బీఆర్ఎస్​లోకి ఆర్ఎస్పీ ప్రవీణ్‌‌కుమార్‌‌‌‌

బీఆర్ఎస్​లోకి ఆర్ఎస్పీ ప్రవీణ్‌‌కుమార్‌‌‌‌
  • బీఎస్పీకి రాజీనామా 
  • కేసీఆర్​తో భేటీ.. రేపు పార్టీలో చేరే చాన్స్ 
  • బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తుపై బీజేపీ కుట్ర చేసింది: ఆర్ఎస్పీ
  • పొత్తు రద్దు చేసుకోవాలని హైకమాండ్ నన్ను ఆదేశించింది
  • మాట తప్పలేకనే పార్టీకి రిజైన్ చేస్తున్నట్టు ప్రకటన

హైదరాబాద్, వెలుగు: బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌‌‌‌ఎస్ ప్రవీణ్‌‌కుమార్‌‌‌‌ ఆ పార్టీకి రాజీనామా చేశారు. బీఆర్‌‌‌‌ఎస్‌‌తో పొత్తు తెగదెంపులు చేసుకోవాలని మా పార్టీ అధిష్టానంపై బీజేపీ ఒత్తిడి తెచ్చింది. దీంతో బీఆర్ఎస్​తో పొత్తు రద్దు చేసుకోవాలని మా పార్టీ హైకమాండ్ నన్ను ఆదేశించింది. పొత్తు విషయంలో కేసీఆర్‌‌‌‌కు ఇచ్చిన మాట తప్పడం నాకు ఇష్టం లేదు. అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నాను. భవిష్యత్తులో బీఆర్‌‌ఎస్‌‌తో, కేసీఆర్‌‌‌‌తో కలిసి పని చేస్తాను” అని ఆయన ప్రకటించారు. రాజీనామా విషయాన్ని శనివారం సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు వెల్లడించారు.

రాజీనామా తప్ప తనకు వేరే దారి కనిపించడం లేదన్నారు. చాలా బాధతో ఈ నిర్ణయం తీసుకున్నానని.. అందరూ అర్థం చేసుకోవాలని, క్షమించాలని కోరారు. తన వల్ల పార్టీకి, పార్టీ వల్ల తనకు నష్టం జరగడం తనకిష్టం లేదన్నారు. నమ్ముకున్న సిద్ధాంతాలను, క్యారక్టర్‌‌‌‌ను చంపుకుని పనిచేయలేనన్నారు. ‘‘పొత్తు ఒప్పందంలో భాగంగా ఒడిదుడుకులు ఎదురైనా ముందుకు సాగాల్సిందే. కష్టసుఖాలు పంచుకోవాల్సిందే.

ఇదే నేను నమ్మిన ధర్మం. నిన్న బీఎస్పీ, బీఆర్‌‌‌‌ఎస్ పొత్తు వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ఈ పొత్తును భగ్నం చేయాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. కవిత అరెస్టు కూడా ఇందులో భాగమే. బీజేపీ కుట్రలకు భయపడి నేను నమ్ముకున్న విలువలను వదులుకోలేను. నా ఈ ప్రస్థానాన్ని ఆపలేను. పార్టీలో నాకు చాన్స్​ ఇచ్చిన మాయావతికి, ఎంపీ రామ్‌‌జీ గౌతమ్​కు కృతజ్ఞతలు. మాయావతి చిరకాలం నా హీరోగా ఉండిపోతారు. చివరి వరకు బహుజన వాదాన్ని నా గుండెలో పదిలంగా దాచుకుంటా. కాన్షీరాం బాటలోనే నడుస్తా”అని ‘ఎక్స్’లో ఆర్‌‌‌‌ఎస్పీ పేర్కొన్నారు. 

ఎవరికీ తలవంచను.. 

బీఎస్పీకి రాజీనామా చేయడానికి ముందే కేసీఆర్‌‌‌‌కు ఆర్‌‌‌‌ఎస్పీ సమాచారం ఇచ్చారు. నందినగర్‌‌‌‌లోని కేసీఆర్ ఇంటికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. కేసీఆర్‌‌‌‌, బీఆర్‌‌‌‌ఎస్ నేతలతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అనంతరం అక్కడే ఆర్‌‌‌‌ఎస్పీ మీడియాతో మాట్లాడారు. ‘‘ఎన్డీఏ, ఇండియా కూటములతో కలవకుండా తటస్థంగా ఉన్న వారితో పొత్తు పెట్టుకోవచ్చునన్న బీఎస్పీ మార్గదర్శకాల ప్రకారమే కేసీఆర్‌‌‌‌తో పొత్తులపై చర్చలు జరిపాం. అధిష్టానానికి సమాచారం ఇచ్చి, వారి అనుమతితోనే బీఆర్‌‌‌‌ఎస్‌‌తో పొత్తును ఫైనల్ చేసుకున్నాం.

పొత్తులో భాగంగా నాగర్‌‌‌‌కర్నూల్‌‌, హైదరాబాద్ సీట్లను వారు మాకు కేటాయించారు. పార్టీ అధిష్టానం అనుమతితో ఇదే విషయాన్ని ప్రజలకు వెల్లడించాం. కానీ ఈ పొత్తు నచ్చని మోదీ, అమిత్‌‌షా ద్వయం బీఎస్పీ హైకమాండ్‌‌పై ఒత్తిడి తీసుకొచ్చింది. పొత్తు రద్దు చేసుకుంటున్నట్టు ప్రెస్‌‌ మీట్ పెట్టి ప్రకటించాలని హైకమాండ్ నన్ను ఆదేశించింది. ఒక్కసారి మాట ఇస్తే తప్పేది ఉండదు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కలిసి నడవాలన్నదే పొత్తు ధర్మం. అలాంటి పొత్తే బీఆర్‌‌‌‌ఎస్‌‌కు, మాకు కుదిరింది. దేశం కోసం ప్రాణత్యాగానికి సిద్ధమై పోలీసుగా పని చేశాను.

రాజకీయాల్లోకి వచ్చాక అదే విధంగా పనిచేసి, పార్టీని గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లాను. ఇప్పుడు బీజేపీ కుటిల రాజకీయాలకు తలొగ్గి పొత్తును రద్దు చేస్తే, బహుజనులకు నేను అన్యాయం చేసిన వాడినవుతాను. అందుకే బీఎస్పీకి రాజీనామా చేశాను. తెలంగాణలో బహుజనుల ప్రయోజనాల కోసం, దేశంలో రాజ్యాంగాన్ని బతికించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాను” అని ఆర్‌‌‌‌ఎస్పీ తెలిపారు. ‘‘400 ఎంపీ సీట్లు ఇస్తే ‘రాజ్యాంగాన్ని మార్చేస్తాం.. రద్దు చేస్తాం’ అని బీజేపీ చెబుతోంది. రాజ్యాంగం పోతే దేశంలో బహుజనులకు అన్యాయం జరుగుతుంది. అలా జరగనివ్వం. ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గను. ప్రాణం పోయినా రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం” అని అన్నారు.  

బీఆర్ఎస్ నుంచే ఆర్ఎస్పీ పోటీ.. 

కార్యకర్తలు, అభిమానులతో చర్చించి తన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానని ఆర్ఎస్పీ తెలిపారు. అయితే భవిష్యత్తులో కేసీఆర్‌‌‌‌, బీఆర్‌‌‌‌ఎస్‌‌తో కలిసి పని చేస్తానని కూడా చెప్పారు. దీంతో బీఆర్‌‌‌‌ఎస్‌‌లో ప్రవీణ్ చేరిక ఖాయమైందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. నీలం జెండాను వదిలేసిన ఆర్‌‌‌‌ఎస్పీ.. సోమవారం తెలంగాణ భవన్‌‌లో గులాబీ కండువా కప్పుకుంటారని వారు అంటున్నారు. నాగర్‌‌‌‌కర్నూల్‌‌ ఎంపీగా బీఆర్‌‌‌‌ఎస్‌‌ పార్టీ గుర్తుపైనే ఆర్ఎస్పీ పోటీ చేస్తారని పేర్కొంటున్నారు. ఆయనతో పాటు బీఎస్పీలో ఇన్నాళ్లు కీలకంగా వ్యవహరించిన మరికొందరు నేతలు కూడా బీఆర్ఎస్ లో చేరనున్నట్టు తెలిసింది.