
- మళ్లీ బిల్లులను పెండింగ్ పెడ్తున్న రాష్ట్ర సర్కార్
- సంక్రాంతి తర్వాత ట్రీట్మెంట్
- ఆపేస్తామంటున్న ప్రైవేట్ హాస్పిటల్స్
హైదరాబాద్, వెలుగు: ఆరోగ్యశ్రీ బకాయిలు మళ్లీ పేరుకుపోతున్నాయి. నెట్‌వర్క్ హాస్పిటళ్లకు నెలా నెలా బిల్లులు చెల్లిస్తామని సర్కార్ ఇచ్చిన హామీ అమలుకు నోచుకోవడం లేదు. దీంతో బకాయిలు చెల్లించాలని నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు సర్కార్ పెద్దల చుట్టూ తిరుగుతున్నారు. అయినా స్పందన లేకపోవడంతో మరోసారి సేవలు నిలిపివేసి సర్కార్‌పై ఒత్తిడి తేవాలని భావిస్తున్నారు. సర్కార్‌కు 20 రోజులు గడువు ఇచ్చామని, సంక్రాంతి తర్వాత సేవలను నిలిపివేస్తామని నెట్ వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. పాత, కొత్త బకాయిలు కలిపి సుమారు రూ.800 కోట్లు దాటాయని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే హాస్పిటళ్లకు రూ.450 కోట్లు చెల్లించామని ఆరోగ్యశ్రీ ఉన్నతాధికారి ఒకరు ‘వెలుగు’కు తెలిపారు. ఇంకా బకాయిలు ఉన్న మాట వాస్తవమే అయినప్పటికీ, రూ.800 కోట్లు ఉండే అవకాశం లేదన్నారు. ఎన్ని కోట్లు బకాయి అనేది మాత్రం సదరు ఆఫీసర్ వెల్లడించలేదు.
ప్రస్తుతం ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌లో 292 ప్రైవేటు హాస్పిటళ్లు ఉన్నాయి. ఆయా దవాఖానలకు పేషెంట్ వెళ్లగానే.. పేరు, ఊరు, వ్యాధి తాలూకు వివరాలన్నీ ఆన్ లైన్ లో ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కు చేరుతాయి. పేషెంట్ చేరినప్పటి నుంచి హాస్పిటల్‌కు నిధులు అందేవరకూ 4 దశల్లో వెరిఫికేషన్ జరుగుతుంది. ఈ 4 దశలు పూర్తయిన తర్వాత నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కు, హాస్పిటల్స్‌కు ఉన్న ఒప్పందం ప్రకారం ఈ ప్రక్రియంతా పూర్తి చేసి 40 రోజుల్లో డబ్బులు చెల్లించాలి. కానీ, ఈ ప్రక్రియ పూర్తి చేయడానికే తక్కువలో తక్కువ 6 నెలలు తీసుకుంటున్నారు. ఇక్కడే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చెప్పే బకాయిల లెక్కకు, హాస్పిటళ్ల మేనేజ్మెంట్లు చెప్పే బకాయిల లెక్కకు మధ్య తేడా వస్తోంది. అన్ని దశల వెరిఫికేషన్ పూర్తయి, నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మొత్తాన్నే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ బకాయిలుగా చూస్తోంది. పేషెంటుకు అందించిన చికిత్స వివరాలను ఆరోగ్యశ్రీకి పంపించినప్పటి నుంచే తమకు రావాల్సిన మొత్తాన్ని లెక్క వేసుకుని, బకాయిల మొత్తాన్ని హాస్పిటళ్ల యాజమాన్యాలు లెక్కగడుతున్నాయి. ప్రభుత్వ సూచన మేరకు ఆరోగ్యశ్రీ సిబ్బంది కుట్రపూరితంగా నెలల తరబడి ప్రాసెస్ చేయకుండా ఆపుతున్నారని, తద్వారా పేమెంట్ ఆలస్యం చేస్తున్నారని హాస్పిటళ్ల మాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి. అంతేగాకుండా, బకాయిలను తక్కువగా చూపేందుకు కూడా దీన్ని వాడుకుంటున్నారని డాక్టర్లు చెబుతున్నారు.
మారిన పేమెంట్ సిస్టమ్
హాస్పిటళ్లకు ఇవ్వాల్సిన డబ్బులను ఇదివరకు కేసుల వారీగా చెల్లించేవారు. దీంతో ఏయే కేసుకు సంబంధించిన డబ్బులు ఎంతొచ్చాయి? ఏయే కేసులకు డబ్బులు రావాల్సి ఉందో హాస్పిటళ్ల యాజమాన్యాలకు తెలిసేది. కానీ, ఇప్పుడు ఆ పద్ధతికి స్వస్థి చెప్పి బల్క్‌గా హాస్పిటళ్లకు డబ్బులు జమ చేస్తున్నారు. ఉదాహరణకు అన్ని కేసులు కలిపి ఒక పది లక్షలు పెండింగ్ ఉన్న హాస్పిటల్‌కు, బల్క్‌గా రూ.5 లక్షలు జమ చేస్తున్నారు. దీంతో ఆ డబ్బులు ఏయే కేసులకు రిలీజ్ చేశారో హాస్పిటళ్ల యాజమాన్యాలు తేల్చుకోలేకపోతున్నాయి. ఇలా బల్క్‌గా ఇవ్వడం వెనక మరో కుట్ర కూడా ఉందని హాస్పిటళ్ల యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నిబంధనల ప్రకారం పేమెంట్ల విషయంలో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ సిస్టమ్‌ను ఫాలో కావాలి. అంటే, ఫస్ట్ ఏ కేసుకు సంబంధించిన వివరాలు అప్‌లోడ్ అయితే, ఆ కేసు డబ్బులను ముందు ఇవ్వాలి. ఈ పద్ధతిలో హాస్పిటల్ స్థాయి, హాస్పిటల్‌కు రావాల్సిన బకాయిలతో సంబంధం ఉండేది కాదు. కానీ, ఇప్పుడు ఇచ్చే పద్ధతిలో ఏ హాస్పిటల్‌కు ఎక్కువ పెండింగ్ ఉంటే, ఆ హాస్పిటల్‌కు బల్క్‌గా ఎక్కువ అమౌంట్ జమ చేస్తున్నారు. దీంతో చిన్న చిన్న హాస్పిటళ్లు నష్టపోతున్నాయి. కొత్త పద్ధతి వల్ల లాబీయింగ్‌లకు కూడా అవకాశం కల్పించినట్టయిందని డాక్టర్లు ఆరోపిస్తున్నారు.
ప్యాకేజీల కమిటీ ఏమాయె?
ఆరోగ్యశ్రీ ప్యాకేజీలను సవరిస్తామని, మారిన పరిస్థితులకు తగ్గట్టు ప్యాకేజీల ధరలను నిర్ణయిస్తామని 2019లోనే నెట్‌వర్క్ హాస్పిటళ్లకు సర్కార్ హామీ ఇచ్చింది. కమిటీని వేస్తామని చెప్పింది. కానీ, నేటికీ ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఇప్పటికీ పాత ప్యాకేజీలకే హాస్పిటళ్లు చికిత్సను అందిస్తున్నాయి. సర్కార్ ఇచ్చేది తక్కువగా ఉందని చెప్పి, పేషెంట్ల నుంచి అదనంగా చార్జ్ చేస్తున్నాయి. ఒకవేళ చార్జెస్ చెల్లించేందుకు పేషెంట్ ఒప్పుకోకపోతే, ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించేందుకు నిరాకరిస్తున్నయి. పేషెంట్ల నుంచి నామమాత్రపు చార్జెస్ కూడా తీసుకోకపోతే తమ రోజువారీ ఖర్చులకు కూడా డబ్బులు సరిపోవని డాక్టర్లు చెబుతున్నారు.
ఈహెచ్‌ఎస్ కంట్రిబ్యూషన్ ఊసేది?
ప్రభుత్వం టైంకు డబ్బులు విడుదల చేయకపోవడంతో ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులకు పోతున్న ఉద్యోగులకు చుక్కెదురవుతోంది. ఆరోగ్యశ్రీ పేషెంట్ల మాదిరిగానే వారినీ చిన్నచూపు చూస్తున్నారు. దీంతో చాలా మంది ఉద్యోగులు సొంత డబ్బులతో ట్రీట్మెంట్ చేయించుకోవడానికే ఇష్టపడుతున్నారు. రెగ్యులర్‌గా హాస్పిటళ్లకు బకాయిలు చెల్లిస్తే ఈ సమస్య ఉండదని భావించి, తమ జీతాల్లో నెలకు కొంత ఈహెచ్ఎస్ స్కీమ్‌కు కంట్రిబ్యూట్ చేయాలని ఉద్యోగులు నిర్ణయించుకున్నారు. ప్రభుత్వానికి ఇప్పటికే చాలాసార్లు వినతిపత్రాలూ ఇచ్చారు. ప్రభుత్వంతో ఈ దిశగా చర్చలు కూడా జరిగాయి. కానీ, ఇప్పటివరకూ ఈ విషయంలో ఓ నిర్ణయానికి రాలేకపోయారు. దీంతో ఉద్యోగులకు కూడా దవాఖాన్ల తిప్పలు తప్పడం లేదు.