ఇంటి వద్దకే ఆర్టీసీ కార్గో సేవలు!

ఇంటి వద్దకే ఆర్టీసీ కార్గో సేవలు!
  •     పికప్, డోర్ ​డెలివరీకి అధికారుల నిర్ణయం
  •     దిల్​సుఖ్​నగర్​లో ప్రయోగాత్మకంగా ప్రారంభం
  •     త్వరలో పక్క రాష్ట్రాల్లోనూ మరిన్ని లాజిస్టిక్ సెంటర్ల ఏర్పాటుకు ప్రణాళికలు

హైదరాబాద్, వెలుగు : నిర్వహణ భారంతో నష్టాల పాలవుతున్న ఆర్టీసీని లాభాల బాటలోకి తీసుకువచ్చేందుకు వివిధ రకాల ఆదాయ వనరులపై అధికారులు దృష్టి పెట్టారు. అందులో భాగంగా త్వరలో లాజిస్టిక్​సేవలను విస్తృతం చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్రతో కలిపి దాదాపు 60 లాజిస్టిక్​ సెంటర్లను ఏర్పాటు చేసిన ఆఫీసర్లు.. రానున్న రోజుల్లో పక్కరాష్ట్రాల్లోనూ మరిన్ని సెంటర్ల ఏర్పాటుకు సమాయత్తం అవుతున్నారు. ప్రస్తుతం ఆర్టీసీకి వచ్చే ఆదాయానికి, నిర్వహణ వ్యయానికి పొంతన లేకుండా పోయింది.

కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రవేశపెట్టిన మహాలక్ష్మిపథకంతో ఆర్టీసీ ఆక్యుపెన్సీ 50 నుంచి 70 శాతానికి పెరిగింది. దీంతో సంస్థను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మరోవైపు పూర్తిస్థాయిలో స్వయం సమృద్ధి సాధించే దిశలో ఆర్టీసీని నడిపించేందుకు సంస్థ మేనేజింగ్​డైరెక్టర్​సజ్జనార్​కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. అందులో భాగంగానే వివిధ రకాల ఉత్పత్తులు, వస్తువుల రవాణా, డెలివరీ కోసం లాజిస్టిక్​ సర్వీసులను ప్రారంభించారు. దాంతో సంస్థకు భారీగా లాభాలను తీసుకురావాలన్నదే తన వ్యూహంగా ఆయన చెప్తున్నారు. 

ఇక డోర్​ డెలివరీ సర్వీసుగా మార్పులు

ఆర్టీసీ ప్రారంభించిన లాజిస్టిక్​ సెంటర్లను పెద్దసంఖ్యలో విస్తరించి.. ప్రజలకు  పిక్ అప్​ అండ్ ​డెలివరీ సేవలు విస్తృతం చేయాలని నిర్ణయించారు. అంటే ప్రజల ఇంటి వద్దకే వచ్చి వస్తువులను పికప్​ చేసుకోవడం, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాటిని డెలివరీ చేయాలని నిర్ణయించారు. ఇటీవల దిల్​సుఖ్​​నగర్​లో ప్రయోగాత్మకంగా ఇలాంటి సెంటర్​ను ఏర్పాటు చేశారు. దీనికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని అధికారులు తెలిపారు. దీంతో రాబోయే కాలంలోలాజిస్టిక్​సేవలను  పికప్ అండ్​డెలివరీ సర్వీసులుగా మార్చాలని కూడా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

ప్రస్తుతం ఆర్టీసీకి ప్రధాన ఆదాయం (97శాతం) టికెట్​ల అమ్మకం ద్వారానే వస్తోంది. టికటేతర ఆదాయం కేవలం 3శాతమే ఉన్నట్టు అధికారులు తెలిపారు. దీనిని మరింత పెంచడంపై అధికారులు దృష్టిపెట్టారు. అందులో భాగంగానే లాజిస్టిక్​సర్వీసులను ప్రజలకు అందుబాటులోకి తీసుకు వచ్చారు. ఆర్టీసీ ప్రత్యామ్నాయ ఆదాయం పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో లాజిస్టిక్స్‌‌‌‌ విభాగ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ను మరింతగా విస్తరిస్తున్నామని సంస్ధ ఎండీ సజ్జనార్‌‌‌‌ తెలిపారు. వినియోగదారులకు వేగవంతమైన సేవలందించేందుకు త్వరలోనే పార్శిళ్లను ఇంటి వద్దనే పికప్

డెలివరీ చేస్తామని ఆయన చెప్పారు. ఆర్టీసీ లాజిస్టిక్స్‌‌‌‌ విభాగం స్టేట్​లో అతివేగంగా పార్శిళ్లను డెలివరీ చేసే వ్యవస్థ అని అన్నారు. ప్రస్తుతం రోజుకు సగటున 15 వేల పార్శిళ్లను బట్వాడా చేస్తున్నామని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 60 లక్షల పార్శిళ్లను ఆర్టీసీ బస్సుల్లో రవాణా చేశామని పేర్కొన్నారు. ఆ పార్శిళ్ల రవాణా వల్ల ఆర్టీసీకి సుమారు రూ.120 కోట్ల రెవెన్యూ వచ్చిందని ఆయన వెల్లడించారు.

350 కోట్ల ఆదాయం లక్ష్యం

ప్రైవేటు సంస్థలు కార్గో, పార్శిళ్ల ద్వారా భారీగా లాభాలను గడిస్తున్నాయి. ఏడాదికి వెయ్యి కోట్ల ఆదాయాన్ని ఆ సంస్థలు పొందుతున్నాయని, తెలంగాణ నుంచి దేశ వ్యాప్తంగా దాదాపు 8 వేల కోట్ల కార్గో వ్యాపారం జరుగుతున్నదని అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర పరిధిలోనే వెయ్యి కోట్ల వ్యాపారం జరుగుతున్నందున.. ఆర్టీసీ ఈ రంగంలో వినూత్న పద్ధతులను అవలంభించి ఏడాదికి కనీసం రూ.350 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవాలని భావిస్తున్నట్టు అధికారులు తెలిపారు.

కాగా, ఇప్పటి వరకు కార్గో ద్వారా సంస్థ  గత సంవత్సరం రూ.120 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకున్నట్టు అధికారులు తెలిపారు. మరిన్ని వినూత్న పద్ధతులను అనుసరించడం ద్వారా రానున్న రోజుల్లో కార్గో రంగంలో ఆర్టీసీ కూడా మరింత పురోగతి సాధించే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.