుంటా’ అని ప్రవీణ్‌ కుమార్‌ ట్వీట్​చేశారు.

కేసీఆర్‌తో ప్రవీణ్‌ కుమార్‌ భేటీ..

బీఎస్పీకి రాజీనామా చేసిన తర్వాత ఆర్‌.ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌.. బీఆర్ఎస్​చీఫ్​ కేసీఆర్‌తో భేటీ అయ్యారు. హైదరాబాద్ నందినగర్​లోని ఆయన ఇంటికి వెళ్లి సమావేశమయ్యారు. ప్రవీణ్ కుమార్  ఎల్లుండి బీఆర్ఎస్ లో చేరనున్నట్లు తెలుస్తోంది. నాగర్ కర్నూల్ స్థానాన్ని ఆయనకు ఇచ్చేందుకు కేసీఆర్ ఆమోదం తెలిపినట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.