7 కొట్ల నగలతో దొంగ జంప్..ఫోన్ కొని దొర్కిండు

7 కొట్ల నగలతో దొంగ జంప్..ఫోన్ కొని దొర్కిండు

ఈ నెల 17న ఏడు కోట్ల రూపాయల విలువైన వజ్రాభరణాలతో హైదరాబాద్ నుంచి పరారైన కారు డ్రైవర్ తూర్పుగోదావరి జిల్లాలో పట్టుబడ్డాడు. భూమిలో పాతిపెట్టిన నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో నివసించే రాధిక నగల వ్యాపారం చేస్తుంటారు. ఆమె వద్ద శ్రీనివాస్ (28సం) కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. డెలివరీ ఇవ్వాల్సిన రూ.7 కోట్ల విలువైన వజ్రాభరణాలతో ఈ నెల 17న కారుతో పరారయ్యాడు. ఈ ఘటనపై ఎస్సార్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా, నిందితుడు శ్రీనివాస్ కోసం గాలింపు మొదలుపెట్టారు. 

మరోవైపు కారుతో కూకట్‌పల్లి చేరుకున్న శ్రీనివాస్ అక్కడ దానిని వదిలేసి నర్సంపేటలో ఉండే తన బంధువు వద్దకు వెళ్లాడు. కారులో పెట్రోలు కోసం యజమాని రాధిక ఇచ్చిన డెబిట్‌కార్డుతో ఫోన్ కొనుగోలు చేసిన శ్రీనివాస్, దానిని అతడి బంధువుకి ఇచ్చి అతడి ఫోన్‌ను తీసుకున్నాడు. ఆ తర్వాత అక్కడి నుంచి బస్సులో తూర్పుగోదావరి జిల్లాలోని తన స్వగ్రామం కొవ్వూరు వెళ్లి నగలను గొయ్యి తీసి భూమిలో పాతిపెట్టాడు. శ్రీనివాస్ కోసం గాలిస్తున్న పోలీసులు.. రాధిక ఇచ్చిన డెబిట్‌కార్డుతో ఫోన్ కొనుగోలు చేసినట్టు గుర్తించారు. ఆ కొత్త ఫోన్ ఐఎంఈఐ నంబరు ఆధారంగా శ్రీనివాస్ బంధువును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిచ్చిన సమాచారంతో నిందితుడిని సోమవారం అరెస్ట్ చేశారు. భూమిలో పాతిపెట్టిన నగలను స్వాధీనం చేసుకున్నారు. అతడిని విచారించి పూర్తి వివరాలు రాబట్టిన తర్వాత మీడియా ఎదుట హాజరు పరచనున్నట్టు తెలుస్తోంది. రూ.7 కోట్ల విలువైన నగలకు బిల్లులు, లెక్కలు లేకపోవడంతో పోలీసులు ఐటీ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో నగలు సీజ్ చేశారు.