ప్రజాధనం దోచి సీఎం కేసీఆర్ ఫాంహౌస్​లు కట్టుకున్నడు

ప్రజాధనం దోచి సీఎం కేసీఆర్ ఫాంహౌస్​లు కట్టుకున్నడు
  • లిక్కర్ అమ్మకాలపైనే సీఎంకు శ్రద్ధ: ఆర్ఎస్ ప్రవీణ్ ​కుమార్
  • యువతను మద్యానికి బానిసలుగా చేశాడని ఫైర్
  • బంగారు తెలంగాణ కోసం కవులు, కళాకారులు ముందుకు రావాలని పిలుపు

జోగిపేట, వెలుగు : వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని  దోచుకొని సీఎం కేసీఆర్  వందల ఎకరాల్లో ఫాం హౌస్ లు కట్టుకున్నారని బీఎస్పీ స్టేట్  చీఫ్  ఆర్ఎస్  ప్రవీణ్​ కుమార్​ అన్నారు.  మద్యం అమ్మకాలపైనే సీఎంకు శ్రద్ధ ఉందని ఆయన మండిపడ్డారు. శుక్రవారం  సంగారెడ్డి జిల్లా జోగిపేటలో నిర్వహించిన ‘శక్తి ప్రదర్శన’ సమావేశంలో ఆర్ఎస్  మాట్లాడారు. 

రాష్ట్రంలో విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. యువతను మద్యానికి బానిసలుగా మార్చారని కేసీఆర్ పై ఆయన మండిపడ్డారు. డ్రగ్స్ మత్తులో మర్డర్ల సంఖ్య  విపరీతంగా పెరిగిందన్నారు. మద్యం అమ్మకాలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ మత్తు పదార్థాలను కంట్రోల్ చేయడంలో లేదని విమర్శించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో సాగునీరు అందక వేల మంది వలసలు వెళ్తున్నారని అన్నారు. గోదావరి జలాలను తన ఫాంహౌస్ కు మళ్లించుకునేందుకే కేసీఆర్  కొండపోచమ్మ ప్రాజెక్టు నిర్మించుకున్నారని, నారాయణఖేడ్, ఆందోల్, జహీరాబాద్, సంగారెడ్డి ప్రాంతాలకు సాగునీరు అందించే బసవేశ్వర, సంగమేశ్వర పూర్తిచేయలేదని వ్యాఖ్యానించారు. 

కవులు, కళాకారులు బంగారు తెలంగాణ కోసం ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఆందోల్ నియోజవర్గంలో కనీసం రోడ్లు, విద్య, వైద్య సదుపాయాలు కూడా సక్రమంగా లేవని విమర్శించారు. సభలో పార్టీ నియోజకవర్గ ఇన్​చార్జి ముప్పారం ప్రకాశం, జిల్లా అధ్యక్షుడు నటరాజ్ తదితరులు పాల్గొన్నారు. కాగా, లోక్‌సభలో బీఎస్పీ ఎంపీ డానిష్  అలీని ముల్లా టెర్రరిస్ట్  అంటూ బీజేపీ ఎంపీ రమేశ్  బిధూరీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని ఆర్ఎస్  తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్  చేశారు. పార్లమెంటులో తమ పార్టీకి చెందిన ఎంపీపై బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు, వాడిన భాష ఒక వర్గాన్ని కించపర్చేలా ఉందని ఆయన విమర్శించారు. తక్షణమే రమేశ్  బిధూరీని లోక్‌సభ నుంచి సస్పెండ్  చేయాలని ఆర్ఎస్  డిమాండ్ చేశారు.