బహుజన రాజ్యం వస్తేనే సిర్పూర్ నియోజకవర్గం అభివృద్ధి : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 

బహుజన రాజ్యం వస్తేనే సిర్పూర్ నియోజకవర్గం అభివృద్ధి : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 

దోపిడీ ఆగుతుందనుకుంటే సిర్పూర్ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. ఇక్కడి ప్రజల కోరిక మేరకు మాయావతిని అడిగి తాను సిర్పూర్ నుంచి ‌పోటి చేస్తానని చెప్పారు. బాసర త్రిబుల్ ఐటీలో దీపిక, లిఖిత ఎలా చనిపోయారో చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి నియోజకవర్గానికి చెందిన విద్యార్థినీ చనిపోతే సమాధానం చెప్పేవారే లేరని ఆందోళన వ్యక్తం చేశారు. ఓటు హక్కును డబ్బులకు, బిర్యానీలకు‌ అమ్ముకుంటే భూములను పోగొట్టుకుంటామని చెప్పారు. ఓట్లు అమ్ముకోకుండా అలోచనతో వేసి కేసీఆర్ ను, నరేంద్ర మోడీను ఓడించాలని పిలుపునిచ్చారు. కుమురంభీం జిల్లా బెజ్జూర్‌ మండల కేంద్రంలో‌ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రోడ్ షో నిర్వహించారు. 

ఆదివాసీల‌ను దూషించిన రషీద్ ను వెంటనే అరెస్టు చేయాలని, లేకపోతే తానే స్వయంగా పోలీసు స్టేషన్ ముందు కూర్చోని ధర్నా చేస్తానని ‌ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. సిర్పూర్ ఎమ్మెల్యే దౌర్జన్యాలకు భయపడి.. చాలామంది ప్రజలు గ్రామాలకు, పట్టణాలకు వలస వెళ్తున్నారని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే దౌర్జన్యాల‌ కోసమే.. విద్యార్థులు త్యాగాలు చేసి తెలంగాణ అమరులైనారా..? అని ప్రశ్నించారు. బహుజన రాజ్యం రావాలంటే బీఎస్పీని గెలిపించాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి కావాలంటే బీఎస్పీ అభ్యర్థి గెలుపొందాలన్నారు. 

‘‘అభివృద్ధి తీసుకురాకపోతే బెజ్జూర్‌ లోని మత్తడి వాగులో నన్ను బొందపెట్టండి. కొమురంభీం, అంబేద్కర్, ఛత్రపతి శివాజీ, సమ్మక్క సారక్క వారసుల కోసం ప్రభుత్వ ఉద్యోగం వదలి రాజకీయాల్లోకి వచ్చాను. పోడు భూములకు పట్టాలు రావాలంటే బహుజన సమాజ్ పార్టీ అధికారంలోకి రావాలి. తెలంగాణ రాష్ట్రంలో మేము అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం. అర్హులకు ఆసరా పింఛన్ రూ.5 వేలు ఇస్తాం. ప్రతి ఇంటికీ డాక్టర్‌ వచ్చే సౌకర్యం కల్పిస్తాం’’ అని వ్యాఖ్యానించారు. తెలంగాణ వచ్చిన తరువాత 82 వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు పనులను ఆంధ్ర వాళ్లుకు ఇచ్చిన ఘనుడు కేసీఆర్ అని ఆరోపించారు.